బెంగళూరులో నీటి సంక్షోభం

బెంగళూరులో నీటి సంక్షోభం
  • బెంగళూరులో కొన్ని అపార్ట్​మెంట్లలో రూల్స్.. నీటి కొరత తీవ్రం
  • కార్లు కడగొద్దని, పేపర్ ప్లేట్లే వాడాలని పిలుపు
  • గేటెడ్ కమ్యూనిటీల్లో రేషన్ పద్ధతిలో నీళ్ల సరఫరాకూ నిర్ణయం 

బెంగళూరు:  కర్నాటక రాజధాని బెంగళూరులో నీటి సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. దీంతో గేటెడ్ కమ్యూనిటీలు, అనేక అపార్ట్ మెంట్లలో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు రూల్స్ స్ట్రిక్ట్ చేశాయి. కార్లు కడగొద్దు.. నీటి అనవసర వినియోగం ఆపండి.. వీలైతే స్నానం చేయొద్దు.. కుదిరితే తడి గుడ్డతోనే వళ్లు తుడుచుకోండి.. అంటూ సిటీలోని కనకపుర రోడ్డులోని ప్రెస్టీజ్ ఫాల్కన్ సిటీ అపార్ట్ మెంట్ల సంఘం పిలుపునిచ్చింది. 

కొన్ని కమ్యూనిటీల్లో రేషన్ పద్ధతిలో నీటిని సరఫరా చేస్తున్నారు. కొన్ని కమ్యూనిటీల్లో అయితే.. నీటి వాడకం 20% వరకూ తగ్గించాల్సిందేనని లేకపోతే ఆయా ఫ్లాట్ల ఓనర్లకు అదనంగా వాటర్ చార్జీలు విధిస్తామని హెచ్చరికలు సైతం జారీ అయ్యాయి. నగరానికి నీటి సరఫరాకు కీలకమైన కేఆర్ఎస్ రిజర్వాయర్ లో నీళ్లు అడుగంటిపోయాయి. నీటి కొరత నేపథ్యంలో ప్రైవేట్ ట్యాంకర్లు దొరకడం కూడా కష్టమైపోతోంది. అందుకే ఆయా గేటెడ్ కమ్యూనిటీల్లో ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టారు. 

భోజనం చేసేందుకు పేపర్ ప్లేట్లు మాత్రమే వాడాలని, చెంచాలు, గ్లాసుల వంటివి డిస్పోజబుల్ వి మాత్రమే వినియోగించాలని సూచిస్తున్నారు. స్విమ్మింగ్ పూల్స్ ను అయితే ఎట్టి పరిస్థితిలోనూ నీటితో నింపొద్దని నిర్ణయం తీసుకున్నారు. వైట్ ఫీల్డ్ ఏరియాలోని ఓ అసోసియేషన్  నీటి వినియోగాన్ని కట్టడి చేసేందుకు సెక్యూరిటీగార్డుల ద్వారా మానిటర్ చేస్తోంది. కొన్ని రోజులుగా బెంగళూర్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ నుంచి నీళ్ల సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో తిరిగి బోరు మోటర్ల వాడకాన్ని షురూ చేసింది. 

నీటి వాడకాన్ని తగ్గించని ఫ్లాట్లకు అదనపు చార్జీలు విధిస్తామని హెచ్చరించింది. నగరంలో నీటి కొరత నివారణకు చర్యలు తీసుకుంటున్నామని బెంగళూరు రూరల్ ఎంపీ డీకే సురేశ్ చెప్పారు. అయినా, కరువు నేపథ్యంలో నీటి సంరక్షణకు అపార్ట్ మెంట్ల అసోసియేషన్లు చేపడుతున్న ఈ చర్యలను స్వాగతిస్తున్నామని పర్యావరణవేత్తలు మెచ్చుకుంటున్నారు.