మొండి బకాయిలపై వాటర్ బోర్డు నజర్

మొండి బకాయిలపై వాటర్ బోర్డు నజర్
  • నెలరోజులుగా కొనసాగుతున్న స్పెషల్ డ్రైవ్
  • ముందుగా కమర్షియల్ బిల్డింగులకు నోటీసులు
  • ఫ్రీ వాటర్ స్కీం వచ్చాక తగ్గిన బోర్డు ఆదాయం

హైదరాబాద్, వెలుగు: నల్లా బిల్లు మొండి బకాయిలపై వాటర్​బోర్డు అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. డొమెస్టిక్‌, నాన్ డొమెస్టిక్ క‌నెక్షన్లు, సీవరేజ్ క‌నెక్షన్ల పాత‌ బ‌కాయిలు, ప్రస్తుత బిల్లుల‌ వ‌సూల కోసం స్పెష‌ల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. కమ‌ర్షియ‌ల్‌న‌ల్లా క‌నెక్షన్ల బిల్లుల విషయంలో క‌ఠినంగా వ్యవ‌హ‌రించాల‌ని వాటర్​ఎండీ దానకిశోర్​ఆదేశించడంతో గ్రౌండ్​లెవల్​లో తిరుగుతూ నోటీసులు జారీ చేస్తున్నారు. వారం తర్వాత కూడా స్పందన లేకుంటే నల్లా కనెక్షన్లు కట్ చేస్తున్నారు. నెలరోజులుగా స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుండగా, ఇప్పటివరకు వెయ్యి మంది కమర్షియల్ వినియోగదారులకు నోటీసులు ఇచ్చారు. వీరి నుంచి దాదాపుగా రూ.9 కోట్లు రావాల్సి ఉంది. కొన్ని నెలలుగా నల్లా బిల్లు కట్టని డొమెస్టిక్ వినియోగదారులపైనా అధికారులు ఫోకస్​పెట్టారు. ఉచిత నీటి(20 వేల లీటర్లు)పథకానికి దరఖాస్తు చేసుకోని వారి నుంచి బిల్లులు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఉచిత తాగునీటి ప‌థ‌కానికి ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చని, బ‌కాయిలు చెల్లిస్తే స‌రిపోతుంద‌ని అధికారులు చెబుతున్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం నుంచే  1,200 కోట్లు రావాలి

బకాయిల రూపంలో వాటర్​బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.1,200కోట్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.250 కోట్లు రావాల్సి ఉంది. కానీ చెల్లింపులు చేయడం లేదు. అధికారులు అడిగినా స్పందన ఉండడం లేదు. దీంతో ఖజానా నింపుకోవడానికి వాటర్​బోర్డు అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఉచిత తాగునీటి ప‌థకానికి అర్హత లేని వారి నుంచి నెల‌కు రూ.22 కోట్లు రావాల్సి ఉండగా కేవలం నెలకి రూ.7 కోట్లు మాత్రమే వస్తున్నాయి. ఇలా అన్ని వర్గాల నుంచి వాటర్​బోర్డుకు బకాయిలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నోటీసులు ఇచ్చి గడువు లోపు చెల్లించకపోతే క‌నెక్షన్లను తొల‌గిస్తున్నారు.

కలెక్షన్​ తగ్గడంతోనే డ్రైవ్

వాటర్ బోర్డు ఆదాయం క్రమంగా తగ్గుతుండటంతో అధికారులు పెండింగ్ బిల్లుల వసూలపై ఫోకస్​పెట్టారు. ప్రభుత్వం 20 వేల లీటర్ల ఫ్రీ వాటర్ స్కీం అమల్లోకి తెచ్చాక బోర్డు ఆదాయం ఒక్కసారిగా తగ్గిపోయింది. ఫండ్స్​సరిపోక కరెంట్ బిల్లులు కూడా చెల్లించలేకపోతోంది. ఇప్పటికే రూ.3,200 కోట్ల బకాయి పడింది. ఇక బోర్డు పరిధిలోని ఉద్యోగుల జీతాలు, మెయింటెనెన్స్ కోసం నెలకు దాదాపు రూ.65 కోట్ల వరకు అవసరముంది. కానీ జలమండలికి మాత్రం నెలకు రూ.60 కోట్లు మాత్రమే వస్తున్నాయి. కరోనాకి ముందు వంద కోట్లకు పైగా కలెక్షన్ వచ్చేది. ఫ్రీ వాటర్ స్కీం అమల్లోకి వచ్చాక 50 శాతం ఆదాయం తగ్గిపోయింది. బోర్డు ఖజానా ఖాళీ అవడంతో అధికారులు పనులు పూర్తిచేసిన చిన్న చిన్న కాంట్రాక్టర్లకూ వెంటనే బిల్లులు చెల్లించలేకపోతున్నారు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.