
జగిత్యాల, వెలుగు : కాంగ్రెస్ ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా నిలబడి గెలుస్తుండటానికి కార్యకర్తలే కారణమని ఏఐసీసీ పరిశీలకులు కత్తి వెంకట స్వామి, అంజన్ కుమార్ పేర్కొన్నారు. జగిత్యాలలోని ఏబీ కన్వెక్షన్ లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, ధర్మపురి ఎమ్మెల్యే విప్ అడ్లూరి లక్ష్మణ్ అధ్యక్షత బుధవారం నిర్వహించిన సమావేశం లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి, రాష్ట్ర నేత జువ్వాడి నర్సింగారావు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ అధినేత రాహుల్ గాంధీ ఆలోచన, ఏఐసీసీ నిర్ణయం మేరకు కార్యకర్తలకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో పార్టీ సంస్థాగత పటిష్టతకు కృషి చేస్తానని చెప్పారు. సమావేశంలో కృష్ణరావు, కరంచంద్, బండ శంకర్, తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు.
జువ్వాడి వర్సెస్ సుజిత్ రావు వర్గాల వాగ్వాదం
జిల్లా కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేంలో కోరుట్ల ఇన్ చార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు వర్గీయులు, కల్వకుంట్ల సుజిత్ రావు వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మెట్ పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని బీఆర్ఎస్ నుంచి వచ్చిన గోవర్ధన్ రెడ్డికి ఎలా ఇస్తారని జువ్వాడి వర్గీయులు నిలదీయడంతో సుజిత్ రావు వర్గీయులు ఎదురుదాడికి దిగడంతో వివాదం చోటు చేసుకుంది. పార్టీ కోసం పనిచేయని వారికి పదవులు ఇస్తున్నారని, కష్టపడ్డ కార్యకర్తలను పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ జోక్యం చేసుకోగా వివాదం సద్దుమణిగింది. sఅనంతరం సుజిత్ రావు వర్గీయులు బయటకు
వెళ్లిపోయారు.