మురుగు వదిలించి..మూసీలోకి శుద్ధి జలాలు

మురుగు వదిలించి..మూసీలోకి శుద్ధి జలాలు

హైదరాబాద్,వెలుగు : మూసీ బ్యూటిఫికేషన్ ప్రాజెక్టులో భాగంగా నదిలో మురుగునీటిని తొలగించే పనులకు వాటర్ బోర్డు రెడీ అయింది. ముఖ్యంగా మురుగునీరు ప్రవహించకుండా ఇప్పటికే పలు ప్రాంతాల్లో డైవర్షన్​పనులను కొనసాగిస్తోంది. తాజాగా నదిలోకి శుద్ధి చేసిన జలాలను వదిలేందుకు అధికారులు ఎస్టీపీలను సిద్ధం చేస్తున్నారు.  వందశాతం మురుగు నీరు శుద్ధి చేసే లక్ష్యంతో చేపట్టిన ప్రాజెక్టుల్లో భాగంగా ఇప్పటికే అంబర్​పేట, నాగోల్, నల్లచెరువు తదితర ప్రాంతాల్లోని ఎస్టీపీలకు మురుగునీటిని తరలించి శుద్ధి చేస్తుండడమే కాకుండా..  అనంతరం ఆ నీటిని నదిలోకి వదిలే పనులు చేపట్టారు. ఆయా ఎస్టీపీల పక్కన మరికొన్ని ఎస్టీపీలను కూడా అధికారులు నిర్మిస్తున్నారు. ఆ పనులు కూడా చాలా వరకు పూర్తయ్యే దశకు చేరాయి. కాగా నల్లచెరువు, పెద్ద చెరువు వద్ద నిర్మించిన ఎస్టీపీలను సీఎం రేవంత్​రెడ్డి ఇటీవలే ప్రారంభించారు. కొత్తగా నిర్మిస్తున్న చెరువుల వద్ద కూడా పూర్తయితే మూసీలో శుద్ధి చేసిన జలాలు ప్రవహించే చాన్స్ ఉంటుంది. 

అంతేకాకుండా దశలవారీగా మూసీ పరిసరాల్లో మరిన్ని ఎస్టీపీలను నిర్మించేందుకు వాటర్​బోర్డు అధికారులు సిద్ధమవుతున్నారు.  సీవరేజీ మాస్టర్ ప్లాన్, ఎస్టీపీల ప్రాజెక్టు ప్యాకేజీ–1 లో భాగంగా నల్ల చెరువు (86.5 ఎంఎల్​డీ) ఎస్టీపీని నిర్మించారు. దీనికి 119.80 కోట్లు ఖర్చు చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా నాచారం, కంటోన్మెంట్, కాప్రా, బాబా నగర్, ఈఎస్ఐ, హెచ్ఎంటీ నగర్, హైకోర్టు కాలనీ, సేశాయి నగర్, ద్వారకానగర్, కమలా నగర్, సౌత్ స్వరూప్ నగర్, ఓల్డ్ రామంతాపూర్, ప్రేమ్ నగర్, పటేల్ నగర్, ఆజాద్ నగర్, కల్యాణ్ నగర్, కేసీఆర్ కాలనీ, కేటీఆర్ కాలనీ, మినీ శిల్పారామం, ఉప్పల్ భగాయత్, ఆదిత్య హాస్పిటల్, రామంతాపూర్, ఐడీఐ ఉప్పల్, ఉప్పల్ స్టేడియం, మోడ్రన్ బేకరీ రోడ్డు, ఉప్పల్, హబ్సిగూడ, శ్రీనివాస కాలనీ, విజయపురి కాలనీల మురుగు నీటిని శుద్ధి చేస్తోంది. ఈ ప్రక్రియతో మూసీక్యాచ్ మెంట్ ఏరియాలోకి సీవరేజీ నీటి ప్రవాహం తగ్గుతుంది. 

శుద్ధి జలాలను బిల్డింగ్, గార్డెనింగ్ అవసరాలకు వాడుకునేలా.. 

శుద్ధి చేసిన నీటిని చెరువులు, కుంటల్లోకి విడుదల చేయడం ద్వారా కాలుష్యం కావు. శుద్ధి చేసిన నీటిని సమీపంలోని మూసీలోకి, భవన నిర్మాణాలు, గార్డెనింగ్ వంటి మానవేతర అవసరాలకు కూడా వాడుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.  వాటర్​బోర్డు చేపట్టే ఎస్టీపీ ప్రాజెక్టులో భాగంగా నాగోల్, అంబర్ పేట్ లో కొత్తగా రెండు ముగురునీటి శుద్ధి కేంద్రాలను నిర్మిస్తున్నారు. వీటి నిర్మాణం కూడా దాదాపు పూర్తి కావస్తుంది.  వీటి పనులను ఇటీవలే వాటర్​బోర్డు ఎండీ సుదర్శన్​రెడ్డి పరిశీలించారు.  వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు. 

సివిల్ పనులు పూర్తి చేసి ఎలక్ట్రో మెకానిక్ మెషీన్లను అమర్చే  పనులను స్పీడప్ చేయాలని ఆదేశించారు. తర్వాత అంబర్ పేట్ ఎస్టీపీని పరిశీలించారు. దాని వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.హైదరాబాద్ అర్బన్ ఆగ్లోమెరేషన్ పరిధిలో ప్రస్తుతం రోజూ 1950 ఎంఎల్డీల మురుగు నీరు ఉత్పత్తి అవుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో 1650 ఎంఎల్డీలు కాగా, మిగిలిన 350 ఎల్​ఎల్డీలు బల్దియా బయట ప్రాంతంలో ప్రవహిస్తున్నాయి. ఈనీటిని శుద్ధి చేసి తిరిగి మూసీలోకి విడుదల చేయడం ద్వారా నదిలో మురుగు నీరు తగ్గుతుందని అధికారులు పేర్కొంటున్నారు.