మళ్లీ అదే కూత..ట్రంప్ జోక్యంతోనే భారత్, పాక్ యుద్ధం ఆగింది.. అమెరికా విదేశాంగ మంత్రి

మళ్లీ అదే కూత..ట్రంప్ జోక్యంతోనే భారత్, పాక్ యుద్ధం ఆగింది.. అమెరికా విదేశాంగ మంత్రి

వాషింగ్టన్: భారత్, పాక్ మధ్య యుద్ధాన్ని తామే ఆపామనే వాదనను అమెరికా వదిలిపెట్టడంలేదు. తాజాగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా భారత్, పాకిస్తాన్ మధ్య సైనిక ఘర్షణ జరిగినప్పుడు యునైటెడ్ స్టేట్స్ నేరుగా జోక్యం చేసుకుందని వెల్లడించారు. 

గురువారం ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రూబియో మాట్లాడారు. " అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ శాంతికి కట్టుబడి ఉన్నారు. ఆయన "శాంతి అధ్యక్షుడిగా" ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆపడంలో  ట్రంప్ నేరుగా జోక్యం చేసుకున్నారు. 

ఇరు దేశాల మధ్య శాంతిని సాధించారు. ఇదేకాదు. కంబోడియా– థాయిలాండ్, అజర్‌‌‌‌బైజాన్– ఆర్మేనియా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో– రువాండా  మధ్య యుద్ధలను కూడా మేమే ఆపాం. శాంతి ఒప్పందంపై సంతకాలు చేయించాం. ట్రంప్ చేస్తున్న శాంతి ఒప్పందాలతో అమెరికా గర్విస్తున్నది" అని రూబియో పేర్కొన్నారు.