58 మంది సైనికులను లేపేశాం.. మళ్లీ మా జోలికి వస్తే ఊరుకోం: పాక్‎కు ఆప్ఘాన్ వార్నింగ్

58 మంది సైనికులను లేపేశాం.. మళ్లీ మా జోలికి వస్తే ఊరుకోం: పాక్‎కు ఆప్ఘాన్ వార్నింగ్

కాబూల్: పాకిస్తాన్‎కు చెందిన 58 మంది సైనికులను హతమార్చామని తాలిబాన్ ప్రతినిధి జాబిహుల్లా ముజాహిద్ ఆదివారం తెలిపారు. అఫ్గాన్ భూభాగంలో పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగా ఈ చర్యలు చేపట్టినట్టు ఆయన పేర్కొన్నారు. శనివారం రాత్రి దురంద్ లైన్ సమీపంలోని బెహ్రంపూర్ జిల్లాలో అఫ్గాన్ ఆర్మీ చేపట్టిన ప్రతీకార దాడుల్లో 58 మంది పాక్​ సైనికులు మరణించారని ఆయన ప్రకటించాడు.

 అలాగే, మరో 30 మంది పాకిస్తాన్ సైనికులు గాయపడ్డారని, 25 పాకిస్తాన్ సైనిక చౌకీలను తమ సైన్యం స్వాధీనం చేసుకుందని పేర్కొన్నాడు. డ్యూరాండ్ లైన్ వెంబడి జరిగిన ప్రతీకార ఆపరేషన్లలో 20 పాకిస్తాన్ భద్రతా స్థావరాలు ధ్వంసమయ్యాయని, అనేక ఆయుధాలు, సైనిక పరికరాలు స్వాధీనం చేసుకున్నాయని ముజాహిద్ తెలిపారు. ఆ ఆపరేషన్లలో తొమ్మిది మంది అఫ్గాన్ సైనికులు మరణించారని, మరో 16 మంది గాయపడ్డారని ఆయన తెలిపారు. 

ఖతార్, సౌదీ అరేబియా అభ్యర్థనల మేరకు అర్ధరాత్రి ఆపరేషన్‎ను నిలిపివేసినట్టు తెలిపారు. గతవారం అఫ్గాన్ రాజధాని కాబూల్‌‌‌‌‌లో రెండు చోట్ల, గురువారం రాత్రి తూర్పు ప్రావిన్స్ పక్తికాలోని మార్కెట్‌‌‌‌లో పేలుళ్లు సంభవించాయి. పాకిస్తాన్‎కు చెందిన యుద్ధ విమానాలే ఈ దాడులకు పాల్పడ్డాయని అఫ్గాన్ అధికారులు ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలపై పాకిస్తాన్​ స్పందించలేదు. 

కాగా, శనివారం రాత్రి 10 గంటల సమయంలో అఫ్గాన్ సైన్యం ప్రతీకార దాడులు చేపట్టింది. కాగా, తాలిబాన్ ప్రతినిధి జాబిహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ.. పాక్ చేసిన ప్రతీ దాడికీ తప్పకుండా బదులిస్తామని తేల్చి చెప్పారు. అలాగే, పాకిస్తాన్​ఐఎస్ టెర్రరిస్టులకు ఆశ్రయం ఇస్తోందని ఆరోపించారు. "పాకిస్తాన్ తమ భూభాగంలో ఐఎస్ ఉనికిని కనీసం గుర్తించడంలేదు. పాకిస్తాన్​మరోసారి ఇలాగే ప్రవర్తిస్తే.. అఫ్గానిస్తాన్‌‌‌‌కు తన వాయు, భూ సరిహద్దులను రక్షించుకోవడం తెలుసు. 

మా సాయుధ దళాలు దేశ సరిహద్దులను రక్షించడానికి బలమైన ప్రతిస్పందనను ఇస్తాయి. ఏ దాడినీ ఊరికే వదిలేది లేదు. పాకిస్తాన్ తమ భూమిలో దాక్కున్న ముఖ్యమైన ఐఎస్ సభ్యులను అక్కడి నుంచి తరలించాలి లేదా వారిని ఇస్లామిక్ ఎమిరేట్‌‌‌‌కు అప్పగించాలి. ఐఎస్ టెర్రరిస్టులతో అఫ్గానిస్తాన్‌‌‌‌ సహా ప్రపంచంలోని అనేక దేశాలకు ముప్పుగా ఉంది" అని జాబిహుల్లా ముజాహిద్ పేర్కొన్నారు.