- భూగర్భ జలాల పెంపునకు నిర్మిస్తోన్న ఎన్ హెచ్ ఏఐ
- వరదలతో రోడ్డు, పొలాలు కోతకు గురికాకుండా చర్యలు
- తొలిసారిగా రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా నిర్మాణం
కరీంనగర్, వెలుగు: హైవేల వెంట పారే వరద నీటిని ఒడిసిపట్టేందుకు ఎన్ఏహెచ్ఐ(నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా) భారీ ఇంకుడు గుంతలను నిర్మిస్తోంది.తొలిసారిగా రాష్ట్రంలో కరీంనగర్ - హనుమకొండ నేషనల్ హైవే – 563 వెంట ప్రయోగాత్మకంగా వాటర్ హార్వెస్టింగ్ పిట్స్(ఇంకుడు గుంతలు)ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టింది. భారీ వర్షాలు కురిసినప్పుడు వరదంతా రోడ్డు పక్కన పొలాలను ముంచెత్తకుండా, రోడ్డు కోతకు గురికాకుండా ఎక్కడికక్కడే ఇంకుడు గుంతల్లోకి వెళ్లేలా చర్యలు తీసుకుంటోంది.
ఫోర్ లేన్ తో 68 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న హైవే వెంట140 పిట్స్ నిర్మిస్తుండగా.. తద్వారా ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలాలు సమృద్ధిగా పెరిగి రైతులకు ప్రయోజనం కలగనుంది. హై వే ఫ్లై ఓవర్లపై నుంచి వరద ఎక్కువగా కిందికి వచ్చే చాన్స్ ఉండడంతో రెండు వైపులా వీటిని నిర్మిస్తోంది.
రెండు రకాల చాంబర్స్ నిర్మాణం
హైవేల వెంట ఆర్టిఫిషియల్ గ్రౌండ్ వాటర్ రీచార్జింగ్ కు ఇంకుడు గుంతలు నిర్మించాలని గతంలోనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో రెండు రకాల చాంబర్స్ నిర్మిస్తుండగా ఒకటి గుండ్రటి ఆకారంలో, మరొకటి చతురాస్రకారంలో ఉంటాయి. గుండ్రటి ఆకారంలోని ఇంకుడు గుంతల్లో 100 ఫీట్ల లోతున బోర్ కూడా వేస్తున్నారు. వరద ఎంతమేర కింది వచ్చి వంపు ప్రాంతంలో ఆగిపోతుందో అక్కడే వీటిని ఏర్పాటు చేస్తున్నారు.
వరద నేరుగా సైడ్ డ్రెయిన్ ద్వారా వచ్చి గుంతల్లో చేరనుంది. ఇసుక, కంకర వంటి మెటీరియల్ పోసి నీళ్లు ఇంకేలా చేస్తున్నారు. వరద మొదట ఇంకుడు గుంతలోకి చేరి నిండిన తర్వాత రెండో గుంతలోకి వెళ్తుంది. నీళ్లతోపాటు చెత్త కూడా చేరకుండా అడ్డుకునేలా ఐరన్ జాలీలు ఏర్పాటు చేస్తున్నారు.
వరద వచ్చినప్పుడు, తగ్గాక ఆ చెత్తను తొలగించనున్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా గుంతలపై పైకప్పులు ఏర్పాటు చేయనున్నారు. ఫ్లై ఓవర్స్ పై నుంచి కిందికి వరద తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో 10 మీటర్ల వెడల్పుతో 11 ఫీట్ల లోతుతో నిర్మిస్తున్నారు. వీటిలోనూ100 ఫీట్ల బోర్ వేస్తున్నారు. తద్వారా ఇంకుడు గుంతలతో సమీపం లోని బోర్లు రీచార్జ్ కానున్నాయి.
హైవే వెంట బోర్ల నీరే మొక్కల పెంపకానికి..
హైవే పొడవునా, డివైడర్ మధ్యలో, రోడ్డు వెంట గ్రీనరీ ఉండేలా మొక్కలు పెంచనున్నారు. వాటి పెంపకానికి కావాల్సిన నీళ్లను ట్యాంకర్లకు బదులు బోర్ల నుంచే నిత్యం సరఫరా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా దుర్శేడు నుంచి హన్మకొండ వరకు 140 ఇంకుడు గుంతలు నిర్మించాల్సి ఉంది. ఇప్పటి వరకు 15 గుంత ల నిర్మాణం పూర్తైనట్టు సైట్ సూపర్ వైజర్ తెలిపారు. కొన్ని చోట్ల రైతులు తమ పొలాల వెంట ఇంకుడు గుంతల నిర్మాణంపై అభ్యంతరం చెప్తున్నట్లు తెలిసింది. చెత్త జమ కాకుండా ఎప్పటికప్పుడు నిర్వహణ కూడా చూడాలని రైతులు కోరుతున్నారు.
