మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొంటున్నాం

మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొంటున్నాం

కరీంనగర్ జిల్లా: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్నామని తెలిపారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. శనివారం ఆయన హుజురాబాద్ నియోజకవర్గంలోని ఇల్లందకుంట మండలం, టేకుర్తి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన పల్లా రాజేశ్వర్ రెడ్డి.. ఐకేసీ సెంటర్ల దగ్గర మొలకెత్తిన, తాలు ఉన్నా సరే అన్ని రకాల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు 90 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. నెల రోజుల క్రితం దాకా నల్ల చట్టాలు తెచ్చారని బీజేపీని ఆరోపించిన ఈటల రాజేందర్ .. ఇప్పుడు అదే పార్టీలో ఎలా చేరారని ప్రశ్నించారు. ఆనాడు దెయ్యంగా కనిపించిన బీజేపీ నేడు దేవుత అయిందా అన్నారు. ఎస్సీ, ఎస్టీ భూములతో పాటు దేవాదాయ భూములను ఏవిధంగా కొన్నావని ప్రశ్నించిన పల్లా.. పదే పదే తాను కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్య, వైయస్ ఎస్ రాజశేఖర్ రెడ్డి దగ్గరికి వెళ్లానని ఈటల రాజేందర్ చెబుతున్నాడన్నారు. తన స్వార్థ ప్రయోజనాల కోసమే ఈటల వాళ్ల దగ్గరికి వెళ్ళాడని.. నీకు ఎమ్మెల్యే టికెట్, మంత్రి  పదవి ఇచ్చింది కేసీఆర్ అని గుర్తుంచుకోవాలన్నారు. నీకు టీఆర్ఎస్ టికెట్ ఇస్తేనే ప్రజలు ఓట్లు వేశారని గుర్తుంచుకుంటే మంచిదన్నారు పల్లా.