
- ఇంద్రకరణ్ రెడ్డి అవినీతిని ఆధారాలతో రుజువు చేస్తాం
- జిల్లాలో చెరువులు, భూముల కబ్జాలు చేసిండ్రు
- బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
నిర్మల్, వెలుగు: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అవినీతి అక్రమాలను ఆధారాలతో రుజువు చేస్తామని బీజేపీ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్పారు. స్థానిక ఇందిరానగర్ లో పార్టీ ఆఫీసులో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రితో పాటు బీఆర్ఎస్ నేతలు ఇసుక దందా, చెరువుల భూముల కబ్జాలు, కుంభకోణాలతో దోచుకున్నారని ఆరోపించారు. రూ. కోట్ల కాంట్రాక్టు పనులను తమ ఆస్థాన కాంట్రాక్టర్లకు ఇప్పించుకొని, పెద్ద మొత్తంలో కమిషన్లు దండుకున్నారని విమర్శించారు. మంత్రి ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు.
కేవలం తన సొంత గ్రామమైన ఎల్లపల్లిలో మాత్రమే కొన్ని ఇండ్లను పంపిణీ చేసి, ఆ తర్వాత మరిచిపోయారని మండిపడ్డారు. న్యాయశాఖ మంత్రిగా ఉన్న నిర్మల్ లో జిల్లా న్యాయస్థానానికి సొంత భవనం లేదన్నారు. భూముల కబ్జాలు, అసైన్డ్ భముల్లో లేఔట్లు లాంటి అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. నిర్మల్ లో నిబంధనలకు విరుద్ధంగా ఈద్ గా కోసం అటవీ భూమిని కేటాయించారని ఆరోపించారు. ఈ మీడియాసమావేశంలో పార్టీ లోక్ సభ ఇన్చార్జి అయ్యన్న గారి భూమయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శులు మెడిసిమ్మ రాజు,రాజేశ్వర్ రెడ్డి, డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి, అలివేలు మంగ, శ్రావణ్ రెడ్డి, కమల్ నయన్, అల్లం భాస్కర్, నరేష్, విలాస్ పాల్గొన్నారు.
బీజేపీలోకి రండి..
బీఆర్ఎస్ కు చెందిన మున్సిపల్ కౌన్సిలర్ అయ్యన్న గారి రాజేందర్ ను ఏలేటి మహేశ్వర్ రెడ్డి కలిశారు. ఆయనకు శాలువా కప్పి బీజేపీలోకి రావాలని కోరారు. రాజేందర్ ఇంటికి వెళ్లిన మహేశ్వర్ రెడ్డి ఆయనను పార్టీలోకి ఆహ్వానించిన వ్యవహారం అధికార బీఆర్ఎస్ లో కలకలం రేపింది. ఉదయం నుంచి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెంట ఉన్న రాజేందర్ ను అనూహ్యంగా మహేశ్వర్ రెడ్డి కలవడం
చర్చనీయాంశంగా మారింది.