కరీంనగర్‌‌ బీఆర్ఎస్ అభ్యర్థిపై ఈసీకి ఫిర్యాదు చేస్తాం

కరీంనగర్‌‌ బీఆర్ఎస్ అభ్యర్థిపై ఈసీకి ఫిర్యాదు చేస్తాం

కరీంనగర్ సిటీ, వెలుగు: కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్  అఫిడవిట్‌లో వేరొకరి భూమిని తన భూమిగా చూపించారని , దీనిపై ఎలక్షన్‌ కమిషన్ ఫిర్యాదు చేయనున్నట్లు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, అధికార ప్రతినిధి రాణీరుద్రమ తెలిపారు. మంగళవారం ఎంపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ వినోద్​కుమార్​ ఎలక్షన్‌ కమిషన్‌కు తప్పుడు సమాచారమిచ్చారని, తనది కాని భూమిని కూడా తనదిగా అఫిడవిట్‌లో పేర్కొన్నారన్నారు. అఫిడవిట్‌లో ప్రకటించిన 251/బీ సర్వే నంబర్ లో వినోద్‌కుమార్ కుటుంబానికి ఎలాంటి భూమి లేదని, ఆ నంబర్‌‌పై అదే గ్రామానికి చెందిన అప్పని పెద్ద సాంబయ్యకు 14 గుంటలు ఉన్నట్లు ధరణిలో కనిపిస్తోందన్నారు. 

తనది కాని  భూమిని తనదిగా వినోద్ కుమార్ ఎలా ప్రకటించారని ప్రశ్నించారు. వినోద్‌కుమార్ భార్య బోయిన్‌పల్లి మాధవి పేరిట రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం నర్సింగాపూర్ గ్రామంలో19.28 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్లు చూపించగా, ధరణి పోర్టల్‌లో 19.13 ఎకరాలు మాత్రమే నమోదై ఉందన్నారు. ఈ లెక్కన అఫిడవిట్​లో 15 గుంటలు ఎక్కువగా చూపారన్నారు. తప్పుడు ఆస్తులు చూపించిన వినోద్ కుమార్​పై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరుతామన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్​కు ఆవేశం ఎక్కువ...ఆలోచన తక్కువగా ఉందన్నారు. లొల్లి చేయడం తప్ప సబ్జెక్టుపై అవగాహనే ఉండడం లేదన్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేయకపోయినా చేసినట్లుగా పచ్చి అబద్దాలు చెప్తున్నారని మండిపడ్డారు. రిజర్వేషన్ల రద్దు పేరుతో అబద్దాలాడుతూ కులాలు, మతాల మధ్య చిచ్చుపెడుతున్నారన్నారు. సమావేశంలో బీజేపీ లీడర్లు గండ్ర నళిని, డి.శంకర్ తదితరులు పాల్గొన్నారు.