దేశ జనాభాకి సరిపడా ఆహారం ఉన్నా ఆకలి తీరట్లేదు!

దేశ జనాభాకి సరిపడా ఆహారం ఉన్నా ఆకలి తీరట్లేదు!

దేశ జనాభాకి సరిపడా ఆహారం మన దగ్గర ఉంది. అయినా... ఆకలితో బాధపడేవాళ్లూ ఉన్నారు. వాళ్లలో కొందరికి పౌష్టికాహారం అందడంలేదు.. మరికొందరికేమో తిండి దొరకట్లేదు అని గ్లోబల్​ హంగర్​ ఇండెక్స్​ అంటోంది. అసలు మనదేశంలో ఆకలి సమస్య నిజంగానే అంతగా ఉందా?పౌష్టికాహారం అందట్లేదా?

ప్రపంచ ఆహార సంస్థ(వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్) ప్రకారం ఒక మనిషి వయసు, శారీరక శ్రమకు తగ్గట్టుగా ఆహారం తీసుకోలేకపోతే ఆ వ్యక్తి ఆకలితో ఉన్నట్టు లెక్క. మనిషి ఆరోగ్యంగా ఉండడానికి కావల్సిన శక్తి, ప్రొటీన్లు, అవసరమైన విటమిన్లు, ఖనిజాలు అందకపోతే దాన్ని ఆకలిగా పరిగణించొచ్చు. అయితే దీనికి సంబంధించి మనదేశం ఒకేసారి వేర్వేరు సమస్యలను ఎదుర్కొంటోంది. 


దేశంలో ఓ వైపు పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతుంటే మరోవైపు మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. పౌష్టికాహార సమస్య ఎన్నో ఏండ్లుగా వెంటాడుతుంటే గత పదేండ్లుగా పిల్లల్లో ఒబెసిటీ సమస్య పెరుగుతోంది. మరోపక్క అక్కడక్కడా ఆకలి సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. వీటిని ఒక్కొక్కటిగా చూస్తే..

పోషకాహార లోపం

పోషకాహార లోపం(మాల్ న్యూట్రిషన్)తో బాధపడే పిల్లలు ఎక్కువగా ఉన్న దేశాల్లో ఇండియా చాలాకాలంగా ముందు వరుసలో ఉంటోంది. దేశంలో దాదాపు 10.2 కోట్ల మంది మగవాళ్లు, 10.1 కోట్ల మంది ఆడవాళ్లు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని ‘ది లాన్సెట్‌‌ జర్నల్‌‌’ స్టడీలో పబ్లిష్ అయింది. ఐదేండ్ల క్రితం కంటే ఇప్పటి పిల్లలు ఎక్కువ పోషకాహార లోపంతో బాధపడుతున్నారని ‘జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే’ (ఎన్‌‌.ఎఫ్‌‌.హెచ్‌‌.ఎస్) కూడా చెప్తోంది. ఐదేండ్ల లోపు పిల్లల్లో మాల్ న్యూట్రిషన్ 44 శాతం నుంచి 55 శాతానికి పెరిగింది. బరువు తక్కువ ఉన్న  పిల్లల శాతం 7.8 నుంచి 13.4కు పెరిగింది. దేశంలో దాదాపు 22 కోట్ల మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నట్టు యూఎన్ రిపోర్ట్ చెప్తోంది. 

అవగాహన లేక

మారుమూల ప్రాంతాల్లో నివసించే చాలామందికి పౌష్టికాహారం గురించి సరైన అవగాహన లేకపోవడమే మాల్ న్యూట్రిషన్‌‌కు కారణం. దేశంలో చాలామంది కూరలు చేసుకోకుండా కేవలం పప్పు అన్నం లేదా చారన్నం లాంటివి తింటున్నారు. దీనివల్ల పుట్టే పిల్లల్లో పోషకాహార లోపం ఏర్పడుతుంది.  దీంతోపాటు రక్తహీనత ఉన్న మహిళలకు పుట్టే పిల్లలు కూడా బలహీనంగానే ఉంటున్నారు. వలసలు కూడా ఈ పరిస్థితికి ఒక ముఖ్య కారణం. 

ఒబెసిటీ

మాల్ న్యూట్రిషన్‌‌తో పాటు ఇటీవల కాలంలో మనదేశం ఎదుర్కొంటున్న మరో పెద్ద సమస్య పిల్లల్లో ఒబెసిటీ. దీన్ని అరికట్టకపోతే  సమస్య ప్రమాదంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల ఐదేండ్లలోపు పిల్లల్లో ఒబెసిటీ బారిన పడుతున్న వాళ్ల సంఖ్య పెరుగుతోందని ‘జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019– 21’ చెప్తోంది. 2015–16లో బరువు ఎక్కువ ఉన్న పిల్లలు 2.1 శాతం ఉంటే.. ఇప్పుడు 3.4 శాతం ఉన్నారు. అలాగే దేశంలోని 23 శాతం జనాభా ఎక్కువ బరువుతో బాధపడుతున్నారు.  ‘యునిసెఫ్ వరల్డ్ ఒబెసిటీ అట్లాస్ 2022’ ప్రకారం.. 2030 నాటికి మనదేశంలో 2.7 కోట్ల కంటే ఎక్కువమంది పిల్లలు ఒబెసిటీ సమస్యతో బాధపడే అవకాశం ఉందని అంచనా.

రక్త హీనత

పోషకాహార లోపానికి మరో కారణం మహిళల్లో రక్త హీనత(ఎనీమియా). ఈ సమస్యతో బాధపడుతున్న మహిళల సంఖ్య  ఏటా పెరుగుతోందని  తాజాగా విడుదలైన ‘గ్లోబల్‌‌ న్యూట్రిషన్‌‌ రిపోర్ట్‌‌’, ‘జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే’లు చెప్తున్నాయి. మన దేశంలో 15 నుంచి 49 ఏండ్ల వయసున్న మహిళల్లో సుమారు 57 శాతం మంది రక్తహీనతను ఎదుర్కొంటున్నారు.  ఐదేండ్ల లోపు చిన్నారుల్లోనూ ఈ సమస్య ఎక్కువగానే ఉంది. ఎన్నో అనారోగ్యాలకు, చైల్డ్ స్టంటింగ్(గిడసబారినతనం), చైల్డ్ వేస్టింగ్‌‌(ఎదుగుదల ఆగిపోవడం )కు ఇవే కారణాలువుతున్నాయి.

 

పౌష్టికాహారం అంటే..

కొవ్వు పదార్థాలు, ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్‌‌ అందేలా పండ్లు, కూరగాయలతో సహా అన్ని రకాల ఆహార పదార్థాలను సరైన మోతాదులో తీసుకుంటే పోషకాహార లోపాన్ని తగ్గించొచ్చు. అయితే ఏది మంచి ఆహారం? ఏది కాదు? అన్న దానిపై ప్రజలకు సరైన అవగాహన లేదు. అందుకే పిల్లలు, ఆడవాళ్లలో మాల్ న్యూట్రిషన్ సమస్య ఎక్కువ అవుతుంది. దీన్ని తగ్గించడం కోసం  ప్రభుత్వం కొన్ని ప్రోగ్రామ్స్ కూడా తీసుకొచ్చింది.  అంగన్‌‌వాడీ కేంద్రాల ద్వారా బలామృతం, గర్భిణులకు బియ్యం, కంది పప్పు, నూనె, కోడిగుడ్డు, పాలు లాంటివి ఇచ్చే పథకాలున్నాయి. అలాగే కొన్నిరాష్ట్రాల్లో ప్రతి నెలా రాగి పిండి, జొన్న పిండి, అటుకులు, బెల్లం, వేరుసెనగ చిక్కీలు, ఎండు ఖర్జూరాలు అందించే స్కీమ్స్ కూడా ఉన్నాయి. వీటిని సరిగ్గా అమలు చేయడం ద్వారా పోషకాహార లోపాన్ని తగ్గించొచ్చు.

ఆకలి సమస్యలు

వీటితోపాటు ప్రపంచాన్ని వేధిస్తున్న మరో పెద్ద సమస్య ఆకలి. కేవలం కడుపు నిండకపోవడం మాత్రమే కాదు. శరీరానికి కావల్సినంత పౌష్టికాహారాన్ని  అందించలేకపోవడం కూడా ఆకలి కిందకే వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆకలి సమస్యలను కొలిచేందుకు యూరప్‌‌లోని కొన్ని సంస్థలు కలిసి  ‘గ్లోబల్ హంగర్ ఇండెక్స్’ ను ఏర్పాటు చేశాయి. ఈ ఇండెక్స్ ప్రపంచవ్యాప్తంగా ఆకలిని కొలిచే టూల్ లాంటింది. ఎంతమందికి ఎలాంటి ఆహారం అందుతోంది?  ఏయే దేశాల్లో ఎంతమంది ఆకలితో బాధపడుతున్నారు? పోషకాహార లోపం, పెరుగుదల లోపాల వంటివి ఇది లెక్కిస్తుంది. 2030 నాటికి ప్రపంచంలో ఆకలి సమస్యలను పూర్తిగా తగ్గించాలన్న లక్ష్యంతో ఇది పనిచేస్తోంది. ప్రతి ఏటా అక్టోబర్‌‌‌‌లో దేశాల వారీగా ‘హంగర్ ఇండెక్స్ రిపోర్ట్‌‌’ను విడుదల చేస్తుంది.  ఐరిష్‌‌ సహాయ సంస్థ ‘కన్సర్న్‌‌ వరల్డ్‌‌వైడ్’, జర్మనీకి చెందిన ‘వెల్ట్‌‌ హంగర్‌‌ హిల్ఫ్‌‌’ ఈ ఆకలి సూచిని రూపొందిస్తాయి. 

ఇలా లెక్కిస్తారు

ఆకలి సూచీని నాలుగు అంశాల ఆధారంగా లెక్కిస్తారు. మాల్ న్యూట్రిషన్ (పోషకాహార లోపం), చైల్డ్ స్టంటింగ్(గిడసబారినతనం), చైల్డ్ వేస్టింగ్(ఎదుగుదల ఆగిపోవడం ), చైల్డ్ మోర్టాలిటీ (ఐదేండ్లలోపు పిల్లల మరణాలు)ని బట్టి స్కోర్ ఇస్తారు. జీహెచ్‌‌ఐ స్కోర్‌‌‌‌లో 100 పాయింట్లు ఉంటాయి. స్కోరు సున్నాగా ఉంటే ఆ దేశంలో ఆకలి సమస్య లేదని అర్థం.  స్కోరు 100 ఉంటే ఆ దేశంలో ఆకలి బాధలు ఎక్కువగా ఉన్నట్టు లెక్క. 

తాజా రిపోర్ట్

గ్లోబల్ హంగర్ ఇండెక్స్ తాజాగా రిలీజ్ చేసిన లిస్ట్‌‌లో ఇండియా స్కోరు 29.1గా ఉంది. అంటే ఆకలి సమస్యలు ఎక్కువగా ఉన్నాయని అర్థం.  2020 ఆకలి సూచిలో మనదేశం 94వ ప్లేస్‌‌లో ఉంటే 2021లో 101వ ప్లేస్‌‌కు చేరుకుంది. ఈ ఏడాది 121 దేశాలకు గానూ 107 ర్యాంకుకి పడిపోయింది. అంటే ఏటా జీహెచ్‌‌ఐ స్కోర్‌‌ తగ్గుతూ వస్తోంది. 2000 సంవత్సరంలో 38.8 ఉన్న స్కోర్‌‌ 2014–2022లలో 28.2–29.1 మధ్య ఉంటూ వస్తోంది. అలాగే  దేశంలో పోషకాహార లోపం కూడా  పెరిగినట్లు ఈ రిపోర్ట్ చెప్తోంది. 2014లో చిన్నారుల్లో పోషకాహారలోపం 15.1 శాతం ఉంటే తాజా రిపోర్ట్‌‌లో ఇది 19.3 శాతానికి పెరిగింది.  ప్రపంచంలో 82.8 కోట్ల మంది న్యూట్రిషన్ లోపంతో బాధపడుతుంటే.. అందులో 22.4 కోట్ల మంది భారతీయులే ఉన్నారు. అయితే ‘గ్లోబల్ హంగర్ ఇండెక్స్’లో ఇండియాకు 107వ ర్యాంక్ రావడంపై ప్రభుత్వం స్పందించింది. ఈ రిపోర్టులో ఆకలిని కొలిచే కొలమానాలు సరిగా లేవని మహిళా శిశు అభివృద్ధి  శాఖ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. జీహెచ్‌‌ఐ తీసుకున్న శాంపిల్స్ మొత్తం జనాభాకు వర్తించకపోవచ్చని చెప్పింది.

మరణాలు తగ్గాయి

ఈ సూచీలో ఇండియా రెండు అంశాల్లో మెరుగుపడింది. చిన్నారుల మరణాల రేటు 4.6 శాతం నుంచి 3.3 శాతానికి తగ్గింది. చైల్డ్ స్టంటింగ్‌‌ను కూడా ఇండియా చాలావరకూ కంట్రోల్ చేయగలిగింది. చత్తీస్‌‌గఢ్, గుజరాత్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లో పిల్లల్లో పౌష్టికాహార లోపాలు  కాస్త తగ్గాయి. ఫుడ్ సేఫ్టీ, పబ్లిక్ హెల్త్,  తల్లీపిల్లల ఆరోగ్యం వంటి అంశాల్లో ఇండియా పనితీరు మెరుగుపడింది.

ప్రపంచవ్యాప్తంగా ఇలా..

మనదేశం సంగతి అటుంచితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. 2030 నాటికి ఆకలి సమస్యను అధిగమించాలని ఐక్య రాజ్య సమితి లక్ష్యం పెట్టుకుంది. అయితే మరో ఎనిమిదేండ్లలో ఆ లక్ష్యాన్ని సాధించడం అసాధ్యం అని జీహెచ్‌‌ఐ ఇండెక్స్ చెప్తోంది.ప్రపంచంలో ప్రతి ముగ్గురిలో ఒకరు అంటే సుమారు 231 కోట్ల మంది ఓ మోస్తరు లేదా తీవ్రమైన ఆహార సమస్యను ఎదుర్కొంటున్నారని  ఐక్యరాజ్య సమితి ఫుడ్‌‌ అండ్‌‌ అగ్రికల్చర్‌‌ ఆర్గనైజేషన్‌‌ రూపొందించిన ‘ఫుడ్‌‌ సెక్యూరిటీ అండ్‌‌ న్యూట్రిషియన్‌‌-2022’ నివేదిక పేర్కొంది. ఈ పరిస్థితి కొనసాగితే 2030 నాటికి ప్రపంచ జనాభాలో ఎనిమిది శాతం మంది పౌష్టికాహార లోపానికి గురవుతారు.హెల్దీ ఫుడ్ తీసుకోలేని వాళ్ల సంఖ్య మనదేశంతో సహా చాలా దేశాల్లో ఎక్కువగా ఉంది. పౌష్టికాహారం కోసం అయ్యే ఖర్చు 2017లో 3.314 డాలర్లుగా ఉండేది. 2020 నాటికి అది 3.537 డాలర్లకు పెరిగింది.  మనదేశంలో ఆ ఖర్చు రూ.230 నుంచి రూ. 241 కి  పెరిగింది. దేశంలో రోజుకి తిండి కోసం అంత డబ్బు వెచ్చించలేని వాళ్లు 2020 నాటికి 70.5 శాతం ఉన్నారు. అంటే సుమారు 97 కోట్ల మంది పౌష్టికాహారం కోసం రోజుకు రూ.241 ఖర్చు చేసే స్థితిలో లేరు. దీంతోపాటు  కరోనా తర్వాత పరిస్థితులు పూర్తిగా మారాయి. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగావకాశాలు తగ్గడంతోపాటు ప్రజల ఆదాయం కూడా తగ్గింది. వీటన్నింటి ప్రభావం ఆహారంపై  పడింది. ప్రపంచవ్యాప్తంగా ఆకలి పెరగడానికి కారణమైంది. 

ఫుడ్ ప్రొడక్షన్ లేకనా?

ప్రపంచంలో  దాదాపు వందకు పైగా  దేశాలు ఆకలి సమస్యపై పోరాడుతున్నాయి. సరిపడా ఆహారాన్ని పండించలేక, ఆహారాన్ని దిగుమతి చేసుకునే స్థోమత లేక కొన్ని దేశాలు ఆకలితో అలమటిస్తున్నాయి. అయితే మిగతా దేశాలతో పోలిస్తే మనదేశం పరిస్థితి వేరు. మనదేశంలో ఫుడ్ ప్రొడక్షన్ రికార్డు స్థాయిలో ఉంది.  అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం తిండిగింజల ప్రొడక్షన్ దేశ అవసరాల కంటే 80 శాతం  తక్కువగా ఉంటే.. ఆహార కొరత ఏర్పడినట్లు లెక్క. తిండిగింజల ప్రొడక్షన్ 80–120 శాతం వరకు ఉంటే సెల్ఫ్ సఫిషియెంట్.  ప్రొడక్షన్ 120 శాతాన్ని దాటినప్పుడు మిగులు ఉత్పత్తి సాధించినట్టు.  మనదేశంలో తిండిగింజలు సరిపడా ఉండడంతో పాటు భవిష్యత్తులో కరువు ముంచుకొస్తే కాపాడేందుకు సరిపడా మిగులు ధాన్యాలు ఉన్నాయి. గడిచిన పదేండ్లలో ఆహార ధాన్యాల దిగుబడులు పెరుగుతూనే ఉన్నాయి. 2016–17లో 27.5 కోట్ల టన్నుల తిండిగింజల దిగుబడులు వస్తే  2021 22 నాటికి 31 కోట్ల టన్నుల దిగుబడులు వచ్చాయి. అయితే ఒకపక్క తిండిగింజల ప్రొడక్షన్ పెరుగుతున్నప్పటికీ మరోపక్క ఆకలి సమస్యలు, పోషకాహార లోపాలు కూడా పెరుగుతున్నాయి. ఎందుకిలా జరుగుతోంది?

కారణాలివే..

కొవిడ్‌‌ తర్వాత ఆకలి సమస్య మరింత ఎక్కువైంది. కొవిడ్,  రష్యా–ఉక్రెయిన్‌‌ యుద్ధం, వాతావరణ మార్పులు వంటివి ప్రపంచ దేశాల్లో ఆకలి కేకల్ని ఇంకా పెంచేస్తున్నాయి. ఒక్క 2020లోనే కొవిడ్‌‌ మహమ్మారి కొత్తగా కోట్ల మందిని పేదరికంలోకి నెట్టింది. సుమారు ఏడున్నర కోట్ల మంది కుటుంబ ఆదాయం రోజుకు వంద రూపాయల లోపుకి పడిపోయింది. అలాగే దేశంలో ఒక పూట మాత్రమే ఆహారం తింటున్న వాళ్ల సంఖ్య 13.40 కోట్లకు చేరింది.తాజాగా పెరుగుతున్న ఆర్థిక సంక్షోభాలు కూడా ఆకలి సమస్యకు కారణాలే.  ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో ఉన్న 21 దేశాల్లో మూడు కోట్ల మంది, ఉక్రెయిన్‌‌ యుద్ధం కారణంగా 24 దేశాల్లో 14 కోట్ల మంది, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా 8 దేశాల్లో 2.3 కోట్ల మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని ‘గ్లోబల్‌‌ పాలసీ రిపోర్ట్ 2022’ తెలిపింది. 

ఆధునిక వ్యవసాయ పద్ధతులు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రొడక్షన్ బాగా పెరిగింది. అక్కడక్కడా కరువు కాటకాలు ఎదురవుతున్నా, తిండి గింజల ఉత్పత్తి మాత్రం ఆశించినంతగా ఉంటోంది. ఆ ధాన్యాలను సరిగ్గా డిస్ట్రిబ్యూట్ చేస్తూ, పాడవ్వకుండా నిల్వ చేయగలిగితే ఆకలిచావులు ఉండే అవకాశం లేదు.  కానీ, ఆహార ధాన్యాలు డిస్ట్రిబ్యూట్ చేయడం,  నిల్వ చేయడంలో చాలాదేశాలు ఫెయిల్ అవుతున్నాయని,  ఆహారం అందరికీ చేరుకోవడంలేదని  ఐక్యరాజ్య సమితి ఇటీవల ఓ రిపోర్ట్ ద్వారా తెలిపింది. అలాగే ఇండియాలో ఆదాయం, సంపద పరంగా అసమానతలు ఉన్నాయని ‘వరల్డ్‌‌ ఇనీక్వాలిటీ ల్యాబ్‌‌ 2022’ నివేదిక వెల్లడించింది.  అసమానతలు, వివక్ష, వాతావరణ మార్పులు, పేదరికం, నిరుద్యోగం, నిలకడ లేని మార్కెట్లు, యుద్ధాలు, అన్నింటికంటే ముఖ్యంగా ఫుడ్ వేస్ట్ లాంటివి ఆకలికి ప్రధాన కారణాలవుతున్నాయి. 

వృథా ఎక్కువే

ఫుడ్ వేస్ట్ అనేది ఆకలి సమస్యకు ప్రధాన కారణంగా ఉంటోంది.  ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 130 కోట్ల టన్నుల ఆహారం వృథా అవుతోంది. ఈ ఒక్క ఏడాదే దాదాపు 931 మిలియన్‌‌‌‌ టన్నుల ఫుడ్​ వేస్ట్ అయినట్లు యునైటెడ్​ నేషన్స్ రిపోర్ట్‌‌లో వెల్లడైంది. మనదేశంలోని ఇండ్ల నుంచే ఏటా 68.7 మిలియన్‌‌‌‌ టన్నుల ఫుడ్​ వేస్ట్​ అవుతున్నట్లు యునైటెడ్​ నేషన్స్​ ‘ఫుడ్​ వేస్ట్​ ఇండెక్స్‌‌‌‌ 2021’ రిపోర్ట్​ చెప్తోంది. మనదేశంలో దాదాపు మూడో వంతు ఫుడ్ వేస్ట్ అవుతుంది. వేస్ట్ అవుతున్న ఫుడ్ విలువ సుమారు రూ.184.31 లక్షల కోట్లు. అయితే ఇందుకు వేర్వేరు కారణాలున్నాయి. విత్తనాలు వేసినప్పటి నుంచి పంట కోసే వరకు రకరకాల స్టేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో 32 శాతం నష్టం జరుగుతుంటే, వినియోగదారుల వల్ల 61 శాతం ఆహారం వేస్ట్ అవుతోంది. కోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టోరేజీలు, కొత్తరకం పంట కోత ఎక్విప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌ లేని కారణంగా ఏటా భారీగా కూరగాయలు, పండ్లు వేస్ట్ అవుతున్నాయి. మన దేశంలో ఏటా ఇలా వేస్ట్ అయ్యే కూరగాయలు, పండ్ల విలువ సుమారు రూ.38,500 కోట్ల వరకు ఉంటుందని యూనివర్సిటీ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బర్మింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. వీటితో పాటు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, నిర్వహణల్లో లోపాల వల్ల కూడా ఫుడ్ వేస్ట్ జరుగుతోంది. పండించిన ధాన్యాలు పొలాల నుంచి మార్కెట్లకు చేరుకుంటున్నాయి. కానీ వాటిని నిల్వ చేసేందుకు సరైన సదుపాయాలు లేక అవి గోదాముల్లోనే కుళ్లిపోతున్నాయి. 

పథకాలూ ఉన్నాయి

మనదేశంలో 80 కోట్లమందికి ఆహారధాన్యాలను ఉచితంగా అందిచే పథకాలు ఉన్నాయి. అయితే  వివిధ కారణాల వల్ల అవి అందరికీ చేరడం లేదని చాలామంది చెప్తున్నారు.  ప్రపంచంలోనే అతి పెద్ద ఆహార భద్రతా కార్యక్రమంగా 1975లో ‘సమగ్ర బాలల అభివృద్ధి’ ప్రోగ్రామ్ మొదలైంది. ప్రభుత్వం చేపట్టిన ‘పోషణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అభియాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’, ‘ప్రధానమంత్రి గరీబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కళ్యాణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్న యోజన’, ‘మధ్యాహ్న భోజన పథకం’ లాంటి పథకాలతో స్టంటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వేస్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రక్తహీనత, తక్కువ బరువు ఉన్న శిశు జననాలను తగ్గించడానికి ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. ఆహార భద్రత పథకంలో భాగంగా గర్భిణులు, పిల్లల తల్లులు, పిల్లలకు పౌష్టికాహారం అందించే పథకాలు ఉన్నాయి. అలాగే ‘ఆయుష్మాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’, ‘అంత్యోదయ’, ‘పీఎం కిసాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’, ‘ఉజ్వల’, ‘వంద రోజుల పని’, ‘పనికి ఆహార పథకం’ లాంటివి కూడా ఉన్నాయి. వీటిద్వారా ఆకలి సమస్యను తగ్గించే ప్రయత్నం జరుగుతోంది.

వీటితోపాటు తెలంగాణలో ‘అన్నపూర్ణ’, ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ‘అన్న క్యాంటిన్లు/రాజన్న క్యాంటిన్లు/ గోరుముద్ద’, తమిళనాడులో ‘అమ్మ క్యాంటిన్లు’ , రాజస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ‘దీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దయాళ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భోజనాలయ’,  కర్ణాటకలో ‘నమ్మ క్యాంటిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ ,ఒడిశా, దిల్లీ, యూపీ, హరియాణా, పంజాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో వేరువేరు పేర్లతో సబ్సిడీ ధరలకు ఆహారం అందించే కార్యక్రమాలు కూడా ఉన్నాయి. 

జనాభా కూడా కారణమే

పోషకాహార లోపం, ఆకలి సమస్యలకు మరో ముఖ్య కారణం జనాభా. ప్రస్తుతం దేశ జనాభా 140 కోట్లకు చేరుకుంది. అలాగే దేశంలో ప్రతిరోజూ సగటున 60 వేల మంది పిల్లలు పుడుతున్నారు. ప్రతి ఏటా ఒక్కమనదేశంలోనే 2.55 కోట్ల మంది పిల్లలు పుడుతున్నారు. ప్రపంచంలో ఏ దేశానికి అపరిమిత వనరులు లేవు. వనరులు తక్కువగా ఉంటూ జనాభా ఎక్కువగా పెరుగుతున్నప్పుడు ఆకలి సమస్యలు పెరగడం సహజం. అందుకే జనాభాను నియంత్రించడం కూడా అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇండియా‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే చైనా జనాభా తగ్గుతూ వస్తోంది. కొన్నేండ్లలో ఇండియా జనాభా చైనాను దాటబోతోంది. 

ఆహార వ్యవసాయ సంస్థ (ఫుడ్ అండ్​ అగ్రికల్చర్​ ఆర్గనైజేషన్​), ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థల అంచనా ప్రకారం 2050 నాటికి ప్రపంచ జనాభా 900 కోట్లకు చేరుకునే అవకాశాలున్నాయి. అప్పటి జనాభా అవసరాలను తీర్చడానికి ఫుడ్ ప్రొడక్షన్ 70 శాతం పెరిగితే గానీ ఆకలి సమస్యను తగ్గించడం సాధ్యం కాదు. వ్యవసాయం కోసం సాగుభూములు పెరిగే అవకాశాలు లేవు. మెరుగైన వంగడాలు, ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా తిండి గింజల ప్రొడక్షన్ పెంచడంతో పాటు, ప్రత్యామ్నాయ ఆహార పద్ధతులను తీసుకురావాల్సిన అవసరం ఉందని వ్యవసాయ నిపుణులు చెప్తున్నారు.

పేదరికం మరో సమస్య

పేదరికాన్ని, ఆకలిని వేరుచేసి చూడడం అసాధ్యం. నీతి ఆయోగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‘మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్’ 2021 రిపోర్ట్ ప్రకారం మన దేశంలో మొత్తం పేదరికం 25.01 శాతంగా ఉంది. ఎక్కువ పేదరికం ఉన్న రాష్ట్రాల్లో బిహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (51.91%), జార్ఖండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (42.16%), ఉత్తర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (37.79%)ఉన్నాయి. తక్కువ పేదరికం ఉన్న రాష్ట్రాల్లో కేరళ (0.71%), గోవా (3.76%) ఉన్నాయి. పేదరికంలో తెలంగాణ 18వ స్థానం(14.85%), ఆంధ్రప్రదేశ్ 20వ స్థానం(13.16% ) లో ఉన్నాయి.

కనీస అవసరాలు కూడా పొందలేని స్థితిని పేదరికంగా చెప్పుకోవచ్చు. సగటున ఒక వ్యక్తికి రోజుకు 2,300 కేలరీల ఆహారం కావాల్సి ఉంటుంది. 2,300 కేలరీల కంటే తక్కువ ఆహారం పొందితే పావర్టీ లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కింద ఉన్నట్లు లెక్క. రోజుకు 2,300 కేలరీల కంటే ఎక్కువ ఆహారం అందితే.. వాళ్లను పావర్టీ లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పైన ఉన్నవాళ్లుగా చెప్పొచ్చు. మనదేశంలో 8 కోట్ల మంది పావర్టీ లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కింద ఉన్నారు. అందులో మూడున్నర కోట్లమంది మగవాళ్లు, నాలుగున్నర కోట్ల మంది ఆడవాళ్లు ఉన్నారు. ఏటా ధరలు పెరుగుతున్నా.. వీళ్లకు మాత్రం నిలకడైన ఆదాయ మార్గం ఉండదు. అటు ఆహారం, ఇటు విద్య, వైద్యం కోసం వీళ్లు చేసే ఖర్చులో ఏ ఒక్క అవసరం కోసం ఎక్కువ ఖర్చు చేసినా,  రెండవదానికోసం చేసే ఖర్చు తగ్గించుకోవాల్సి వస్తుంది. దాంతో పేదరికం మరింత పెరుగుతోంది.

ఆకలి సమస్యను తగ్గించే మార్గాలు 

  •     మారుమూల ప్రాంతాల్లో పథకాలు అమలు అవ్వడంపై ఫోకస్ పెట్టడం.
  •     ఫుడ్ ప్రాసెసింగ్‌‌‌‌లో వేస్ట్ జరగకుండా చూసుకోవడం.
  •     ఆహారాన్ని అందించడంతో పాటు ప్రజల ఆదాయాన్ని కూడా పెంచడం.
  •     ఫుడ్ డిస్ట్రిబ్యూషన్‌‌‌‌లో లోపాలు లేకుండా చూసుకోవడం. 
  •     పల్లెలు, వాడల్లో పోషకాహారం గురించి అవగాహన పెంచడం.
  •     నిల్వ చేసే చోట ఆహార ధాన్యాలు పాడవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవడం.
  •     ఎవరికి వారు ఫుడ్‌‌‌‌ వేస్ట్ చేయకుండా జాగ్రత్త పడడం.

మనమేం చేయాలి?

దేశాభివృద్ధికి పౌష్టికాహారమే పునాది. ఆకలి సమస్యను తగ్గించడం మనచేతిలో లేకపోయినా.. ఫుడ్  వేస్ట్‌‌‌‌ను తగ్గించడం ప్రతి ఒక్కరి చేతిలో ఉంది. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వేస్టేజ్‌ను ఈజీగా అరికట్టొచ్చు. చాలామంది తమకు అవసరమైన దానికన్నా ఎక్కువ కొనడానికి ఇష్టపడుతుంటారు. ఆ అలవాటుని మానుకొని తెలివిగా షాపింగ్ చేయాలి. అవసరమైనవి మాత్రమే కొనాలి.ఆహారాన్ని సరిగా నిల్వచేయకపోతే ఎక్కువ మొత్తంలో వృధా అవుతుంది. అందుకే పండ్లు, కూరగాయలను ఎలా నిల్వ చేయాలో తెలుసుకుని పాడవ్వకుండా వాడుకోవాలి.పెండ్లి, పార్టీ, హోటళ్లలో ఫుడ్ వేస్ట్‌‌‌‌ను తగ్గించాలి.  వేస్ట్​ అవుతున్న ఆహారాన్ని సేకరించి అవసరమున్న వాళ్లకు అందించాలి. అలాగే ఇంట్లో మిగిలిపోయిన ఫుడ్‌‌‌‌ను చెత్తబుట్టపాలు చేయకుండా అవసరమున్న వాళ్లకు ఇవ్వాలి.భూమి వేడెక్కకుండా చెట్లు పెంచాలి. లోకల్‌‌‌‌గా పెరిగే పండ్లు, కూరగాయలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సూపర్ మార్కెట్లకు బదులు లోకల్ మార్కెట్లలో కొనడం ద్వారా కూడా పంట వేస్టేజ్​ను తగ్గించొచ్చు.
 

ఆకలి ఎక్కువైతే..

ఒక దేశంలో ఆకలి, పోషకాహార లోపం ఎక్కువైతే ఆ దేశంలో అనారోగ్య సమస్యలు, గుండె సమస్యలు ఎక్కువగా పెరుగుతాయి. మరణాల రేటు పెరుగుతుంది. దేశం బలహీనంగా తయారవుతుంది. తిండి కోసం యుద్ధాలు కూడా జరగొచ్చు. అందుకే ఆకలి సమస్యలను వీలైనంత త్వరగా తగ్గించాలి. ‘‘ఆహారాన్ని సంపాదించుకునే మార్గం లేకపోవడమే ఆకలికి కారణం” అంటాడు ఇండియన్ ఎకనమిస్ట్ అమర్త్య సేన్. ‘‘ఉపాధి, ఆదాయ మార్గాలు ఉన్నప్పుడు ఆకలికి చోటు ఉండదు. ఆఫ్రికా దేశాల మాదిరిగా మనదేశంలో ఆకలితో విలవిల్లాడుతున్న దృశ్యాలు కనిపించనప్పటికీ.. కనిపించని ఆకలి ఉంటుంది ఇక్కడ. అలాగే ఫుడ్ గ్లోబలైజేషన్ వల్ల ఆకలితో సంబంధం లేకుండా ఆహారం అనేది ఒక బ్రాండెడ్ వస్తువుగా మారుతుంది. అవసరమున్నా.. లేకున్నా.. తినే అలవాటుని పెంచుతుంది. ఇది కూడా ఆకలి సమస్య పెరగడానికి ఒక కారణం. వీటితోపాటు ఒక దేశానికి చెందిన సంస్థలు మరొక దేశంలో తమ ఆహార ఉత్పత్తులను పండించడం వల్ల కూడా ఆకలి సమస్య మరింత పెరుగుతుంది” అని హంగర్​ అండ్​ పబ్లిక్​ యాక్షన్​ అనే పుస్తకంలో రాశాడు అమర్త్య సేన్.
 

::: తిలక్​