ఓఆర్ఆర్ వాటర్ ప్రాజెక్ట్–2 పనులను పూర్తి చేయాలి : సుదర్శన్ రెడ్డి

ఓఆర్ఆర్ వాటర్ ప్రాజెక్ట్–2 పనులను పూర్తి చేయాలి : సుదర్శన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు  :  ఓఆర్ఆర్ వాటర్ ప్రాజెక్ట్–2 పనులను తొందరగా పూర్తి చేయాలని.. సమ్మర్​లోగా రిజర్వాయర్లను అందుబాటులోకి తేవాలని వాటర్ బోర్డు ఎండీ సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఓఆర్ఆర్ ప్రాజెక్ట్–2  ప్యాకేజీ–2లో భాగంగా రాజేంద్రనగర్ సెగ్మెంట్ కిస్మత్​పురా, మంచిరేవుల, బైరాగిగూడ, గంధంగూడ, బృందావన్ కాలనీ, ఎర్రకుంట అభ్యుదయనగర్, గండిపేటలో నిర్మాణం పూర్తయిన రిజర్వాయర్లను శుక్రవారం ఆయన సందర్శించారు. రిజర్వాయర్లలో ఇన్ లెట్, ఔట్ లెట్లను పరిశీలించారు. డిస్ట్రిబ్యూషన్ లైన్లను, కొత్త రిజర్వాయర్ల వల్ల లబ్ది జరిగే ప్రాంతాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

మిగిలిపోయిన డిస్ట్రిబ్యూషన్ లైన్లు, ఇతర పనులను పూర్తి చేసి ఈ సమ్మర్​లోగా వందశాతం నీటిని సప్లయ్ చేసేలాగా పనులను వేగవంతం చేయాలన్నారు. కొత్తగా నిర్మాణం పూర్తి చేసుకున్న రిజర్వాయర్ల వివరాలతో సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు.  అనంతరం ఉస్మాన్ సాగర్ జలాశయాన్ని సందర్శించారు. రిజర్వాయర్ గేట్లను పరిశీలించి నీటి మట్టాలకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉస్మాన్​సాగర్ సబ్ డివిజన్ ఆఫీసును సందర్శించి జలాశయ నిర్మాణం పూర్తయిన నాటి నుంచి నీటి మట్టాల లాగ్ బుక్​ను పరిశీలించారు.

వందేండ్ల చరిత్ర ఉన్న ఈ బుక్​ను చూసి సుదర్శన్ రెడ్డి ఆశ్చర్యానికి గురయ్యారు. ఆయన వెంట టెక్నికల్, ప్రాజెక్టు డైరెక్టర్–2 రవికుమార్, సీజీఎం టీవీ శ్రీధర్, అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్యాకేజీ–2 లో భాగంగా కొత్తగా 38 సర్వీస్ రిజర్వాయర్లు, 1,270 కి.మీ మేర పైన్ లైన్ నెట్​వర్క్​ను నిర్మాణం చేశారు. దాదాపు రూ.587 కోట్లతో దీన్ని నిర్మించారు. ఈ రిజర్వాయర్​తో రాజేంద్రనగర్, శామీర్ పేట, మేడ్చల్, కుత్బుల్లాపూర్, పటాన్ చెరు. ఆర్సీపురం, బొల్లారం ప్రాంతాల్లోని 1.96 లక్షల మందికి నీటి అవసరాలు తీరుతాయి.