ఓనర్ పర్మిషన్ లేకున్నా సౌదీ విడిచి వెళ్లొచ్చు

ఓనర్ పర్మిషన్ లేకున్నా సౌదీ విడిచి వెళ్లొచ్చు

కార్మిక చట్టాల్లో కీలక మార్పులు చేసిన సౌదీ అరేబియా

దుబాయ్: సౌదీ అరేబియా కార్మిక చట్టాల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. కఫాలా కార్మిక విధానంలోని కఠినమైన ఆంక్షలను తొలగించింది. దీంతో అక్కడ పని చేస్తున్న లక్షలాది మంది వలస కార్మికులకు ఊరట కలగనుంది. చట్టాల్లో తీసుకొచ్చిన రీఫామ్స్ ను హ్యూమన్ రీసోర్స్ అండ్ సోషల్ డెవలప్ మెంట్ మినిస్ట్రీ బుధవారం ప్రకటించింది. ఇక నుంచి మైగ్రెంట్ వర్కర్లు ఉద్యోగం మానేయాలంటే ఓనర్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్లు వేరే జాబ్ లో జాయిన్ కావొచ్చు. స్పాన్సర్ షిప్ ను ఒక ఓనర్ నుంచి మరో ఓనర్ కు ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు. అదే విధంగా దేశం విడిచి వెళ్లాలంటే ఓనర్ పర్మిషన్ అక్కర్లేదు. ఓనర్ ప్రమేయం లేకుండానే ఆ దేశానికి రావొచ్చు, పోవొచ్చు. ఈ కొత్త రూల్స్ వచ్చే ఏడాది మార్చి నుంచి అమల్లోకి వస్తాయని ఆ దేశ మంత్రి తెలిపారు. ఈ రీఫామ్స్ తో కోటి మంది మైగ్రెంట్ వర్కర్లకు ఊరట కలుగుతుందన్నారు. సౌదీ కఫాలా సిస్టమ్ లో మార్పులు చేసినప్పటికీ, దాన్ని పూర్తిగా రద్దు చేయలేదని హ్యూమన్ రైట్స్ రీసెర్చర్ రోత్నా బేగమ్ అన్నారు. విదేశీ కార్మికులు సౌదీకి వెళ్లాలంటే ఇప్పటికీ ఎంప్లాయర్ స్పాన్సర్ షిప్ అవసరమని చెప్పారు. దాని ద్వారా ఎప్పటిలాగే ఎంప్లాయ్స్ పై ఓనర్ల పెత్తనం ఉంటుందన్నారు.