ముంబై నేవీ సెంటర్ లో వెపన్, బుల్లెట్లు చోరీ..ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట్ లోని ఎల్కపల్లిలో కలకలం

ముంబై నేవీ సెంటర్ లో వెపన్, బుల్లెట్లు చోరీ..ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట్ లోని ఎల్కపల్లిలో కలకలం
  • అన్నదమ్ములను అరెస్ట్ చేసిన ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు

కాగజ్ నగర్, వెలుగు: నేవీ సెంటర్ లో వెపన్, బుల్లెట్లను చోరీ చేసిన జవాన్ తో పాటు అతని అన్నను ముంబై  క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట్ మండలం ఎల్కపల్లికి చెందిన డుబ్బుల రాకేశ్ 2023లో అగ్నివీర్ రిక్రూట్ మెంట్  లో నేవీ జవాన్ గా సెలక్ట్ అయ్యాడు.

 ముంబైలోని నేవీ సెంటర్ లో డ్యూటీ చేస్తూ గత ఫిబ్రవరిలో  కేరళలోని ఎర్నాకులంకు ట్రాన్స్ ఫర్ అయ్యాడు. కాగా.. ఈనెల 6న జవాన్ రాకేశ్ తన అన్న ఉమేశ్ తో కలిసి ముంబైలోని నేవీ సెంటర్ కు వెళ్లాడు. అక్కడ సెంట్రీ ఏరియా నుంచి వెపన్, 3 మ్యాగ్జిన్లు, 40 రౌండ్ల బుల్లెట్లు చోరీ చేసి సొంతూరుకు వచ్చారు. నేవీ ఆఫీసర్ల కంప్లయింట్ తో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మంగళవారం రాత్రి జవాన్ రాకేశ్ ఇంటికి వెళ్లి అన్నదమ్ములను అదుపులోకి తీసుకున్నారు. దీంతో స్థానికంగా కలకలం రేపింది.

 చోరీ చేసిన వెపన్ తో అన్నదమ్ములు మండల కేంద్రంలో చక్కర్లు కొట్టినట్లు పుకార్లు వస్తున్నాయి. ముంబై క్రైమ్ పోలీసులకు సహకరించిన కాగజ్‌నగర్ రూరల్ సీఐ కుమారస్వామి, పెంచికల్ పేట్ ఎస్ఐ అనిల్ కుమార్, పోలీస్ సిబ్బందిని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అభినందించారు.