మల్లన్న సాగర్ పై  వాటర్ బోర్డు నజర్ 

మల్లన్న సాగర్ పై  వాటర్ బోర్డు నజర్ 

 

  • సిటీకి 50 ఎంజీడీల నీటి తరలింపునకు పరిశీలన
  • తక్కువ వ్యయంతోనే  పూర్తిచేసే అవకాశం 
  • ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై అధికారుల్లో చర్చ

హైదరాబాద్,వెలుగు: గ్రేటర్ సిటీ తాగునీటి అవసరాలను తీర్చుకునేందుకు మల్లన్న సాగర్​పై వాటర్ బోర్డు నజర్ పెట్టింది. రిజర్వాయర్ నుంచి నీటిని తెచ్చుకునేందుకు అధికారులు పరిశీలన చేస్తున్నారు. గత సమ్మర్ లో  గోదావరి పైప్​లైన్ లోకి మల్లన్న సాగర్​నీటిని పంపించి.. సిటీకి నీటిని తరలించారు. ఇకముందు కూడా శాశ్వతంగా తీసుకుంటే ఎలా ఉంటుందనే దానిపై అధికారులు దృష్టి సారించారు. ప్రస్తుతం ఉస్మాన్​సాగర్​, హిమాయత్​సాగర్, కృష్ణా ప్రాజెక్టు మూడు దశలు, గోదావరి, సింగూరు, మంజీరాల నుంచి నీటి సరఫరా చేస్తున్నారు.

ఆయా రిజర్వాయర్ల నుంచి రోజుకు దాదాపు 500 ఎంజీడీలు తెస్తుండగా పూర్తిస్థాయిలో సరిపోవడంలేదు. సిటీ విస్తరణ, జనాభా పెరుగుదల, వివిధ పరిశ్రమలు, ప్రాజెక్టులు, విల్లాలు, కొత్త కాలనీలు వెలుస్తుండగా.. అంతే స్థాయిలో నీటి అవసరాలు పెరిగిపోయాయి.  ముఖ్యంగా ఔటర్ వరకు సిటీని విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించగా.. ఇందుకు అనుగుణంగా భవిష్యత లో 50 ఏండ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థను పకడ్బందీగా రూపొందించాలని వాటర్​బోర్డు అధికారులు భావించారు. ముందుగా సిటీకి అతి సమీపంలోని మల్లన్న సాగర్​నుంచి తాగునీటిని తీసుకునే దానిపై ప్రతిపాదనలు సిద్ధంచేసేందుకు అధికారులు నిర్ణయించారు.

సాధ్యాసాధ్యాలపై కసరత్తు

సిద్ధిపేట జిల్లాలోని మల్లన్న సాగర్​నుంచి  సికింద్రాబాద్​ దాదాపు 78 కి.మీ దూరంలో ఉంది.  గజ్వేల్​మీదుగా తీసుకొచ్చి శామీర్​పేటలో పైప్​లైన్​నిర్మాణంతో పాటు ట్రీట్ మెంట్ ప్లాంట్ నిర్మించి.. సిటీకి సరఫరా చేస్తే ఎలా ఉంటుందనే దానిపై అధికారులు ఆలోచిస్తున్నారు. మేడ్చల్, కాప్రా, మల్కాజిగిరి, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి వంటి ప్రాంతాలకు నీటిని సరఫరా చేసే చాన్స్ ఉంటుంది. ప్రస్తుతం ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలను రోజుకు 160 ఎంజీడీలు తరలిస్తున్నారు. మల్లారం వద్ద వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ నిర్మించారు.

అక్కడి నుంచి ముర్మూర్, గజ్వేల్​మీదుగా శామీర్​ పేట వద్ద నిర్మించిన రిజర్వాయర్​లోకి నీటిని తరలిస్తున్నారు. అక్కడి నుంచి సిటీలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. మల్లన్న సాగర్​ వద్ద ప్రాజెక్టు చేపడితే ప్రస్తుతం ఉన్న పైప్​లైన్​తో పాటు సమాంతరంగా మరో పైప్​లైన్​ నిర్మించడానికి అవకాశం ఉంటుంది. దీనికి ప్రత్యేకంగా భూ సేకరణ చేయాల్సిన అవసరం ఉండదని అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా ప్రాజెక్టును తక్కువ ఖర్చుతో పూర్తి చేయొచ్చంటున్నారు. 

సమ్మర్ కష్టాలకు చెక్ పెట్టొచ్చు

మల్లన్నసాగర్ వద్ద పైప్ లైన్​ప్రాజెక్ట్ ను నిర్మిస్తే సిటీలో సమ్మర్ నీటి కష్టాలను చెక్ పెట్టొచ్చని అధికారులు ఆలోచిస్తున్నారు. సమ్మర్ లో సాగర్, ఎల్లంపల్లిలో​నీటి నిల్వలు తగ్గితే పంపింగ్​చేసే పరిస్థితి నెలకొంది. కేవలం పంపింగ్​పనులకే రూ. కోట్లలో ఖర్చు చేస్తున్నారు. మరోవైపు మల్లన్నసాగర్​నుంచి చాలా తక్కువ వ్యయంతోనే నీటిని సరఫరా చేసేందుకు చాన్స్ ఉందని అధికారులు పేర్కొంటున్నారు.