
- తుడిచిపెట్టుకుపోయిన ఐదు గ్రామాలు
- మట్టి దిబ్బల కింద మరికొంత మంది
- రంగంలోకి ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్
- కుండపోత వర్షాలతో సహాయక చర్యలకు ఆటంకం
- చలియార్ నదిలో కొట్టుకుపోయిన డెడ్‌బాడీలు
- రిలీఫ్ క్యాంప్‌పై పడిన బండరాళ్లు
- విపత్తుపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్ర్భాంతి
- కొండ చరియలు 123 మంది మృతి
వయనాడ్ (కేరళ): కేరళలోని వయనాడ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. సోమవారం అర్ధరాత్రి దాటాక ఒక్కసారిగా వరద పోటెత్తడంతో కొండచరియలు విరిగిపడి వేలాది ఇండ్లు కొట్టుకుపోయాయి. మెప్పాడి, ముండకై, చురల్‌మల, అట్టమాల, నూల్పూజ గ్రామాల్లో చోటుచేసుకున్న ఈ ఘోర విపత్తులో 123 మంది చనిపోయారని, 128 మంది వరకు గాయపడ్డారని అధికారులు వెల్లడించారు.
ఇండ్లల్లో పడుకున్న చోటే కొందరు సజీవ సమాధి అయ్యారు. మృతుల్లో మహిళలతో పాటు చిన్నారులు కూడా ఉన్నారు. చురల్‌మల, ముండకై ఊళ్లు మొత్తం కొట్టుకుపోయాయి. మిగిలిన గ్రామాలు సగం బురదలో కూరుకుపోయాయి. ఎటు చూసినా బురద.. బండరాళ్లే కనిపిస్తున్నాయి. సుమారు 800 మందికి పైగా ఆచూకీ లభించడం లేదు. ఇంకా చాలా మంది మట్టి దిబ్బల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. ప్రాణాలతో బయటపడినవాళ్లంతా రిలీఫ్ క్యాంపులకు తరలివెళ్తున్నారు.
అర్ధరాత్రి కొండ చరియలు విరిగిపడటంతో పాటు బురద కొట్టుకురావడంతో ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. వందలాది వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. ఘటనా స్థలాలకు 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న చలియార్ నదిలో పదుల సంఖ్యలో డెడ్ బాడీలను గుర్తించారు. ముండకై టీ ఎస్టేట్ లో పనిచేస్తున్న 600 మంది కార్మికుల ఆచూకీ తెలియడం లేదు. వారి కోసం భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. కాగా, వయనాడ్ విపత్తు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బుధవారం, గురువారం సంతాపదినాలుగా ప్రకటించింది.
శిథిలాల కింది నుంచే కాపాడాలని ఫోన్లు
చాలామంది బాధితులు శిథిలాల కింద నుంచి ఫోన్లు చేసి తమ ప్రాణాలు కాపాడాలని ప్రాధేయపడుతున్నారు. ‘‘ఇల్లు మొత్తం పోయింది. మా వాళ్లు ఎక్కడ ఉన్నారో అర్థం కావడంలేదు. ఎవరో ఒకరు వచ్చి సాయం చేయండి’’ అంటూ ఓ మహిళ తమవాళ్లకు ఫోన్ చేసి వేడుకోవడాన్ని అక్కడి టీవీ చానెల్స్ ప్రసారం చేశాయి. గట్టిగా ఏడుస్తూ సాయం కోరింది. కొండచరియలు పడే టైమ్‌లో భూమి కంపిస్తుండటంతో ఎక్కడికి వెళ్లాలో అర్థం కాలేదని పలువురు బాధితులు వెల్లడించారు. ఇల్లు వదిలేసి ఎత్తైన ప్రాంతాలకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్నట్లు చెప్పారు.
24 గంటల్లోనే 40 సెంటీ మీటర్ల వాన
విపత్తు ప్రదేశంలో రికార్డు స్థాయిలో 24 గంటల్లో 40 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో అర్ధరాత్రి కొండ చరియలు విరిగిపడి బీభత్సం సృష్టించాయి. శిథిలాలు, బురదలో చిక్కుకున్న వారిని రెస్క్యూ సిబ్బంది అతి కష్టం మీద బయటికి తీస్తున్నారు. స్థానికంగా ఉన్న ఆలయాలు, మసీదులు, చర్చీల్లో తాత్కాలిక హాస్పిటల్స్‌ను ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు.
పరిస్థితి సీరియస్‌గా ఉంటే హెలీకాప్టర్ల ద్వారా వయనాడ్ కు తరలిస్తున్నారు. ముండకై గ్రామంలో చిక్కుకుపోయిన వాళ్లను హెలికాప్టర్ల ద్వారా పునరావాస కేంద్రాలకు తీసుకెళ్లారు. చాలా చోట్ల కనెక్టివిటీ దెబ్బతిన్నది. రెస్క్యూ సిబ్బంది కూడా అక్కడికి చేరుకునేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో యుద్ధ ప్రాతిపదికన తాత్కాలిక వంతెనలు ఏర్పాటు చేసుకుని సిబ్బంది ముందుకెళ్తున్నారు. ఎయిర్ ఫోర్స్ మిగ్ 17 హెలికాప్టర్లు రంగంలోకి దించారు.
చలియార్ నది ఉప్పొంగడంతో పెరిగిన తీవ్రత
సోమవారం అర్ధరాత్రి దాటాక.. మెప్పాడి రీజియన్ లోని ముండకై ప్రాంతంలో మూడు సార్లు కొండచరియలు విరిగిపడినట్లు అధికారులు చెప్తున్నారు. అర్ధరాత్రి 2 గంటలకు ఒకసారి, తెల్లవారుజామున 4 గంటల సమయంలో, మళ్లీ ఉదయం ఆరు గంటలకు కొండ చరియలు విరిగిపడ్డట్లు అధికారులు తెలిపారు. దీనికి తోడు చలియార్ నది ఉప్పొంగడంతో ప్రమాద తీవ్రత భారీగా పెరిగిందని చెప్పారు. బురద, బండరాళ్లు, కూలిన చెట్లు చుట్టేయడంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిందని తెలిపారు. 2018లో సంభవించిన విపత్తులో 400 మంది వరకు చనిపోయారు.
మృతులకు పీఎంవో నుంచి ఎక్స్‌గ్రేషియా
వయనాడ్ విపత్తులో చనిపోయిన వారి కుటుంబాలకు, గాయపడినవారికి ప్రధాని కార్యాలయం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ప్రధాని రిలీఫ్ ఫండ్ నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, అలాగే.. గాయపడ్డ వాళ్లకు రూ.50వేల ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు పీఎంవో ట్వీట్ చేసింది. అలాగే.. ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని తెలిపింది.
600 కార్మికులు ఎక్కడ?
ముండకై ప్రాంతంలో తేయాకు, కాఫీ, యాలకుల తోటలు ఉన్నాయి. వీటిలో పనిచేసేందుకు వెస్ట్‌బెంగాల్, అస్సాం నుంచి వందలాది మంది కార్మికులు వస్తుంటారు. ఇక్కడి హారిసన్ మలయాళీ ప్లాంటేషన్ లిమిటెడ్ లో పనిచేయడానికి దాదాపు 600 మంది వచ్చారు. వీరంతా ముండకైలోనే నివాసం ఉంటున్నారు. నాలుగు వీధుల్లో సుమారు 65 కుటుంబాలు ఉంటాయి. కొండ చరియలు విరిగి పడినప్పటి నుంచి వీరి ఆచూకీ తెలియడం లేదు. ఇండ్లు అన్ని ధ్వంసం అయ్యాయి. 600 కార్మికుల ఆచూకీ కనిపించడం లేదని కంపెనీ మేనేజర్ అధికారులకు వివరించాడు. నెట్వర్క్ దెబ్బతినడంతో ఫోన్లు కూడా కనెక్ట్ కావడం లేదని తెలిపాడు.
రిలీఫ్ క్యాంప్పైనే విరిగిపడ్డ కొండ చరియలు
అర్ధరాత్రి 2 గంటల సమయంలో ముండకై ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. స్థానికులు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది.. బాధితులను కాపాడి చురల్‌మల గ్రామంలోని స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన రిలీఫ్ క్యాంప్‌కు తరలించారు. తర్వాత తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో రిలీఫ్ క్యాంప్పైనే మళ్లీ కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో క్యాంప్ సహా చుట్టుపక్క ఇండ్లు, షాపులు బురదలో కొట్టుకుపోయాయి. బాధితుల ఆచూకీ కోసం సహాయక బృందాలు గాలింపు చేపడ్తున్నాయి. డ్రోన్లు, జాగిలాలను రంగంలోకి దించాయి.
8 జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్
కేరళలో రానున్న రెండు మూడ్రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం వయనాడ్‌లో భారీ వర్షం కురుస్తున్నది. మరో ఎనిమిది జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. వయనాడ్‌తో పాటు కోజికోడ్, మలల్లా, పాలక్కాడ్, ఇడేక్కి సహా పలు జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు, కొండ ప్రాంతాల్లోని ప్రజలు సేఫ్ ప్లేస్‌లకు తరలివెళ్లాలని అన్నారు.
అరేబియా సముద్రం వేడెక్కడంతోనే..
అరేబియా సముద్రం వేడెక్కడంతోనే కేరళలో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. చాలా తక్కువ టైమ్‌లోనే దట్టమైన మేఘాలు ఏర్పడటంతో వయనాడ్‌లో అతి భారీ వర్షాలు కురిశాయని, అదికాస్త కొండ చరియలు విరిగిపడటం, వరద పోటెత్తడానికి కారణమైందని తెలిపారు.
రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకం
ఎన్డీఆర్ఎఫ్ , కేరళ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్, ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ రంగంలోకి దిగి రెస్క్యూ చేపడ్తున్నాయి. వర్షాలతో బురద పేరుకుపోవడంతో రెస్క్యూకు ఆటంకం కలుగుతున్నదని అధికారులు తెలిపారు. కొండ చరియలు తొలగిస్తున్నా కొద్దీ మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెప్పాడి, చురల్ మల, అట్టమాల, నూల్పూజ గ్రామాలు బురదలో కూరుకుపోయాయి.
తెగిపోయిన శరీర భాగాలు
మల్లప్పురం చలియార్ నదిలో డెడ్‌బాడీలు తేలియాడుతున్నాయి. దాదాపు 20 నుంచి 25 మృతదేహాలను ఈ నది నుంచి బయటికి తీశారు. ముఖాలు గుర్తుపట్టడానికి వీల్లేకుండా ఉన్నాయి. బండరాళ్లు, కట్టెలు గుచ్చుకోవడంతో కొందరి శరీర భాగాలు తెగిపోయాయి. మూడేండ్ల పాప డెడ్‌బాడీని కూడా రెస్క్యూ సిబ్బంది గుర్తించి బయటికి తీసింది. ఇది చూసిన స్థానికులు కన్నీరు పెట్టుకున్నారు. అటవీ ప్రాంతంలోకి పదుల సంఖ్యలో డెడ్‌బాడీలు కొట్టుకొచ్చినట్లు ఆదివాసీలు తెలిపారు.
కేరళలో సంభవించిన వరదలు
2018, ఆగస్టులో సంభవించిన వరదలకు 483 మంది చనిపోయారు. 3.91 లక్షల కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. 1.40 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది.
2019లో వయనాడ్‌లో సంభవించిన వరదలకు 17 మంది చనిపోయారు.
2021, అక్టోబర్.. ఇడుక్కి, కొట్టాయం జిల్లాలో కొండ చరియలు విరిగిపడి 35 మంది ప్రాణాలు కోల్పోయారు. 2021లో వరదలకు సంబంధించిన ఘటనల్లో మొత్తం 54 మంది చనిపోయారు.
2022, ఆగస్టులో వరదలు, కొండిచరియలు విరిగిపడి 18 మంది చనిపోయారు. వందలాది ఇండ్లు కూలిపోయాయి.
2015 నుంచి 2022 మధ్య దేశవ్యాప్తంగా 3,789 సార్లు కొండ చరియలు విరిగిపడ్డాయి. వీటిలో 2,239 సార్లు ఒక కేరళలోనే సంభవించాయి.