ఆక్సిజన్‌ ట్యాంకర్లతో ఇండియాకు బయలుదేరిన యుద్ధనౌకలు

V6 Velugu Posted on May 06, 2021

దేశంలో కరోనా తీవ్రత పెరుగుతుండటం, ఆక్సిజన్ కొరత ఏర్పడటంతో ఆక్సిజన్ దిగుమతి కోసం భారత ప్రభుత్వం సరికొత్త మార్గాన్ని ఎంచుకుంది. ఆక్సిజన్ రవాణా కోసం ఇప్పటికే యుద్ధ విమానాలను ఉపయోగిస్తున్న ప్రభుత్వం.. తాజాగా భారత నౌకాదళానికి చెందిన యుద్ద నౌకలను కూడా ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. యుద్ద నౌకల ద్వారా ఆక్సిజన్ సిలిండర్లను, భారీ ఆక్సిజన్‌ ట్యాంకర్లను, కొన్ని రకాల వైద్య పరికరాలను దేశానికి తీసుకువస్తున్నట్లు తూర్పు నౌకాదళ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం సముద్రసేతు-2 పేరుతో కోవిడ్‌ సహాయ చర్యలను నౌకా దళం చేపట్టిందని అధికారులు తెలియజేశారు. ఆక్సిజన్‌ కొరత తీర్చడానికి భారత స్నేహపూర్వక దేశాలు ముందుకు వస్తున్నాయని అధికారులు తెలిపారు. బహ్రెయిన్‌ నుంచి ఒక్కొక్కటి 27 టన్నుల సామర్థ్యం గల రెండు లిక్విడ్‌ ఆక్సిజన్‌ ట్యాంకర్లతో ఐ.ఎన్‌.ఎస్‌.తల్వార్‌ యుద్ధనౌక బుధవారం మంగళూరు నౌకాశ్రయానికి చేరుకుందన్నారు. ఐ.ఎన్‌.ఎస్‌.కోల్‌కతా అనే మరో యుద్ధనౌక కువైట్‌ నుంచి రెండు 27 టన్నుల ఆక్సిజన్‌ ట్యాంకర్లు, 400 ఆక్సిజన్‌ సిలిండర్లు, 47 కాన్సన్‌ట్రేటర్లతో బుధవారం బయలుదేరిందన్నారు. మరో నాలుగు యుద్ధనౌకలు కువైట్‌, ఖతార్‌ల నుంచి తొమ్మిది 27 టన్నుల ఆక్సిజన్‌ ట్యాంకులు, 1,500 ఆక్సిజన్‌ సిలిండర్లను తీసుకురానున్నాయని తెలిపారు. ఐ.ఎన్‌.ఎస్‌.ఐరావత్‌ యుద్ధనౌక బుధవారం సింగపూర్‌ నుంచి ఎనిమిది 27టన్నుల ఆక్సిజన్‌ ట్యాంకులు, 3,600 ఆక్సిజన్‌ ట్యాంకులతో బుధవారం విశాఖకు బయలుదేరిందన్నారు. త్వరలోనే ఇవన్నీ ఇండియాకు రానున్నాయని.. తద్వారా ఆక్సిజన్ కొరత తీరనుందని అధికారులు తెలిపారు.

Tagged India, Indian Navy, oxygen cylinders, , oxygen shortage, oxygen tankers, Indian Warships, Samudra Setu II

Latest Videos

Subscribe Now

More News