శ్రీలంక విడిచి వెళ్లకుండా మహింద రాజపక్సకు భారీ షాక్‌

శ్రీలంక విడిచి వెళ్లకుండా మహింద రాజపక్సకు భారీ షాక్‌

కొలంబో: శ్రీలంక మాజీ ప్రధాని మహింద రాజపక్సకు భారీ షాక్‌ తగిలింది. కొలంబో కోర్టు గురువారం (ఈనెల 12న ) కీలక ఆదేశాలు జారీ చేసింది. మహింద రాజపక్స, ఆయన తనయుడు నమల్‌ రాజపక్స, మరో 15 మంది రాజపక్స మద్దతుదారులు దేశం విడిచి వెళ్లడాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు.. ప్రధాని భవనం టెంపుల్‌ ట్రీస్‌ వద్ద శాంతియుతంగా ధర్నా చేపట్టిన నిరసనకారుల మీద జరిగిన దాడులు, ఆ తర్వాత చెలరేగిన హింసపై దర్యాప్తు చేపట్టాలని పోలీస్‌ శాఖను మెజిస్ట్రేట్‌ ఆదేశించారు.

ఆర్థిక, ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో గత కొన్ని రోజులుగా పెద్ద సంఖ్యలో ఆందోళనలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. సంక్షోభానికి కారణమైన రాజపక్స కుటుంబీకులు వెంటనే అధికారం నుంచి దిగిపోవాలని డిమాండ్ చేస్తూ దేశ వ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. సోమవారం (ఈనెల 9న) మహింద రాజీనామా ప్రకటన నేపథ్యంలో హైడ్రామా చోటు చేసుకుంది. ఆయన మద్దతుదారులు నిరసనకారులపై దాడులు చేయడంతో హింస చెలరేగింది. ఈ ఘటనలో ఇప్పటిదాకా తొమ్మిది మందికి పైగా మరణించారని, వందల సంఖ్యలో గాయపడ్డారని తెలుస్తోంది. 

మరోవైపు మహీంద, ఆయన మద్దతుదారులు దేశం విడిచి పారిపోకుండా ఎక్కడికక్కడ చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసిన నిరసనకారులు.. ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో దేశం దాటిపోకుండా కోర్టు నిషేధం విధించింది. ఆందోళనకారులకు భయపడి మహింద రాజపక్స కుటుంబ సభ్యులు, ఆయన అనుచరగణం భారీ భద్రత మధ్య చాలా సిక్రెట్ ప్లేస్ లో తలదాచుకున్నారని స్థానిక మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. 

మరిన్ని వార్తల కోసం..

అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్కు క్యూ

తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది