నూతన టెక్నాలజీతో సైబర్ నేరాలను నియంత్రిస్తాం : మహమూద్ అలీ

నూతన టెక్నాలజీతో సైబర్ నేరాలను నియంత్రిస్తాం : మహమూద్ అలీ

హైదరాబాద్ గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ స్టేట్ పోలీసు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ సైబర్ సేఫ్టీని మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్ సీపీలు సీవీ. ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర, కొందరు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీవోఈ వెబ్ సైట్ ను హోంమంత్రి మహమూద్ అలీ లాంచ్ చేయగా.. తెలంగాణ స్టేట్ పోలీస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ సైబర్ సేఫ్టీ బుక్ ను మంత్రి కేటీఆర్ లాంచ్ చేశారు.

సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, సైబర్ నేరాల రూపమూ మారుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. తన ఒక మిత్రుడు సైబర్ మోసానికి గురయ్యాడన్న మంత్రి.. తెలిసిన మిత్రుడికి ఆపద అని మెసేజ్ రావడంతో లక్ష రూపాయలు క్రెడిట్ చేశాడని చెప్పారు. తర్వాత మోసపోయానని తెలుసుకుని, ఫిర్యాదు చేయడానికి వెనకాడాడని, ఇదే సైబర్ మోసగాళ్లకు అనువుగా మారిందని తెలిపారు. ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ పెరుగుతున్నాయని, ఫోన్ డేటా హ్యాక్ చేసి సైబర్ నేరగాళ్లు మోసాలు చేస్తున్నారని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు.

హైదరాబాద్ లో ఐటీ కంపెనీ ల్లో ఎక్కువ మంది పని చేస్తున్నారని, సైబర్ నేరాల నియంత్రణకు ఐటీ కంపెనీలు, పోలీసులతో కలిసి పని చేయాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. సైబర్ టోల్ ఫ్రీ నెంబర్ 1930 ను ప్రమోట్ చేయాలని ఈ సందర్భంగా సూచించారు. సైబర్ నేరాల నియంత్రణకు సైబర్ వారియర్స్ పని చేస్తున్నారని, సైబర్ నేరాలను అరికట్టడానికి పోలీసులు పని చేస్తున్నారన్నారు. సైబర్ మోసాలతో జాగ్రత్త వహించాలన్న కేటీఆర్.. తెలంగాణ పోలీసింగ్ సైబర్ మోసాలను ఎదుర్కొనే కెపాసిటీ సాధించామని చెప్పారు. సైబర్ మోసాలపై ఫిర్యాదులు చేయండని, తెలంగాణ పోలీసింగ్ అన్ని సవాళ్లను ఎదుర్కొంటుందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలీసు వ్యవస్థను బలోపేతం చేశామని చెప్పుకొచ్చారు. ప్రపంచ దేశాలు ఇక్కడి భద్రత చూసి పెట్టుబడుల కోసం వస్తున్నాయన్నారు.

సైబర్ నేరాలను తగ్గిస్తాం..

సీఎం కేసీఆర్ పోలీస్ డిపార్ట్ మెంట్ కు అధిక ప్రాధాన్యత ఇచ్చారని  హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. తెలంగాణలో క్రైమ్ కంట్రోల్ లో ఉందన్న ఆయన.. రాష్ట్రంలో క్రైమ్ తగ్గిందని చెప్పారు. స్టేట్ లో 64 శాతం సీసీ కెమెరాలు ఉన్నాయని, ప్రసుతం సైబర్ నేరాలు పెరుగుతున్నాయన్నారు. నూతన టెక్నాలజీతో సైబర్ నేరాలను నియంత్రిస్తామన్న హోంమంత్రి.. సైబర్ నేరాలు కంట్రోల్ చేయడానికి అన్ని ఐటీ కంపెనీలతో చర్చించామని స్పష్టం చేశారు. వారి సహకారంతో సైబర్ నేరాలను తగ్గిస్తామని హామీ ఇచ్చారు.

కంట్రీలోనే తెలంగాణ పోలీస్ నెంబర్ వన్

సీవోఈ ఏర్పాటు చేయడం తెలంగాణ పోలీస్ డ్రీమ్ అని డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పారు. క్రైమ్  చేంజ్ అవుతుందని, డిజిటల్ వరల్డ్ లో సైబర్ నేరాలు పెరుగుతున్నాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం సేఫ్టీ సెక్యూరిటీకి అధిక ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. దీంతో పెట్టుబడులు కూడా పెరుగుతాయన్న డీజీపీ... కంట్రీలొనే తెలంగాణ పోలీస్ నెంబర్ వన్ అని గర్వంగా చెప్పారు. రాష్ట్రంలో 10 లక్షల సీసీ కెమెరాలు పని చేస్తున్నాయని, ఎక్కడ క్రైమ్ జరిగినా వెంటనే ట్రేస్ చేస్తున్నామన్నారు. నిరంతరం పెట్రోలింగ్ వెహికిల్స్  ప్రజల కోసం పని చేస్తున్నాయన్న డీజీపీ మహేందర్ రెడ్డి... సైబర్ సేఫ్టీ లో స్టేట్ ముందుందన్నారు. సైబర్ నేరాల నియంత్రణ కు ఈ సీవోఈ  పని చేస్తోందని చెప్పారు. సైబర్ నేరాలను ఎదురుక్కోవడానికి నూతన టెక్నాలజీ తీసుకువచ్చామని, సైబర్ సెక్యూరిటీకి ఇది బలం చేకూర్చుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.