రెండేళ్లయింది.. న్యాయం కోసం ఇంకెన్నాళ్లు వేచి చూడాలి

రెండేళ్లయింది.. న్యాయం కోసం ఇంకెన్నాళ్లు వేచి చూడాలి
  • వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత సంచలన కామెంట్స్

న్యూఢిల్లీ: మా నాన్న హత్య జరిగి రెండేళ్లయింది.. న్యాయం కోసం ఇంకెంత కాలం మేం వేచి చూడాలని మాజీ మంత్రి వైఎష్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ వైఎస్ సునీత  ప్రశ్నించారు. తన తండ్రి హత్య కేసు విచారణ గురించి సీబీఐ అధికారులను కలిసిన అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన వైఎస్ సునీత సంచలన కామెంట్స్ చేశారు. ‘‘మా నాన్న హత్య తర్వాత దర్యాప్తు అధికారులతో మాట్లాడాను.. రెండేళ్లుగా నిందితులను పట్టుకోలేకపోయారు..ఎవరు హత్య చేశారో ఇప్పటి వరకు తెలియలేదు.. మా నాన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి స్వయానా సోదరుడు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ కు స్వయానా బాబాయ్. ఆయన హత్య కేసులో నిందితులనే పట్టుకోలేక పోవడం దారుణం..’’ అని వైఎస్ సునీత అన్నారు. వివేకా హత్య కేసు విచారణ సరిగ్గా జరగడం లేదు.. పోస్టుమార్టం నివేదిక కూడా సరిగా లేదు.. న్యాయం కోసం విచారణ గురించి అడిగితే.. కడప, కర్నూలు జిల్లాల్లో ఇలాంటి హత్యలు మామూలే.. వదిలేయండి అంటున్నారు.. వైయస్ వివేకా హత్య జరిగి రెండు ఏళ్లు అయింది.. రెండు ఏళ్లు  అంటే చాలా ఎక్కువ సమయం.. మేం ఎంతకాలం న్యాయం కోసం వేచి చూడాలి.. మాకే న్యాయం జరగకపోతే సామాన్యుడి పరిస్థితి ఏమిటి.. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా మాకు న్యాయం జరగలేదు.. వివేకాది ముమ్మాటికీ హత్యేనని వైద్యురాలిగా చెబుతున్నా.. ఎంత ఆలస్యంగా విచారణ జరిగితే... న్యాయం అంత దూరం అయినట్లే..‘‘ నని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ ఆలస్యమయ్యేకొద్దీ సాక్ష్యం చెప్పేవాళ్లు కూడా రాకుండాపోతారేమో, ఇంకెంత మందికి హాని జరుగుతుందోనన్న అనుమానం కలుగుతోందన్నారు. స్వయానా మీ సోదరుడే ఏపీ సీఎంగా ఉండగా ఇలా ఎందుకు మాట్లాడుతున్నారన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు జవాబిస్తూ... నాకు కూడా  ఏమీ చెప్పడం లేదు.. అందుకే మీడియా సమావేశం పెట్టి చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. విచారణ త్వరగా పూర్తి చేసి వాస్తవాలు బయటపెట్టాలని వైఎస్ సునీత కోరారు.