మీటర్ రీడింగ్ లేకుండానే నల్లా బిల్లులు

మీటర్ రీడింగ్ లేకుండానే నల్లా బిల్లులు

హైదరాబాద్, వెలుగు : సిటీలోని కొన్ని ఏరియాల్లో ఓ వైపు తాగు నీటి సప్లయ్ సమస్య ఉండగా.. మరోవైపు వాటర్ బోర్డు అధికారులు నల్లా కలెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మీటర్లు లేకుండానే క్యాన్ నంబర్లు జారీ చేస్తున్నారు. ఆ తర్వాత మీటర్ రీడింగ్ లేకుండానే బిల్లులు ఇస్తున్నారు. ప్రతినెల రూ.250 కి పైగా బిల్లులు జారీ చేస్తున్నారు. శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఈ తరహాలో బిల్లులు ఇస్తుండటంతో వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు. వాటర్ బోర్డు నీటిని వినియోగిస్తున్న వారితో పాటు వాడని వారికి కూడా బిల్లులు అందుతున్నాయి. ఇప్పటికే గ్రేటర్ పరిధిలో ప్రభుత్వం అమలు చేస్తున్న ఫ్రీ వాటర్ స్కీమ్​తో వాటర్ బోర్డుకి ఆదాయం తగ్గుతోంది. కేవలం శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లతోనే వాటర్ బోర్డుకి ఎక్కువ ఇన్​కమ్ వస్తుంది. ఆ ఆదాయానికి కూడా గండిపడేలా అధికారులు పని చేస్తున్నారు. ఈ విషయం ఇటు ఉన్నతాధికారులకు తెలియకుండా మేనేజ్ చేస్తున్నారు. ప్రతినెలా బిల్లులు ఇస్తున్నామని చెప్పడానికి రీడింగ్ లేకుండా బిల్లులు జారీచేస్తున్నారు. దరఖాస్తులు వచ్చిన వెంటనే క్యాన్ నంబర్​తో పాటు మీటర్ పెట్టాల్సి ఉన్నప్పటికీ ఆ విషయాన్ని పట్టించుకోవట్లేదు. మీటర్ లేకుండా క్యాన్ నెంబర్లను ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు.

స్పెషల్ డ్రైవ్​లోనూ పట్టించుకోవట్లే..

బకాయిలు వసూల్ చేసేందుకు కొన్నిరోజులుగా వాటర్ బోర్డు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. కమర్షియల్ నల్లా కనెక్షన్లకైతే బిల్లులు చెల్లించకుండా కనెక్షన్లను కట్ చేస్తామని ఉన్నతాధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. కొన్నిచోట్ల కట్ చేసి మరీ వసూల్ చేస్తున్నారు. డొమెస్టిక్ బిల్లులను కూడా గట్టిగా వసూల్ చేస్తున్నారు. కానీ అదే టైమ్​లో మీటర్లు ఉన్నాయా? లేదా? అన్నది మాత్రం పట్టించుకోవడం లేదు. బిల్లులు చెల్లించాలని మాత్రమే ఒత్తిడి తెస్తున్నారు. సిటీ శివారులో  బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్‌‌నగర్, నిజాంపేట్‌‌, బడంగ్‌‌పేట, బండ్లగూడ జాగీర్‌‌, మీర్‌‌పేట మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు 23 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల మీటర్లు లేకుండానే బిల్లులు ఇస్తున్నారు. కనీసం మీటర్లు కొనుగోలు చేయాలని కూడా చెప్పడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్ల ఏడాది కాలంగా బిల్లులు జారీ అవుతున్నట్లు సమాచారం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలని శివారు ప్రాంతాల జనం కోరుతున్నారు.

మీటర్లు తప్పనిసరి..

వినియోగదారులకు క్యాన్ నెంబర్ జారీ చేసిన వెంటనే మీటర్ బిగించాలి. మీటర్​ను వినియో గదారుడు కొనాల్సి ఉన్నప్పటికీ, దాన్ని బిగించాల్సిన బాధ్యత వాటర్​బోర్డు సిబ్బందిపైనే ఉంటుంది. ఈ విషయంపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం. అన్నిచోట్ల మీటర్లు ఉండేలా చూస్తాం. - స్వామి, వాటర్ బోర్డు డైరెక్టర్