పొత్తులపై ఎన్నికల సమయంలోనే నిర్ణయం : పవన్

పొత్తులపై ఎన్నికల సమయంలోనే నిర్ణయం : పవన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. పొత్తులపై ఎన్నికల సమయంలోనే నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. ఓట్లు చీలకూడదన్నదే తన అభిప్రాయమన్న ఆయన.. పొత్తులు కుదరకపోతే ఒంటరిగా ఎన్నికల బరిలో దిగుతామని స్పష్టం చేశారు. వైసీపీపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోందని చెప్పారు. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న అనంతరం అభిమానులను ఉద్దేశించి పవన్ మాట్లాడారు.

తెలంగాణ తనకు పునర్జన్మనిచ్చిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కొండగట్టు అంజన్న ఆశీస్సులతో గతంలో ప్రమాదం నుంచి బయటపడ్డ విషయాన్ని పవన్ గుర్తు చేశారు. భవిష్యత్ తరాల కోసం జనసేన తెలంగాణలోనూ పోటీ చేస్తుందని, సామాన్యులకు అండగా ఉంటుందని చెప్పారు. తెలంగాణ కళాకారుల రగిలించిన చైతన్యమే తన పోరాటానికి స్ఫూర్తి అని పవన్ అన్నారు. తుది శ్వాస వరకు తెలుగు రాష్ట్రాల ఐక్యత కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. దుష్ట శిక్షణ కోసం అమ్మవారి పేరైన వారాహిని తన వాహనానికి పెట్టానని అన్నారు. జై తెలంగాణ నినాదంతో పవన్ తన ప్రసంగాన్ని ముగించారు.

అంతకుముందు కొండగట్టు చేరుకున్న పవన్ కల్యాణ్ కు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య వారాహికి ప్రత్యేక పూజలు చేశారు. జనసేనాని పర్యటన నేపథ్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు.