తెలంగాణలో 100కు పైగా సీట్లు సాధిస్తం: తరుణ్​ చుగ్​

తెలంగాణలో 100కు పైగా సీట్లు సాధిస్తం:  తరుణ్​ చుగ్​
  • ‘టుడే గుజరాత్​.. టుమారో తెలంగాణ’ ప్లకార్డుల ప్రదర్శన

న్యూఢిల్లీ, వెలుగు: వచ్చే ఏడాది తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ100కు పైగా సీట్లు గెలుస్తుందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్ తరుణ్​ చుగ్​ధీమా వ్యక్తం చేశారు. గుజరాత్ ఫలితాల ప్రభంజనం తెలంగాణలోనూ కొనసాగుతుందని అన్నారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదం బీజేపీ, మోడీకి ఉందని ఆయన పేర్కొన్నారు. గురువారం గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ హెడ్ ఆఫీసులో నిర్వహించిన విజయోత్సవ సంబరాల్లో తరుణ్​ చుగ్​ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ‘టు డే గుజరాత్–  టుమారో తెలంగాణ’(ఈ రోజు గుజరాత్– రేపు తెలంగాణ) అనే ప్లకార్డును ప్రదర్శించారు. దీనిపై గుజరాత్, తెలంగాణ రాష్ట్రాల భూభాగాలపై కమలం గుర్తు, మోడి, అమిత్ షా, నడ్డా ఫొటోలను ముద్రించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... కేసీఆర్ కుటుంబ, నియంతృత్వ పాలన నుంచి తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ఎదురుచూస్తున్నారని అన్నారు. దేశంలోని ప్రతి రాష్ట్రంలో బీజేపీ ఓటు బ్యాంక్ పెరుగుతున్నదని తెలిపారు. హిమాచల్​ ప్రదేశ్ లో తక్కువ సీట్లు వచ్చినా, గతంలో కంటే ఎక్కువ ఓట్లు తమ పార్టీ సాధించిందని అన్నారు. ఆమ్​ ఆద్మీ పార్టీకి గుజరాత్​, హిమాచల్​ ప్రజలు గట్టి బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. 

బీఆర్ఎస్ కాదు.. ఇక వీఆర్ఎస్ తీస్కోవాలె: జీవీఎల్​

గుజరాత్ లో బీజేపీ గ్రాండ్ విక్టరీని చూసి సీఎం కేసీఆర్ కు నిద్ర పట్టదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్సింహారావు అన్నారు. ‘‘బీజేపీని అణచివేస్తానని కేసీఆర్ ప్రగల్భాలు పలికారు. గుజరాత్ లో ప్రస్తుత ఎన్నికల ఫలితాలను చూశాక ఆయన తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళతారా? లేక ఎందుకులే అధికారాన్ని పోగొట్టుకోవడం అని ఆలోచన చేస్తారా? వేచి చూడాలి” అంటూ ఎద్దేవా చేశారు. గుజరాత్, హిమాచల్ ఎన్నికల రిజల్ట్స్ సందర్భంగా గురువారం ఢిల్లీలోని బీజేపీ హెడ్ ఆఫీసు వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయమన్నారు. ఇక ఆ పార్టీ బీఆర్ఎస్ కాదు వీఆర్ఎస్ తీసుకోవాలని సలహా ఇచ్చారు.