
- హత్య కేసులో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయిస్తాం
- మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య
జగిత్యాల, వెలుగు: ప్రభుత్వ పరంగా అన్నివిధాల మల్లేశ్ కుటుంబాన్ని ఆదుకుంటామని రాష్ట్ర మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కిషన్ రావు పేట్ గ్రామానికి చెందిన సల్లూరి మల్లేశ్ ఈనెల17న దారుణ హత్యకు గురవగా.. బాధిత కుటుంబాన్ని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి గురువారం పరామర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కుల వివక్ష కారణంగా హత్యకు గురైన మల్లేశ్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఉద్యోగంతో పాటు భూమిని అందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. నిందితులకు కఠిన శిక్షపడేందుకు తను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరఫున రూ.4,12,500 చెక్ ను అందించారు.
కుల దురహంకారంతో మల్లేశ్ ను హత్యచేసిన నిందితులకు కఠినంగా శిక్ష పడేందుకు ప్రత్యేక అధికారితో దర్యాప్తు చేయించేందుకు ఎస్పీకి ఆదేశాలు ఇచ్చినట్లు కమిషన్ చైర్మన్ వెంకటయ్య తెలిపారు. కలెక్టర్ జి.సత్యప్రసాద్, డీఎస్సీ డీపీవో రాజ్ కుమార్, ఆర్డీవో పులి మధుసూదన్, నేతలు, అధికారులు ఉన్నారు.