హైదరాబాద్ కు పొంచి ఉన్న నీటి గండం!.. తగ్గిన గ్రౌండ్ వాటర్ లెవల్స్

హైదరాబాద్ కు  పొంచి ఉన్న నీటి గండం!.. తగ్గిన గ్రౌండ్ వాటర్ లెవల్స్
  • ఈ ఏడాదిలో సరిగా కురవని వానలు
  • చాలా చోట్ల పడిపోయిన నీటి మట్టాలు
  • జనం నీటిని పొదుపుగా వాడుకోవాలంటున్న అధికారులు

హైదరాబాద్, వెలుగు : వచ్చే వేసవిలో గ్రేటర్ సిటీకి నీటి గండం పొంచి ఉంది. వర్షాలు సరిగా పడకపోవడంతో తగినంత గ్రౌండ్ వాటర్ పెరగలేదు. దీంతో కొన్ని ఏరియాల్లో నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉందని సంబంధిత శాఖ అధికారులు పేర్కొంటున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో గతేడాది నవంబర్, ఈ ఏడాది నవంబర్​తో పోలిస్తే వాటర్ లెవెల్స్ చాలావరకు తగ్గిపోయాయి.  ఆయా జిల్లాల్లో మండలాల వారీగా 52 ప్రాంతాల్లో నీటిమట్టాలను చూస్తే 49 ప్రాంతాల్లో పడిపోయాయి.  హైదరాబాద్ జిల్లాలో 10  ప్రాంతాల్లో గ్రౌండ్ వాటర్​ను పరిశీలిస్తుండగా ఒక్కచోట కూడా పెరగలేదు. రంగారెడ్డి జిల్లాలో 27 మండలాల్లో చూస్తే అంతటా గ్రౌండ్ వాటర్ తగ్గింది.  మేడ్చల్ జిల్లాలో 15 మండలాలకు మూడుచోట్ల మాత్రమే పెరిగాయి. మిగతా 12  ప్రాంతాల్లో తగ్గాయి.

హైదరాబాద్ జిల్లాలో ఒక్క చోటా పెరగలే

జిల్లా వ్యాప్తంగా సగటున1.47 మీటర్ల నీటిమట్టాలు తగ్గాయి. కుల్సుంపురాలో గతేడాది నవంబర్ తో  పోలిస్తే 1.89 మీటర్ల లోతులోకి గ్రౌండ్​ వాటర్ పడిపోయింది. సైదాబాద్ లో 1.46 మీటర్లు, దారుల్ షిషాలో 1.66 మీటర్ల లోతుకు తగ్గాయి. ఈసారి వానలు సరిగా పడకపోవడంతో పాటు నీటి వాడకం  పెరగడంతో అన్ని ప్రాంతాల్లో తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు. బోర్ల ద్వారా నీటిని తోడేయడంతోనే ఈ పరిస్థితి ఏర్పడుతుందంటున్నారు. వర్షాలు పడని సమయంలో పొదుపుగా వాడితే నీటి ఇబ్బందులు ఉండవని గ్రౌండ్ వాటర్ డిపార్ట్ మెంట్ అధికారులు సూచిస్తున్నారు.

రంగారెడ్డి జిల్లాలో అంతే..

రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా గతేడాదితో చూస్తే సగటున 3.26 మీటర్ల  నీటిమట్టాలు తగ్గాయి. శేరిలింగంపల్లిలో గతేడాది నవంబర్ లో 7.15 మీటర్ల ఎత్తులో ఉండగా ఈసారి 15.96 మీటర్ల లోతుకి పడిపోయాయి. ఒక్కసారిగా 8.81 మీటర్ల మేర గ్రౌండ్ వాటర్ తగ్గింది. హయత్ నగర్ లో అధికంగా 7.79 మీటర్ల లోతుకి పడిపోయాయి. గతేడాది 3.76 మీటర్ల ఎత్తులో ఉండగా, ఈఏడాది 11.55 మీటర్ల లోతుకు తగ్గిపోయాయి. ఇబ్రహీంపట్నంలోనూ గతేడాది 6.64 మీటర్ల గ్రౌండ్ వాటర్ ఈఏడాది 12.96 మీటర్ల లోతుకి తగ్గింది. ఇలా అన్నిచోట్ల ఎంతో కొంతమేర నీటిమట్టాలు తగ్గాయి.

మేడ్చల్ జిల్లాలో బెటర్

మేడ్చల్ జిల్లాలో గతేడాది నవంబర్​తో పోలిస్తే ఈ నవంబర్​లో జిల్లాలోని మూడు ప్రాంతాల్లో మినహా 12 చోట్ల  గ్రౌండ్ వాటర్ పడిపోయింది. జిల్లావ్యాప్తంగా సగటున 2.36 మీటర్ల మేర తగ్గింది.  అధికంగా కూకట్ పల్లిలో   4.76 మీటర్ల ఎత్తులో ఉండగా, ఈఏడాది 9.16 మీటర్ల లోతుకు పడిపోయాయి.  అల్వాల్​లో గతేడాది 3.42 మీటర్ల ఎత్తులో ఉండగా ఈసారి 7.92 పడిపోయాయి. కుత్బుల్లాపూర్ , బాలానగర్ ఇలా చాలా చోట్ల తగ్గాయి. ఉప్పల్​లో గతేడాదితో చూస్తే  ఈసారి  3.14 మీటర్ల ఎత్తులోకి  గ్రౌండ్ వాటర్ పెరిగింది. బాచుపల్లిలో 1.73, కాప్రాలో 0.03మీటర్ల ఎత్తుకి నీటి మట్టాలు పెరిగాయి. ఈ మూడు మినహా అంతట పడిపోయాయి.