వాటర్ ప్రాబ్లమ్స్ .. లీకేజీ రిపేర్లు..ఏ పనైనా.. ఏఎంఎస్

 వాటర్ ప్రాబ్లమ్స్ .. లీకేజీ రిపేర్లు..ఏ పనైనా.. ఏఎంఎస్
  •     నామినేషన్​ కింద పనుల అప్పగింతకు స్వస్తి​
  •     సమయం వృథాకు, నిధుల దుబారాకు చెక్​
  •      సెక్షన్ లో ఏడాది పాటు  కాంట్రాక్టర్ కు పనులు 

హైదరాబాద్,వెలుగు : సిటీలో తాగునీటి సరఫరాలో ప్రాబ్లమ్స్ రాకుండా.. పైప్​లైన్​ లీకేజీలకు చెక్ పెట్టేందుకు నిధుల దుబారాను తగ్గించేందుకు మెట్రోవాటర్​బోర్డు కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టింది. యాన్యువల్​మెయింటెనెన్స్​సిస్టమ్​(ఏఎంఎస్​)పేరిట అమల్లోకి తెచ్చింది. దీని కింద ఒక్కో సెక్షన్​కు ఒక్కో కాంట్రాక్టర్​ను ఏడాది పాటు పనులు చేసేలా నియమించింది. ఏ ప్రాబ్లమ్ వచ్చినా వెంటనే సదరు కాంట్రాక్టర్​సాల్వ్ చేస్తారు. దీంతో సమయం వృథా కాదు. నిధుల వ్యయం తగ్గుతుంది.  పైప్​లైన్​లీకేజీలు, పొల్యూషన్ వాటర్ సప్లయ్​ అయితే..

టెండర్లు వేసి కాంట్రాక్టర్లకు ఇచ్చి పనులు చేయించి బిల్లులు ఇవ్వడం పాత పద్ధతి. దీనిద్వారా ప్రతి ఏటా ఒక్కో డివిజన్​పరిధిలో దాదాపు రూ.48 లక్షల వరకు ఖర్చు చేస్తుంది. అయినా.. పనుల ఆలస్యం,  కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం వంటి ఇబ్బందులు వస్తున్నాయి. ఇక అలాంటి సమస్యలు తలెత్తకుండా తొలిసారిగా వాటర్​బోర్డులో ఏఎంఎస్​ను  అమలు చేస్తుండగా..

సెక్షన్ల పరిధిలో పైప్​లైన్​ లీకేజీలు, పొల్యూషన్ వాటర్ సప్లయ్ వంటి ఇబ్బందులను చాలా తక్కువ సమయంలోనే పూర్తి చేస్తున్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు. ఏఎంఎస్‌‌‌‌ ద్వారా బోర్డు పరిధిలో  ఓఅండ్‌‌‌‌ ఎం (ఆపరేషన్స్‌‌‌‌ అండ్‌‌‌‌ మెయింటనెన్స్‌‌‌‌) వింగ్ పరిధిలో 400 మంది వరకు కాంట్రాక్టర్లు ఉన్నారు. 

63 సెక్షన్లలో అమలు 

మెట్రోవాటర్​ బోర్డు  నీటి సరఫరా, మురుగు నీటి నిర్వహణ పనులు చేస్తుంది. సిటీకి రోజుకు 590 ఎంజిడీల నీటిని అందిస్తుంది. ఇందులో అధికశాతం నీటి సరఫరా పంపింగ్​ద్వారానే జరుగుతుంది. పలు సందర్భాల్లో  లీకేజీలు, పైప్​లైన్లు పగలడం వంటి సమస్యలు వస్తుంటాయి.

వాటికి మరమ్మతు పనులు వెంటనే చేసేందుకు ఏఎంఎస్​ఎంతో అనుకూలంగా ఉందని అధికారులు పేర్కొంటున్నారు.  బోర్డు పరిధిలో 29 ఆపరేషన్​అండ్​మెయింటెనెన్స్​డివిజన్లు ఉండగా.. ఒక్కో డివిజన్​లో 5  నుంచి 8 వరకు సెక్షన్లకు కలిపి మొత్తంగా 63 సెక్షన్లలో ఏఎంఎస్​ అమలులోకి తెచ్చారు. 

నామినేషన్ పద్ధతిన కాకుండా.. 

గతంలో మాదిరిగా నామినేషన్ల పద్ధతి ద్వారా కాకుండా ఏఎంఎస్‌‌‌‌ ద్వారా కేటాయిస్తున్నారు. ఈ పద్ధతిలో సెక్షన్ల వారీగా టెండర్‌‌‌‌ ప్రక్రియ నిర్వహిస్తారు.  అర్హత కలిగిన ఏజెన్సీకి ఏడాదికి పనులు అప్పగిస్తారు. సివరేజీ పనుల నిర్వహణ ఓఅండ్‌‌‌‌ఎం కిందకు వస్తాయి. వాటిని సదరు కాంట్రాక్టర్లతో చేయిస్తారు. తద్వారా దుబారాకు చెక్‌‌‌‌ పడడంతోపాటు పనుల్లో పారదర్శకత ఉండి, సకాలంలో పూర్తి చేసేందుకు వీలుంటుంది .

సెక్షన్ల పరిధిలో సదరు కాంట్రాక్టర్ల వివరాలను కూడా అందుబాటులో ఉంచుతారు. తమ ప్రాంతంలో సమస్యలు వస్తే ఎవరైనా వెంటనే అధికారులు,  సదరు కాంట్రాక్టర్​దృష్టికి తీసుకెళ్లడానికి చాన్స్ కూడా ఉంటుందని వాటర్ బోర్డు అధికారులు తెలిపారు.