
కొల్లాపూర్, వెలుగు : పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్‌లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. గురువారం కలెక్టర్ బాదావత్ సంతోష్‌తో కలిసి కొల్లాపూర్ మండల పరిధిలో బోరబండ తండా, సున్నపు తండా, వడ్డెగుడిసెలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భూములు, ఇండ్లు కోల్పోయిన బోరబండ తండా, సున్నపు తాండా, వడ్డే గుడిసెల ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని నిర్వాసితులు మంత్రిని కోరారు.
నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి నీళ్లు వస్తున్నందున సున్నపుతండాలోని ఇండ్లు మునిగిపోయే ప్రమాదం ఉందని, ప్రభుత్వం ఆదుకోవాలని ప్రజలు మంత్రి దృష్టికి తీసుకురాగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీలో ఇండ్లు నిర్మించుకునేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్‌లో సర్వం కోల్పోయిన ప్రజలకు అండగా ఉంటామని, ఎవరూ అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత శాఖల ఆఫీసర్లను ఆదేశించారు. ఆయన వెంట కొల్లాపూర్ ఆర్డీవో బన్సీలాల్ ఉన్నారు.