
- ఇసుక మాఫియాను కంట్రోల్ చేసి ఆదాయం పెంచుతం
- కామన్ మ్యాన్‌కు తక్కువ ధరకు ఇసుక దొరకాలి.. ప్రభుత్వానికి ఎక్కువ ఆమ్దానీ రావాలి
- కంపెనీల అవసరాలకు తగ్గట్టు ఏటీసీలుగా ఐటీఐలు
- మా పాలనకు సన్నబియ్యం టర్నింగ్ పాయింట్
- జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌దే గెలుపు
- గ్రూపులను పట్టించుకోను.. అభివృద్ధిపైనే ఫోకస్ పెడతానని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ఇసుక మాఫియాను కంట్రోల్‌చేయడం ద్వారా సామాన్యులకు తక్కువ ధరకు ఇసుకను అందిస్తూ, ప్రభుత్వానికి ఆదాయం పెంచుతామని గనులు, కార్మిక శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి తెలిపారు. ఇప్పటికే చెన్నూరులో చేసి చూపిస్తున్నామని, త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అమలుచేసి ఇసుక ఆదాయాన్ని రూ.700 కోట్ల నుంచి రూ.1200 కోట్లకు పెంచుతామని చెప్పారు. గిగ్‌వర్కర్ల కోసం కొత్త చట్టం తేవడంతో పాటు ప్రైవేట్‌రంగంలో పెన్షన్స్పెరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
మంత్రిగా బాధ్యతలు చేపట్టి 2 నెలలు పూర్తయిన సందర్భంగా శనివారం ‘వీ6- వెలుగు’కు వివేక్‌వెంకటస్వామి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. తమసర్కార్ పాలనకు సన్నబియ్యం టర్నింగ్పాయింట్అన్న ఆయన.. త్వరలో జరిగే జూబ్లీహిల్స్ఉప ఎన్నికలో కాంగ్రెస్‌దే గెలుపు అని ధీమా వ్యక్తం చేశారు. అన్నిచోట్లా గ్రూపు రాజకీయాలు ఉంటాయని, కానీ తాను వాటిని పట్టించుకోకుండా అభివృద్ధిపైనే ఫోకస్ పెడ్తానని స్పష్టం చేశారు.
ఇంటర్వ్యూలో వివిధ అంశాలపై వివేక్ వెల్లడించిన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే..
తెలంగాణ వచ్చినా సమస్యలు తీరలేదు..
తెలంగాణ వస్తే ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయనే ఆశ ఉండే. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను కేసీఆర్నెరవేరుస్తారని భావించాం. కానీ పదేళ్లలో కేసీఆర్ కుటుంబం తెలంగాణ ప్రజల కోసం చేసింది తక్కువ. వాళ్ల ధ్యాసంతా ఎలా సంపాదించుకోవాలనే దానిపైనే ఉండేది. ఒక దఫా అధికారం చేపట్టాక కేసీఆర్ కుటుంబంలో అహంకారం వచ్చేసింది.
తెలంగాణ ప్రజలు దేన్నయినా సహిస్తారు.. కానీ అహంకారాన్ని సహించరు. అందుకే ప్రజల కోసం నేను తీసుకున్న స్టాండ్ వల్ల ఆర్థికంగా చాలా నష్టపోయాను. నా ఫ్యాక్టరీ బంద్ చేయించారు. నా మీడియా సంస్థలకు యాడ్స్ బంద్ పెట్టారు. అందుకే తెలంగాణ రావాలని ఎట్లాగైతే కొట్లాడామో.. తెలంగాణలో మంచి పరిపాలన ఉండాలని కూడా కొట్లాడాలని నిర్ణయించుకున్నాం. 2023 ఫలితాలు నాకు చాలా తృప్తినిచ్చాయి.
ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా స్కీమ్‌లు అమలు..
కాంగ్రెస్ గెలిచిన తర్వాత ప్రజల అంచనాలు కూడా బాగా పెరిగిపోయాయి. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వైట్ పేపర్ ప్రకటించాల్సి వచ్చింది. వైట్‌పేపర్‌లో రూ.8 లక్షల కోట్ల అప్పు ఉన్నట్లు తేలింది. ఇంత ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ పేదల కోసం సన్నబియ్యం, మహిళలకు ఫ్రీ బస్సు, రూ.500కే గ్యాస్, 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ అమలు చేస్తున్నాం. రైతు భరోసా ఇచ్చాక రైతుల్లో పాజిటివిటీ పెరిగింది. ఇందిరమ్మ ఇళ్లు నిజమైన నిరుపేదలకు ఇస్తున్నాం. సన్నబియ్యం, కొత్త రేషన్‌కార్డులు మాసర్కార్కు టర్నింగ్‌పాయింట్‌గా చెప్పుకోవచ్చు.
గిగ్ వర్కర్లకు కొత్త చట్టం..
మా నాన్న కాకా వెంకటస్వామి కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సింగరేణి కార్మికులందరికీ ప్రావిడెంట్ ఫండ్ ఇప్పించారు. నష్టాల్లో ఉన్న సింగరేణి సంస్థను కాపాడి లక్ష మందికి ఉద్యోగాలు ఇప్పించారు. దేశంలోనే ప్రైవేట్ సెక్టార్ లో తొలిసారిగా పెన్షన్ స్కీమ్ ను తీసుకొచ్చిన ఘనత కాకా వెంకటస్వామిది. అసంఘటిత కార్మికులకు పీఎఫ్ ఇచ్చేలా ఆయన కొత్త చట్టం తీసుకొచ్చారు. నేను కూడా మా నాన్న లెగసీతో గిగ్ వర్కర్లకు కొత్త చట్టం తీసుకొచ్చే బాధ్యత తీసుకున్నాను.
జొమాటో, స్విగ్గీ, ఉబర్, ర్యాపిడో, ఓలా లాంటి సంస్థల్లో పనిచేసే గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పించాలని, వారికి యాక్సిడెంట్స్ అయితే ఆదుకునేందుకు బోర్డు ఉండాలనేది కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆలోచన. భారత్ జోడో యాత్రలో గిగ్ వర్కర్స్ సమస్యలను ఆయన తెలుసుకున్నారు. అందుకే వీరి భద్రత కోసం త్వరలోనే ఒక యాక్ట్ తీసుకొచ్చి వారి కోసం ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేస్తాం. అలాగే కనీస వేతనాల చట్టాన్ని 12 ఏళ్లుగా సవరించలేదు. ఈ చట్టాన్ని సవరించే అవకాశం నాకే వచ్చింది. దీనిపై సబ్ కమిటీ వేయాలని సీఎంను కోరాను.
ఏటీసీలుగా ఐటీఐలు..
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఐటీఐలను ఏటీసీలుగా అభివృద్ధి చేస్తున్నాం. కంపెనీల అవసరాలకు అనుగుణంగా ట్రైన్ చేయడానికి కొత్త కరిక్యులం తీసుకొస్తున్నాం. దీంతో స్కిల్డ్ మ్యాన్ పవర్ అందుబాటులోకి వస్తుంది. తద్వారా ఎంప్లాయ్‌మెంట్ పెరుగుతుంది. ఇప్పటికే టామ్ కామ్ ద్వారా విదేశాలకు స్కిల్డ్ మ్యాన్ పవర్‌ను పంపిస్తున్నాం.
రెడ్కేటగిరీ ఇండ్రస్టీలలో సేఫ్టీ బాధ్యత వాళ్లదే..
సిగాచీ ఘటనతర్వాత రెడ్కేటగిరీలోని ఫార్మా ఇండస్ర్టీస్మేనేజ్మెంట్స్తో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్నిర్వహించాం. ఈజ్ఆఫ్డూయింగ్బిజినెస్ విధానంలో సేఫ్టీ మెజర్స్ పాటించాల్సిన బాధ్యత ప్రభుత్వంకంటే మేనేజ్మెంట్స్పైనే ఎక్కువ ఉంటుంది. అందుకే సరైన రక్షణ చర్యలు చేపట్టాలని, లేదంటే ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సి వస్తుందని, సీరియస్యాక్షన్ తీసుకుంటామని యజమానులను హెచ్చరించాం.
ఇసుక మాఫియాను కంట్రోల్ చేస్తం..
నేను 2023లో చెన్నూర్ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇసుక మాఫియాను కంట్రోల్చేస్తానని ప్రజలకు మాట ఇచ్చాను. దాని ప్రకారం నాపై ఎన్ని ఒత్తిళ్లు వచ్చినప్పటికీ వెనుకడుగు వేయకుండా చెప్పింది చేసి చూపించాను. గత బీఆర్ఎస్హయాంలో ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా ఇసుక దోపిడీకి పాల్పడ్డారు. నేను మైనింగ్ మినిస్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇసుక ద్వారా వచ్చే ఆదాయాన్ని రూ.700 కోట్ల నుంచి రూ.1200 కోట్లకు పెంచాలని టార్గెట్ పెట్టుకున్న. ఇందులో భాగంగా పొలిటికల్సాండ్మాఫియాను కంట్రోల్చేయడంపై ఫోకస్‌పెట్టిన. సాండ్ బజార్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం.
గతంలో ఒక వే బిల్‌మీద పది లారీలు పోయేవి. శాటిలైట్ నిఘా ద్వారా దాన్ని సైతం కంట్రోల్చేశాం. రోజుకు ఎన్ని లారీలు వస్తున్నాయి? ఎన్ని లారీలు పోతున్నాయి? అనే డేటా తీసుకుని పరిశీలిస్తున్నాం. మరో రెండు నెలల్లో ఈ సిస్టమ్సెట్అవుతుంది. రాష్ర్టంలో ఇసుక కొరత రాకుండా క్లోజ్ అయిన రీచ్‌లను తెరిపిస్తాం. రాష్ర్టవ్యాప్తంగా అవసరమైన చోట సాండ్బజార్లు ఓపెన్ చేస్తున్నాం. కామన్‌మ్యాన్‌కు ఇసుక తక్కువ ధరకు దొరకాలి. ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం రావాలన్నదే నా టార్గెట్. అలాగే గ్రానైట్, ఇతర ఖనిజ తవ్వకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచడానికి చర్యలు తీసుకుంటున్నాం.
రాయల్టీ ఎగ్గొట్టిన వారికి నోటీసులు జారీ చేశాం. సీనరేజీ చార్జీలు పెంచినం. త్వరలోనే ఈ సిస్టమ్‌ను కూడా సెట్చేస్తాం. మైనింగ్మినిస్టర్గా ప్రజలకు, ప్రభుత్వానికి ఉపయోగపడే నిర్ణయాలే తీసుకుంటాను. సీఎం రేవంత్‌రెడ్డి నాపై నమ్మకంతో మైనింగ్ శాఖ ఇచ్చారు. ఆ నమ్మకాన్ని నిలుపుకుంటాను.
ప్రైవేట్‌రంగంలోని వర్కర్లకు పెన్షన్ పెరగాలి..
కాకా వెంకటస్వామి దేశవ్యాప్తంగా ప్రైవేట్‌రంగ కార్మికులకు పెన్షన్‌స్కీమ్ ప్రకటించినప్పుడు నేను సీఐఐ చైర్మన్‌గా ఉన్నాను. ఈ స్కీమ్ వల్ల ఇండస్ర్టీకి నష్టం వస్తుందని నాపై సీఐఐ నుంచి చాలా ప్రెజర్వచ్చింది. ఈ విషయాన్ని నాన్నగారితో చెప్పినప్పుడు ఆయన ఒప్పుకోలేదు. పెన్షన్ స్కీమ్ వల్ల బీదలకు మేలు జరుగుతుందని చెప్పారు.
ఈ రోజు అందరూ కాకా వెంకటస్వామి పెన్షన్ అంటుంటే సంతోషంగా ఉంది. దానివల్ల ఇండస్ర్టీతో పాటు వర్కర్స్హ్యాపీగా ఉన్నారు. ఫలితంగా ప్రైవేట్‌రంగంలో ఉత్పాదకత పెరిగింది.. కానీ వర్కర్లకు పెన్షన్ మాత్రం పెరగలేదు. ఈ మొత్తాన్నిపెంచాల్సిన అవసరం ఉన్నది. దీనికి కేంద్ర ప్రభుత్వం ఎక్కువ కంట్రిబ్యూషన్ చేయాలని పలుమార్లు కోరాను. ఇటీవల యూనియన్ లేబర్ మినిస్టర్‌ను కలిసినప్పుడు కూడా ఈ విషయం గురించి చెప్పాను.
గ్రూపులను నేను పట్టించుకోను
పెద్దపల్లి పార్లమెంట్నియోజకవర్గంలో కాకా వెంకటస్వామి లెగసీ చాలా స్ర్టాంగ్‌గా ఉన్నది. ఎవరు ఏమనుకున్నా ఆ లెగసీని ఏమీ చేయలేరు. మొన్నటి పార్లమెంట్ఎన్నికల్లో మా కుటుంబానికి టికెట్ఇవ్వొద్దని కొంతమంది చెప్పనప్పటికీ ప్రజలు కోరుకోవడంతో చాన్స్వచ్చింది. చుట్టుపక్కల సెగ్మెంట్లలో బీజేపీ గెలిచినా పెద్దపల్లిలో ఓడిపోయింది. కారణంకాకా వారసత్వమే.
నేను కూడా తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన. ఆ రోజుల్లో నాకు యూనియన్మినిస్టర్వచ్చే చాన్స్ఉన్నా తెలంగాణ కోసం తీసుకోలేదు. పదవులు ముఖ్యం కాదు. మన ఇమేజ్, బ్రాండ్ముఖ్యం. ఇటీవల లక్సెట్టిపేట, మంచిర్యాల ప్రోగ్రాంలకు నాకు ఇన్విటేషన్రాలేదు.. అందుకే పోలేదు. ఎవరు పిలిచినా పిలవకున్నా నా గ్రాఫ్పెరుగుతోంది. అన్నిచోట్లా గ్రూపులు ఉంటయ్.. కానీ నేను పట్టించుకోను. అభివృద్ధిపైనే దృష్టి పెడతాను.
తెలంగాణపై హైకమాండ్‌ను కన్విన్స్చేసినం..
తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంపీలకు ఉన్న ప్రాధాన్యం వల్ల అప్పుడొక జోష్ ఉండేది. తెలంగాణ గురించి వివిధ అంశాల్లో పార్టీ హైకమాండ్‌ను కన్విన్స్ చేయడంలో అప్పుడున్న కాంగ్రెస్ ఎంపీలుగా మేమంతా కీలక పాత్ర పోషించాం. రాష్ట్రం ఇస్తే తెలంగాణకే అన్యాయం జరుగుతుందని ఢిల్లీలో అనుకునేవాళ్లు. కానీ తెలంగాణలో వనరులు ఉన్నాయని, ఇన్‌కం ఉందని హైకమాండ్‌కు నచ్చజెప్పింది నేనే. ఎంపీలందరినీ ఒక్కతాటిపైకి తీసుకురావడంతోపాటు ప్రతిపక్షం వాళ్లను కూడా కన్విన్స్ చేశాం.
సిద్దిపేట, గజ్వేల్‌లో పార్టీని బలోపేతం చేస్త..
సిద్దిపేటలో కాకా మూడుసార్లు ఎంపీగా గెలిచారు. అక్కడ కూడా మా అభిమానులు చాలామంది ఉన్నారు. నేను మెదక్‌జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా సిద్దిపేటకు వెళ్లినప్పుడు అందరూ కలిశారు. మెదక్జిల్లాలో గత ఎన్నికల్లో కాంగ్రెస్‌రెండు సీట్లు మాత్రమే గెలిచింది. వాటిని నిలబెట్టుకుంటాం. ఎమ్మెల్యేలు లేని సెగ్మెంట్లపై నేను ప్రధానంగా ఫోకస్ చేస్తున్న. దాంతో నాయకులు, కార్యకర్తలు జోష్‌లో ఉన్నారు. గత పదేండ్ల బీఆర్‌ఎస్‌పాలనలో జరిగిన విషయాలకు స్పెషల్ట్రీట్మెంట్ఇస్తం. సిద్దిపేట, గజ్వేల్‌లో పార్టీని బలోపేతం చేస్తం.
జూబ్లీహిల్స్బైపోల్లో కాంగ్రెస్‌దే గెలుపు..
జూబ్లీహిల్స్ బైపోల్ ఇన్‌చార్జిగా నా పేరు అనౌన్స్చేయకముందే.. అక్కడ ఒక సర్వే చేయించిన. గత నెల రోజుల నుంచి నేను, మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు సెగ్మెంట్‌లో తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒక మంచి అభిప్రాయం క్రియేట్చేయగలిగాం. మా పార్టీకి అక్కడ కార్పొరేటర్లు లేకున్నా నాయకులను, కార్యకర్తలను తీసుకొని నేరుగా ప్రజల దగ్గరికి పోతున్నాం. బూత్‌కమిటీల నుంచే పార్టీని బలోపేతం చేస్తున్నాం.
జీహెచ్ఎంసీ ద్వారా పరిష్కరించగలిన సమస్యలపై దృష్టి సారించాం. ప్రజలకు బీఆర్ఎస్‌పై నమ్మకం తొలగిపోయింది. వారి సమస్యలు కాంగ్రెస్ద్వారానే తీరుతాయనే విశ్వాసం ఏర్పడ్డది. సీఎం రేవంత్‌రెడ్డి లోకల్క్యాండిడేట్కే టికెట్ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నరు. జూబ్లీహిల్స్సెగ్మెంట్పరిధిలో కాకా వెంకటస్వామి అనుచరులు, అభిమానులు చాలామంది ఉన్నరు. వారంతా పార్టీ గెలుపు కోసం శ్రమిస్తున్నరు. గ్రౌండ్లెవల్లో పనిచేసిన వాళ్లకు మంచి పేరు వస్తది. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వాళ్లకే టికెట్లు దక్కుతాయి.
కాళేశ్వరంతో రాష్ట్ర ఖజానాకు నష్టం..
నేను ఎంపీగా ఉన్న సమయంలోనే మహారాష్ట్ర సీఎం, అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం తుమ్మిడిహెట్టిలో 148 మీటర్ల నుంచి నీళ్లు తీసుకొచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఇదొక మంచి ప్రాజెక్టు. ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టు రావాలని మా నాన్న కాకా వెంకటస్వామి అంటుండే. దీంతో తెలంగాణలో సాగు, తాగునీటి అవసరాలు తీరుతాయని అనేవారు. ఈ ప్రాజెక్టుకు 11 వేల కోట్లు ఖర్చు పెట్టాక.. దీన్ని కాదని కేసీఆర్ కాళేశ్వరంలో లక్ష కోట్లు ఖర్చుపెట్టారు.
కేవలం కాంట్రాక్టర్లు, కమీషన్ల కోసమే ఈ ప్రాజెక్టు కట్టారు. రూ.11 వేల కోట్లు ఖర్చు పెట్టిన తుమ్మిడిహెట్టిలో ఇంకో రూ.24 వేల కోట్లు ఖర్చుపెట్టి ఉంటే మొత్తం ప్రాజెక్టు పూర్తయ్యేది. 74 వేల కోట్లు మిగిలేది. రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించే అవకాశం ఉండేది. కానీ కేసీఆర్ తీసుకున్న కాళేశ్వరం, మిషన్ భగీరథ లాంటి నిర్ణయాల వల్ల రాష్ట్ర ఖజానాకు తీవ్ర నష్టం జరిగింది. ఇవన్నీ ప్రజల పైసలే. వీటిని రికవరీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నారు.
ఆత్మీయతకు ప్రతీక.. రక్షాబంధన్
కోల్‌బెల్ట్/ చెన్నూరు, వెలుగు: అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల ఆత్మీయతకు ప్రతీక రక్షాబంధన్ అని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. శనివారం మంచిర్యాల జిల్లా చెన్నూరులోని క్యాంపు ఆఫీస్‌లో రాఖీ పౌర్ణమి సందర్భంగా మంత్రికి పలువరు కాంగ్రెస్ మహిళా లీడర్లు, కార్యకర్తలు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా మంత్రి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధిలో మహిళలందరిని కాంగ్రెస్ సర్కార్ భాగస్వాములను చేస్తున్నదన్నారు. ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో సంక్షేమ పథకాల్లో వారికి ప్రయారిటీ ఇస్తున్నట్టు చెప్పారు.