ఒకటో తారీఖునే వేతనాలు ఇస్తున్నాం

ఒకటో తారీఖునే వేతనాలు ఇస్తున్నాం

రాజన్న సిరిసిల్లా: జిల్లాల్లోనూ ఎలక్ట్రిక్ బస్సలు నడిపేందుకు కృషి చేస్తున్నట్లు టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. గురువారం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్... అనంతరం ఆలయంలో ని చైర్మన్ గెస్ట్ హౌస్ లో ఆర్టీసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం సజ్జనార్ మీడియాతో మాట్లాడారు. జిల్లాలో కూడా కొన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎలక్ట్రికల్ వాహనాలు వినియోగిస్తామన్న సజ్జనార్... త్వరలోనే కరీంనగర్,  నల్లగొండ , వరంగల్,  మహబూబ్ నగర్ జిల్లాల హెడ్ క్వార్టర్స్ నుంచి ప్రయోగాత్మకంగా ఎలక్ట్రిక్ బస్సులను నడపనున్నట్లు తెలిపారు.

వేములవాడ రాజన్న దేవస్థానంతో పాటు మరికొన్ని దేవస్థానాలను కలుపుకొని ప్రయాణికుల కోసం టూరిజం ప్యాకేజీకి ప్లాను చేస్తున్నామన్నారు. అందుకోసం త్వరలోనే 116 కొత్త బస్సులను కొనుగోలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ నెలలోనే ఆర్టీసీ యాప్ ను ప్రారంభిస్తామని, దీంతో గ్రామీణ ప్రాంతంలోని ప్రయాణికుడు కూడా బస్సు ఎక్కడుందో తెలుసుకుని ప్రయాణం చేయవచ్చన్నారు. ఆర్టీసీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేస్తున్నారని, ఈ క్రమంలోనే ఆక్యుపెన్సీ 72 శాతం పెరిగిందని చెప్పారు. కార్మికుల వేతనాలు కూడా ఒకటో తారీఖున ఇస్తున్నామన్న ఆయన... కార్మికులకు డీఏ కూడా అందించామన్నారు. 

ఏడాదిన్నరగా కార్గో ద్వారా విస్తృత సేవలు అందిస్తున్నామని, ఈ క్రమంలోనే సంస్థకు ఇప్పటికే 100 కోట్ల ఆదాయం కార్గో ద్వారా లభించిందన్నారు.  రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్, రాజన్న ఆలయ అధికారులతో చర్చించి రాజన్న ప్రసాదం కూడా కార్గో ద్వారా భక్తులకు అందించేందుకు పూర్తి ప్రణాళికతో ముందుకు వెళ్తామని సజ్జనార్ తెలిపారు.

మరిన్ని వార్తల కోసం...

శ్రీలంక విడిచి వెళ్లకుండా మహింద రాజపక్సకు భారీ షాక్‌

రాజ్య సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల