జమ్మూకాశ్మీర్​కు త్వరలో రాష్ట్ర హోదా : ప్రధాని మోదీ

జమ్మూకాశ్మీర్​కు త్వరలో రాష్ట్ర హోదా : ప్రధాని మోదీ
  •    దశాబ్దాల తర్వాత నిర్భయంగా ఎన్నికలు జరుగుతున్నయ్: ప్రధాని మోదీ
  •     పోల్​బాయ్​కాట్​ క్యాంపెయినింగ్​అనేది ఇక చరిత్రే
  •     60 ఏండ్లుగా జమ్మూకాశ్మీర్​ను పట్టిపీడిస్తున్న సమస్యలను తీర్చాం
  •     కాంగ్రెస్​కు దమ్ముంటే ఆర్టికల్​ 370ని పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వాలి
  •     బీజేపీ పాలిత ప్రాంతాల్లోనూ ఈడీ దాడులు చేస్తుంది
  •     జమ్మూకాశ్మీర్​లోని ఉధంపూర్​లో ఎన్నికల ప్రచారం

ఉధంపూర్: పదేళ్ల పాలనలో  జమ్మూ కాశ్మీర్ ను ఎంతగానో మార్చేశామని, అభివృద్ధి మార్గంలో నడిపిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. త్వరలోనే పూర్తిస్థాయి రాష్ట్ర హోదాను కట్టబెడతామని హామీ ఇచ్చారు. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగే రోజు మరెంతో దూరంలో లేదని అన్నారు. రాష్ట్ర హోదా కట్టబెట్టిన వెంటనే ఎన్నికలు జరుగుతాయని, ఆపై మీ సమస్యలను, అవసరాలను, సంతోషాలను మీమీ ఎమ్మెల్యేలతో పంచుకునే రోజు తొందర్లోనే వస్తుందని అన్నారు. ఈమేరకు లోక్​ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఉధంపూర్ లో జరిగిన ర్యాలీలో మోదీ పాల్గొని ప్రసంగించారు. బీజేపీ హయాంలో జమ్మూ కాశ్మీర్ రూపు రేఖలు వేగంగా మారిపోతున్నాయని చెప్పారు. దశాబ్దాల తర్వాత జమ్మూ కాశ్మీర్​లో నిర్భయంగా సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. టెర్రర్, రాళ్ల దాడులు, కాల్పులు లేకుండా లోక్​సభ ఎన్నికలు జరుపుతామని ప్రజలకు హామీ ఇచ్చారు. 

జమ్మూకాశ్మీర్​లో గత మూడు దశాబ్దాలుగా వేర్పాటువాదులు నిర్వహించిన పోల్​ బాయ్​కాట్​ క్యాంపెయిన్స్​​ఇక చరిత్రేనని కామెంట్ చేశారు. 60 ఏండ్లుగా జమ్మూ కాశ్మీర్​ను పట్టిపీడిస్తున్న సమస్యలన్నింటినీ తీర్చామని చెప్పారు. కాంగ్రెస్, విపక్షాలకు దమ్ముంటే 2019 ఆగస్టులో బీజేపీ సర్కారు రద్దు చేసిన ఆర్టికల్​370ని పునరుద్ధరిస్తామని ప్రకటించాలని సవాల్​ విసిరారు. అలా చేస్తే దేశప్రజలు ఆ పార్టీ ముఖం కూడా చూడరని అన్నారు. ‘నేను ఐదు దశాబ్దాలుగా జమ్మూకాశ్మీర్​ వస్తున్నాను. 2014లో వైష్ణోదేవి ఆలయంలో పూజలు నిర్వహించాను. ఇక్కడి ప్రజలను ఉగ్రవాదం నుంచి విముక్తి చేస్తానని హామీ ఇచ్చాను. ప్రజల ఆశీర్వాదంతో ఆ గ్యారంటీని నెరవేర్చాను’ అని మోదీ పేర్కొన్నారు.

హక్కులు కాపాడిందెవరో ప్రజలకు తెలుసు..

ఆర్టికల్​370ని రద్దు చేసి, వారి హక్కులు కాపాడిందెవరో జమ్మూకాశ్మీర్​ ప్రజలకు తెలుసునని ప్రధాని మోదీ అన్నారు.  ఆర్టికల్​ 370 రద్దుతో స్వాతంత్ర్యానంతరం తొలిసారి జమ్మూకాశ్మీర్​లోని ప్రజలు రాజ్యాంగపరమైన హక్కులు పొందేలా, అన్నివర్గాలకు సమన్యాయం జరిగేలా చేశామని చెప్పారు. ‘తమ కొడుకులపై రాళ్లు పడతాయని ఇక సైనికుల తల్లులు చింతించరు. ఈ లోయలోని తల్లులు నాపై ఆశీర్వచనాలు కురిపిస్తున్నారు. ఇప్పుడు వాళ్లు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఈ ప్రాంతంలోని బ్రిడ్జిలు తగలబడిపోవు. ఎయిమ్స్​, ఐఐఎంలు, అధునాతన టన్నెళ్లు, విశాలమైన రహదారులు, రైల్వే లైన్లతో జమ్మూకాశ్మీర్​ రూపురేఖలే మారిపోనున్నాయి’ అని మోదీ పేర్కొన్నారు. గత పదేండ్లలో ఉగ్రవాదం, అవినీతిని పూర్తిగా నిర్మూలించామని చెప్పారు. ఇక్కడికి టూరిస్టులు, భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారని, ఇది ఇక్కడి ప్రజల కల అని పేర్కొన్నారు. 2047 వరకు వికసిత్​ భారత్​ హామీని నెరవేర్చేందుకు తాను 24 గంటలను శ్రమిస్తానని తెలిపారు.

రాజ్యాంగాన్ని బీజేపీ గౌరవిస్తుంది

భారత రాజ్యాంగాన్ని బీజేపీ గౌరవిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తుందని కాంగ్రెస్​, ఇండియా కూటమి చేస్తున్న ఆరోపణలపై మోదీ స్పందించారు. డాక్టర్​ బాబా సాహెబ్​ అంబేద్కర్​ వచ్చినా ఇప్పుడు రాజ్యాంగాన్ని రద్దు చేయలేరని అన్నారు. రాజస్థాన్​ రాష్ట్రంలోని బర్మేర్​లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మోదీ పాల్గొని, ప్రసంగించారు.

రామమందిరం ఎన్నికల అంశం కాదు

రామమందిరం అనేది ఎన్నికల అంశం కాదని, ఇది దేశ ప్రజల విశ్వాసం అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘రామమందిరం అనేది బీజేపీ ఎన్నికల అంశమని కాంగ్రెస్, విపక్ష ఇండియా కూటమి అంటున్నది.  కానీ, అది ఎప్పటికీ పోల్​ ప్లాంక్​ కాదని నేను స్పష్టం చేయాలనుకుంటున్నా. బీజేపీ పుట్టకముందే ఈ దేశంలో రామమందిర ఉద్యమం నడిచింది. మొఘల్స్​ లాంటి విదేశీ దురాక్రమణదారులు మన ఆలయాలను ధ్వంసం చేసినప్పుడు.. మతపరమైన ప్రాంతాలు, ప్రార్థనా స్థలాలను పరిరక్షించుకునేందుకు భారత ప్రజలు పోరాడారు’ అని మోదీ అన్నారు.  కాంగ్రెస్​, దాని మిత్రపక్షాల నాయకులు పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉంటారని, కానీ రామ్​లల్లా టెంట్​ మార్చే విషయానికి వచ్చేసరికి వెనుదిరిగారని, కోర్టు కేసులతో బెదిరించారని మండిపడ్డారు.

ఈడీ కేసుల్లో అవి 3 శాతమే..

ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తు చేస్తున్న కేసుల్లో రాజకీయ నేతల కేసులు కేవలం 3% మాత్రమేనని మోదీ చెప్పారు.  మిగతా 97% కేసులు అధికారులు, క్రిమినల్స్​కు సంబంధించినవని తెలిపారు. దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తున్నదనే ప్రతిపక్షాల ఆరోపణలపై మోదీ ఫైర్​ అయ్యారు. శుక్రవారం ఆయన ఓ మీడియా ఇంటర్వ్యూలో వివరాలు వెల్లడించారు. పదేండ్లుగా అవినీతి అంతమే లక్ష్యంగా తమ పార్టీ ముందుకుపోతోందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఈడీ దాడులు చేసేందుకు అడుగులు పడుతున్నాయని తెలిపారు.