మేం ఇండియన్లమే.. పాక్‌‌కు పంపొద్దు.. సుప్రీంకోర్టులో ఓ కుటుంబం పిటిషన్

మేం ఇండియన్లమే.. పాక్‌‌కు పంపొద్దు.. సుప్రీంకోర్టులో ఓ కుటుంబం పిటిషన్

న్యూఢిల్లీ: తాము భారత పౌరులమేనని జమ్మూకాశ్మీర్‌‌‌‌లో ఉంటున్న ఓ కుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. భారత్‌‌లో ఉండేందుకు కావాల్సిన అన్ని రకాల డాక్యుమెంట్లు తమ దగ్గర ఉన్నాయని, తమను తిరిగి పాకిస్తాన్‌‌కు పంపించొద్దని పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్.కోటేశ్వర్ సింగ్‌‌లతో కూడిన డివిజన్ బెంచ్ శుక్రవారం విచారణ చేపట్టింది. 

ముందుగా ఆ కుటుంబం దగ్గర ఉన్న అన్ని డాక్యుమెంట్లను పరిశీలించాలని, అప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అధికారులను కోర్టు ఆదేశించింది. ‘‘పాస్‌‌పోర్టులు, ఆధార్ కార్డులు, పాన్‌‌ కార్డులు తదితర పత్రాలు ఉన్నాయని పిటిషనర్ మా దృష్టికి తీసుకొచ్చారు. అధికారులు ముందుగా వాటిని పరిశీలించాలి. 

వాళ్ల పౌరసత్వంపై నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ ఆ నిర్ణయంపై పిటిషనర్‌‌‌‌కు అభ్యంతరాలుంటే జమ్మూకాశ్మీర్ హైకోర్టును సంప్రదించవచ్చు” అని తెలిపింది. ఈ కేసు పరిస్థితుల దృష్ట్యా మానవతా దృక్పథంతో పిటిషనర్‌‌‌‌కు ఈ అవకాశం కల్పిస్తున్నామని చెప్పింది. ఇదీ కేసు.. 

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో మన దేశంలో ఉన్న పాకిస్తాన్ పౌరులను తిరిగి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో కాశ్మీర్‌‌‌‌కు చెందిన అహ్మద్ తారెఖ్ కుటుంబం కూడా డిపోర్టేషన్‌‌ను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆయన కుటుంబం కాశ్మీర్‌‌‌‌లో నివసిస్తుండగా, అతను బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. కేంద్రం ఆదేశాల నేపథ్యంలో అహ్మద్ తారెఖ్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. 

అతని తరఫున లాయర్ నందకిశోర్ వాదిస్తూ.. ‘‘అహ్మద్ తారెఖ్, ఆయన కుటుంబసభ్యులకు పాస్‌‌పోర్టులు, ఆధార్ కార్డులు ఉన్నాయి. అయినప్పటికీ శ్రీనగర్‌‌‌‌లో ఉంటున్న అహ్మద్ కుటుంబసభ్యులను పాకిస్తాన్‌‌ పంపించేందుకు అధికారులు వాఘా బార్డర్‌‌‌‌కు తరలించారు” అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో అహ్మద్ తండ్రి ఎలా ఇండియాకు వచ్చారు? అని జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించగా.. ‘అతను 1987లో వీసా తీసుకుని ఇండియాకు వచ్చాడు. బార్డర్‌‌‌‌లోనే పాకిస్తాన్ పాస్‌‌పోర్టు అధికారులకు అప్పగించాడు” అని నందకిశోర్ వివరించారు. 

కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ.. ‘‘ఇది వీసాకు సంబంధించిన కేసు. వీసా గడువు ముగిసినా అహ్మద్ కుటుంబం భారత్‌‌లోనే ఉంటున్నది. వీళ్లు ముందుగా అధికారులను సంప్రదిస్తే బాగుంటుంది” అని అన్నారు. వాళ్లు చెబుతున్న డాక్యుమెంట్లపై అధికారులు నిర్ణయం తీసుకునే వరకూ ఎలాంటి చర్యలు తీసుకోబోమని కోర్టుకు హామీ ఇచ్చారు.