హలో..వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారా?

హలో..వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారా?
  • ఫోన్ కాల్ చేసి ఫిమేల్ వాయిస్ తో ట్రాప్ చేస్తున్నసైబర్ నేరగాళ్లు
  • నెలకు రూ.12 వేల సంపాదనతో పార్ట్ టైంజాబ్ అని చెప్పి మోసం
  • గచ్చిబౌలికి చెం దిన యువకుడి దగ్గరి నుంచి రూ.లక్షా47 వేలు వసూలు

సైబర్ నేరగాళ్ళు కొత్త మోసాలకు తెరతీశారు. వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో ట్రాప్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. జాబ్ పోర్టల్ వెబ్ సైట్స్ అడ్డాగా సాగుతున్న ఈ నయా సైబర్ క్రైమ్ లో నిరుద్యోగ యువత మోసపోతున్నారు. గచ్చిబౌలికి చెందిన ఓ యువకుడి దగ్గరి నుంచి సైబర్ నేరగాళ్లు వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో రూ.1.47లక్షలు వసూలు చేశారు. తన బయోడేటా ఆధారంగా జరిగిన సైబర్ చీటింగ్ తో బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు. వివరాల్లోకి వెళితే..గచ్చిబౌలికి చెందిన జి.నాగరాజు జాబ్ పోర్టల్స్ లో తన బయోడేటాను అప్ లోడ్ చేశాడు. మంచి జాబ్ కోసం వివిధ కంపెనీల్లో ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతుండేవాడు.ఈ క్రమంలో నాగరాజు మొబైల్ నంబర్ కి గత నెల స్నేహ అనే యువతి కాల్ చేసింది. స్వీట్ వాయిస్ తో మాట్లాడింది. జాబ్ పోర్టల్ లో నాగరాజు పోస్ట్ చేసిన బయోడేటా వివరాలను చెప్పింది. కంపెనీల్లో జాబ్ కంటే ఇంటి వద్దే ఉండి పనిచేసేలా తమ వద్ద ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ఆప్షన్ ఉన్నట్టు తెలిపింది. పార్ట్ టైం జాబ్ లో భాగంగా కొన్ని గంటలు మాత్రమే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే నెలకి రూ.12 వేలు చెల్లి స్తామని ఆ యువతి నాగరాజును నమ్మించింది.

డబ్బులు డిపాజిట్ చేయమని

జాబ్ ఆఫర్, వర్క్ ఇచ్చినందుకు నాగరాజు అడ్వాన్స్ గా కొంత డబ్బు చెల్లించాలని ఆ యువతి సూచించింది. కొన్ని కండీషన్స్ గురించి కూడా నాగరాజుతో చెప్పింది. దీంతో ఆమె మాటలు నమ్మిన నాగరాజు వర్క్ ఫ్రమ్ హోమ్ కి అంగీకరించాడు. ఆ తర్వాత వారం రోజులకు అడ్వకేట్ పేరుతో నాగరాజుకి మరో కాల్ వచ్చింది.నాగరాజు జాయిన్ అయిన వర్క్ ఫ్రమ్ హోమ్ కంపెనీపై క్రిమినల్ కేసులు ఉన్నాయని అందులో వర్క్ చేసిన నాగరాజుపై కూడా క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయని బెదిరించాడు. ప్రాసిక్యూషన్ నుంచి క్రిమినల్ కేసులు క్లియర్ చేయడానికి రూ.1.47లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశాడు. దీంతో భయపడిపోయిన నాగరాజు సైబర్ నేరగాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో డబ్బు డిపాజిట్ చేశాడు.

అప్రమత్తంగా ఉండాలి
నాగరాజు తనుకు జరిగిన మోసం గురించి సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. జాబ్ పోర్టల్ వివరాలు, వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో వచ్చిన ఫొన్ నంబర్, ఫేక్ అడ్వకేట్ ఫొన్ నంబర్స్ తో పాటు డబ్బులు డిపాజిట్ చేసిన బ్యాంక్ అకౌంట్ డిటైల్స్ తో ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలాంటి మోసాలపై నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో వచ్చే ఆన్ లైన్ జాబ్ కాల్స్ నమ్మకూడదని చెప్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా డబ్బులు చెల్లించకుండా అనుమానం వచ్చిన కాల్స్,సైట్లపై స్థా నిక సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.