సింగూర్‌‌‌‌ పటిష్టతకు చర్యలు తీసుకుంటాం..రైతులకు ఇబ్బందులు పనులు చేపడతాం..

సింగూర్‌‌‌‌ పటిష్టతకు చర్యలు తీసుకుంటాం..రైతులకు ఇబ్బందులు పనులు చేపడతాం..

వైద్య, ఆరోగ్యశాఖ  మంత్రి దామోదర రాజనర్సింహ


పుల్కల్, వెలుగు : సింగూర్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌ను పటిష్టం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్‌‌‌‌ మండలంలోని ఇసోజిపేట గ్రామ శివారులో సింగూర్‌‌‌‌ కెనాల్‌‌‌‌కు పడిన గండిని, సింగూర్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌ను కలెక్టర్‌‌‌‌ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్‌‌‌‌ పంకజ్‌‌‌‌తో కలిసి పరిశీలించారు. 

అనంతరం సింగూర్‌‌‌‌ గెస్ట్‌‌‌‌ హౌస్‌‌‌‌లో ఇరిగేషన్‌‌‌‌ ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ ఎగువ నుంచి 31,968 క్యూసెక్కుల వరద వస్తుందని, ఐదు గేట్ల ద్వారా 43,634 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ఇరిగేషన్‌‌‌‌ ఆఫీసర్లు తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ నేషనల్‌‌‌‌ డ్యామ్‌‌‌‌ సేఫ్టీ అథారిటీ సూచించిన రివిట్‌‌‌‌మెంట్‌‌‌‌ పనులను ప్రభుత్వం చేపడుతుందన్నారు.

 తాత్కలికంగా పనుల కోసం రూ.16 కోట్లతో టెండర్‌‌‌‌ ప్రక్రియను పూర్తి చేశామన్నారు. ప్రాజెక్ట్ భద్రతకు ఏలాంటి ఇబ్బంది లేకుండా పర్మినెంట్‌‌‌‌ పనులు చేపడుతామన్నారు. కెనాల్ సీసీ లైనింగ్ కోసం 168.30 కోట్లు మంజూరు అయ్యాయని, వర్షాకాలం సీజన్‌‌‌‌ పోయిన తర్వాత పనులను పూర్తి చేస్తామని చెప్పారు. 

సింగూర్‌‌‌‌ కెనాల్‌‌‌‌కు గండి పడిన ప్రాంతానికి రోడ్డు సరిగా లేకపోవడంతో మంత్రి, ఆఫీసర్లు ట్రాక్టర్‌‌‌‌పై వెళ్లి గండిని పరిశీలించారు. గండికి వెంటనే రిపేర్లు చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులు చేపట్టాలని ఆదేశించారు. మంత్రి వెంట ఇరిగేషన్‌‌‌‌ ఎస్‌‌‌‌ఈ పోచమల్లు, డీఈ నాగరాజు, జేఈ మహిపాల్‌‌‌‌రెడ్డి, ఆర్డీవో పాండు, తహసీల్దార్‌‌‌‌ కృష్ణ, కాంగ్రెస్‌‌‌‌ మండల అధ్యక్షుడు దుర్గారెడ్డి, ఉపాధ్యక్షుడు అంజయ్య పాల్గొన్నారు.