యాసంగి అదను దాటిపోతున్నా క్లారిటీ ఇయ్యని సర్కారు

యాసంగి అదను దాటిపోతున్నా క్లారిటీ ఇయ్యని సర్కారు
  • యాసంగి అదను దాటిపోతున్నా క్లారిటీ ఇయ్యని సర్కారు
  • కోట్లు పెట్టి ప్రాజెక్టులు కట్టినా కాల్వలు లేక ఇక్కట్లు
  • ఈసారి కూడా చెరువులు, బోర్లే దిక్కా
  • అయోమయంలో ఆయకట్టు రైతులు

నాగర్​కర్నూల్, వెలుగు:  ఉమ్మడి మహబూబ్​నగర్​జిల్లాలో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంల కింద యాసంగిలో 6 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరిచ్చే విషయంపై సర్కారు ఎటూ తేల్చడం లేదు. వరి సాగు వద్దని ప్రభుత్వం చెప్పడంతో రైతులు ఏం పంటలు వేయాలోనని సతమతమవుతున్నారు. ఆరు తడి పంటలు వేసుకుందామంటే.. నీరిస్తారో లేదో తెలియక గందరగోళానికి గురవుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, సంగంబండ లిఫ్ట్ ​స్కీంల కింద యాసంగిలో దాదాపు 6 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సి ఉంటుంది. అక్టోబర్​లో ప్రాజెక్టుల వారీగా నీటి ఇండెంట్ పెట్టిన ఇంజనీర్లు సర్కార్ అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు. కల్వకుర్తి లిఫ్ట్ కింద మూడు ప్యాకేజీలలో దాదాపు 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సి ఉండగా 25 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు ఇరిగేషన్ ఆఫీసర్లు ప్రభుత్వానికి ఇండెంట్ పెట్టారు. నెట్టెంపాడు లిఫ్ట్ కింద 15 టీఎంసీలు, భీమా కింద 15 టీఎంసీలు అవసరం అవుతాయని అంచనా వేశారు. లిఫ్ట్​లతో సంబంధం లేకుండా గ్రావిటీ ద్వారా  జూరాల కింద 1.10 లక్షల ఎకరాలు, ఆర్డీఎస్ కింద 87 వేల ఎకరాలు, కోయిల్​సాగర్ కింద 30 వేల ఎకరాలకు సాగునీరిచ్చే అవకాశం ఉన్నా దీనిపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఫీల్డ్ లెవల్​లో ఇంజనీర్లు మాత్రం ఆరుతడి పంటలకు నీరిస్తామని చెప్తున్నారు. మూడు ప్రధాన లిఫ్ట్ స్కీంల కింద యాసంగికి నీరిస్తారా.. ఇస్తే ఎప్పుడిస్తారనేది ప్రశ్నార్థకంగా మారుతోంది.
బుంగ పడ్డా పట్టించుకోలే..
నెట్టెంపాడు లిఫ్ట్​లో ర్యాలంపాడు రిజర్వాయర్ ప్రధానమైంది. వర్షాకాలంలో దీనికి బుంగ పడి దాదాపు 2.5 టీఎంసీల నీరు వృథాగా బయటకుపోయింది. ఆ తర్వాత కూడా దీన్ని బాగు చేసే ప్రయత్నాలు చేయలేదు. ప్రస్తుతం ర్యాలంపాడు రిజర్వాయర్ లో ఫుల్ కెపాసిటీ నీటిని నిల్వ చేసే అవకాశం లేనందున ఇక్కడ సాగు విస్తీర్ణం సగానికి తగ్గిపోతుందని అంచనా. నెట్టెంపాడు కింద 2 లక్షల ఎకరాలకు సాగు నీరిస్తున్నట్లు కాగితాల్లో చూపిస్తున్నా ప్రస్తుతం 1.50 లక్షల ఎకరాలకు మించి సాగవ్వడం కష్టమే. ర్యాలంపాడు బుంగ ఎఫెక్ట్​తో ఎన్ని ఎకరాలకు నీరిస్తారో అధికారులు ఎటూ తేల్చకపోవడం ప్రాజెక్ట్ కింద రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. కల్వకుర్తి కింద ఆరు నియోజకవర్గాల పరిధిలో 2.5 లక్షల ఎకరాలకు సాగు నీరిచ్చే అవకాశాలున్నా ప్రభుత్వం అనుమతిస్తే తప్ప కృష్ణా నీటిని లిఫ్ట్ చేసే చాన్స్​ లేదు. కల్వకుర్తి కింద 45 టీఎంసీల నీటిని తీసుకోవచ్చు. కానీ వానాకాలం, యాసంగి రెండు సీజన్లకు కలిపినా 25 నుంచి 30 టీఎంసీలు మించడం లేదు. రిజర్వాయర్లు లేక అందుబాటులో ఉన్న 500  చెరువులు నింపుతున్నారు. మెయిన్ కెనాల్స్​కు మోటార్లు పెట్టి కిలోమీటర్ల దూరం పైప్​లైన్లు వేసి నీటిని తరలించుకుంటున్నారు. 
కాల్వలకు రిపేర్లు లెవ్వు.. 
పిల్ల కాల్వలకు దిక్కులేదు
లిఫ్ట్ ఇరిగేషన్ అంటే చెరువులు నింపడం, మెయిన్ కెనాల్స్​కు మోటార్లు తగిలించుకోవడం అనే కొత్త అర్థాన్ని చెప్తున్న ప్రభుత్వ పెద్దలు డిస్ట్రిబ్యూటరీ నెట్​వర్క్​ను పక్కన పెట్టేశారు. ఒక్కో జిల్లాలో చెరువులు నింపుతూ వాటి కింద బోర్లు రీచార్జ్ అవుతున్నాయి కాబట్టి కాలువలు అవసరం లేదనే కొత్త వాదన తెర మీదికి తెస్తున్నారు. కల్వకుర్తి లిఫ్టు స్కీంలో 320 కిలోమీటర్లు, నెట్టెంపాడు  లిఫ్టు స్కీంలో భాగంగా 220 కిలోమీటర్ల మెయిన్ కెనాల్, 446 కిలోమీటర్ల  సబ్ కెనాల్స్, భీమా లిఫ్టు ఫేజ్-2 కింద 15వ ప్యాకేజీ పరిధిలో 29.06 కిలో మీటర్ల పొడవునా కాల్వలు ఉన్నాయి.  పంటల పొలాలకు డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్​లేకపోవడంతో చెరువులు నింపుకొనేందుకు మాత్రమే పనికివస్తున్నాయి. చెరువులు నిండగా మిగిలిన నీళ్లు వాగులపాలైతున్నాయని ఇంజినీర్లు అంటున్నారు. కెనాల్స్​ కెపాసిటీ పెంచుతామని, లైనింగ్​ చేసి డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ మెరుగుపరుస్తామని సర్కారు ఏడేండ్లుగా చెబుతున్నా నేటికీ అమలు చేయకపోవడంతో సగం ఆయకట్టుకు నీరందడం లేదు. దీంతో రైతులు కాల్వ నీళ్లపై ఆశలు పెట్టుకోకుండా బోర్లపై ఆధారపడుతున్నారు. 
పొలాలు వరికే పనికొస్తయ్​
ప్రభుత్వం ఒకసారి మక్కలు వేయొద్దంటది.. ఇంకోసారి పత్తి వద్దంటది.. ఇప్పుడేమో వరి వద్దంటది. సర్కారోళ్లు చెప్పినట్లు వింటే మేం పంటలు పండించినట్టే. డిండి వాగు పక్క పొలాలు వరికి తప్ప దేనికి పనికి రావు. అట్లాంటప్పుడు ఏం పంటలు వేసి బతకాలే. సర్కారు వడ్లు కొనకున్నా వరే పండిస్తా. – కోట్ల లింగమయ్య, నాగర్​కర్నూల్

కాల్వలకు నీరు ఇడ్వకపోతే ఎట్లా?
కేఎల్ఐ కాల్వతో కుమ్మరి కుంట నిండుతది. దాని కింద వరి సాగు చేసుకుంటం. కేసీఆర్ కాల్వలకు నీళ్లు ఇడువొద్దని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. కాల్వలు, చెరువుల కింద సాగు చేసే మా గతి ఏంది. ప్రభుత్వం రైతుల గురించి ఆలోచించాలే. – వెంకటేశ్వరాచారి, జప్తి సదగోడు