
జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా, రమ్య నంబీషన్ , కమల్ కామరాజ్ లీడ్ రోల్స్‌లో పవన్ సాధినేని తెరకెక్కించిన వెబ్ సిరీస్ ‘దయా’. శ్రీకాంత్ మెహతా, మహేంద్ర సోని నిర్మించారు. ఆగస్టు 4 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా రమ్య నంబీషన్ మాట్లాడుతూ ‘గతంలో తెలుగులో ‘సారాయి వీర్రాజు’ లాంటి కొన్ని సినిమాల్లో నటించాను. కానీ నాకు నచ్చే పాత్రలు అంతగా రాకపోవడంతో తమిళ, మలయాళ భాషల్లో కొనసాగాను. ‘దయా’తో మళ్లీ తెలుగులోకి వస్తున్నా. ఇందులో నేను కవిత అనే జర్నలిస్ట్ పాత్రను పోషించాను. కెరీర్‌లో ఇంతవరకూ ఇలాంటి ఇంటెన్స్, సీరియస్ పాత్ర పోషించలేదు.
ఓ లేడీ జర్నలిస్ట్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనేది చక్కగా చూపించారు. ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉంది. బెంగాలీలో వచ్చిన ‘థక్దీర్’కు రీమేక్ అయినప్పటికీ పవన్ ఈ స్క్రిప్టును కొత్తగా మలిచారు. చివరి వరకు ఆసక్తి రేపుతూ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది. ఇక ‘పుష్ప’ మలయాళ వెర్షన్ కోసం ‘ఊ అంటావా’ పాట పాడాను. అలాగే ‘డియర్ కామ్రేడ్’ మలయాళ వర్షెన్‌కు కూడా ఓ పాట పాడాను’ అని చెప్పారు.