హాలిడే కోసం మరో ఇల్లు కొంటున్నరు

హాలిడే కోసం మరో ఇల్లు కొంటున్నరు

న్యూఢిల్లీ: సంపన్న భారతీయులు  ఖాళీగా ఉన్నప్పుడు హాయిగా గడిపేందుకు టూరిస్ట్​ ప్లేసుల్లో లగ్జరీ ఇండ్లను కొంటున్నారు. గోవాలోని కాండోలిమ్ మొదలు  అస్సాగావో వరకు, మాల్దీవులలోని మెదుఫారు  కున్‌‌ఫునాధూ దీవుల నుండి దుబాయ్‌‌లోని మెరీనా బీచ్ వరకు లగ్జరీ విల్లాలను, ఇండ్లను, ఫ్లాట్లను తెగ కొనుగోలు చేస్తున్నారు.ఈ విషయంలో మెరుగైన పన్ను రేట్లు  వ్యాపార అవకాశాలు, భద్రత, తమ పిల్లల చదువులను కూడా దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు.  కోవిడ్-19 వ్యాప్తి తర్వాత నుంచి ఈ పోకడ బాగా పెరిగిందని లగ్జరీ రియల్ ఎస్టేట్ బ్రోకరేజీ సంస్థలు  తెలిపాయి. ఇలాంటి ఇన్వెస్ట్​మెంట్ల వల్ల భారీ రాబడులకూ అవకాశం ఉంటుంది కాబట్టి లగ్జరీ ప్రాపర్టీలకు డిమాండ్​ పెరుగుతోంది.

గోవాలోని కాండోలిమ్‌‌లో లగ్జరీ బీచ్ హౌస్‌‌ని కొనుగోలు చేసి, మాల్దీవుల్లో విలాసవంతమైన విల్లాను కూడా కొనుగోలు చేసిన బెంగళూరుకు చెందిన వ్యవస్థాపకుడు  ఇన్వెస్టర్​ రవి మచానీ మాట్లాడుతూ వివిధ ప్రాంతాలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా రిస్క్‌‌ను బాగా తగ్గించుకోవచ్చని చెప్పారు. సాత్​బే ఇంటర్నేషనల్​ రియల్టీ  ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం, భారతదేశంలోని చాలా మంది హై నెట్​వర్త్​ ఇండివిడువల్స్​ (హెచ్​ఎన్​ఐలు) రాబోయే రెండేళ్లలో లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాపర్టీలను కొనాలని అనుకుంటున్నారు.  అంతర్జాతీయ ప్రాపర్టీ కన్సల్టెన్సీ జేఎల్​ఎల్​ డైరెక్టర్ రోహన్ శర్మ మాట్లాడుతూ, మహమ్మారి తర్వాత ట్యాక్స్​ హెవెన్​ దేశాలకు భారతీయులు వెళ్లడం పెరిగిందని అన్నారు. దుబాయ్​, అమెరికా, యూరప్​లో ప్రాపర్టీలు బాగా అమ్ముడవుతున్నాయని వివరించారు. వీసా ఫ్రీ ఎంట్రీ, మెరుగైన ఆరోగ్య సంరక్షణ,  మౌలిక సదుపాయాలు కూడా హెచ్​ఎన్​ఐలను ఆకర్షిస్తున్నాయి. దుబాయ్‌‌లో మిలియన్ దిర్హామ్‌‌లు (లేదా సుమారు రూ. 2.1 కోట్లు) ఇన్వెస్ట్​ చేస్తే ఎన్నో లాభాలు ఉంటాయి. 
ఛలో గోవా 
జీవీకే గ్రూపునకు చెందిన సంజయ్ రెడ్డి భార్య పింకీ రెడ్డి  ఉత్తర గోవాలోని  ప్రైమ్ సీ ఫేసింగ్ ప్రాపర్టీ అయిన పలాసియో అగుడాను రూ. 80 కోట్లకు కొనుగోలు చేయగా, హైదరాబాద్‌కు చెందిన ఫౌండర్​ జిఎస్ రాజు రూ.20 కోట్లతో గోవాలో విలాసవంతమైన విల్లాను కొనుగోలు చేశారు.   "ఈ లగ్జరీ విల్లాలు పూర్తిగా సదుపాయాలతో ఉంటాయి కాబట్టి అక్కడి వెళ్లి ఉండటం చాలా ఈజీ’’ అని రాజు చెప్పారు. ప్రొడక్షన్ హౌస్ నడుపుతున్న ముంబైకి చెందిన జంట సూరజ్ సదానా  ఫ్యాషన్ డిజైనర్ అయిన మన్మీత్ అరోరా కూడా గత సంవత్సరం ఉత్తర గోవాలోని సంగోల్డాకు మకాం మార్చారు.  గోవాకు చెందిన లగ్జరీ గృహాల డిజైనర్ రీతు నందా మాట్లాడుతూ ఈ సిటీలో రియల్టీ దూసుకుపోతోందని కామెంట్​ చేశారు. ఉదాహరణకు, ఇక్కడి అస్సాగోలో, రెండు సంవత్సరాల క్రితం ఆస్తి రేటు చదరపు మీటరుకు రూ. 30,000 కాగా, ఇప్పుడు రూ. 50,000కి పెరిగిందని ఆమె చెప్పారు. ఊటీ, కూర్గ్, కసౌలి, అలీబాగ్,  మనాలీలోని హై-ఎండ్ లగ్జరీ విల్లాలకూ గిరాకీ పెరిగింది.