వెబ్ సిరీస్ రివ్యూ: ఓ అమ్మాయి కథ!

వెబ్ సిరీస్ రివ్యూ:  ఓ అమ్మాయి కథ!

టైటిల్‌‌: ధారావి బ్యాంక్, కాస్ట్‌‌: సునీల్​ శెట్టి, వివేక్​ ఒబెరాయ్​, సోనాలి కులకర్ణి, శాంతి ప్రియారాయ్​, ల్యూక్​ కెన్నీ, ఫ్రెడ్డీ,  భావనా రావ్​,

లాంగ్వేజ్: హిందీ,

ఫ్లాట్‌‌ఫాం: ఎంఎక్స్​ ప్లేయర్​

ఎపిసోడ్స్​ : 10, డైరెక్షన్‌‌: సమిత్​ కక్కాడ్​

ధారావి, అక్కడ ఉండే క్రైం ఆధారంగా ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ముంబైలో ఉన్న ధారావి ఆసియాలోనే అతి పెద్ద మురికివాడగా గుర్తింపు పొందింది. అదే ధారావిలో ఉంటున్న గ్యాంగ్‌‌స్టర్ తలైవన్ (సునీల్ శెట్టి) నేర చరిత్రే ‘‘ధారావి బ్యాంక్​” వెబ్​ సిరీస్​. ఒక సీజన్ రిలీజ్​ అయింది. తలైవన్​కి ధారావిలో తిరుగులేదు. తన దగ్గరున్న డబ్బు, అధికారం వల్ల గట్టి పట్టు సాధించాడు. అక్కడి వాడల్లో ఉంటున్న ప్రజల సపోర్ట్​ కూడా ఎక్కువే. అతనికి ఉన్న ప్రజాదరణ గవర్నమెంట్​కి కూడా ముప్పుగా మారుతుంది. అందుకే ముఖ్యమంత్రి జాన్వీ సర్వే (సోనాలి కులకర్ణి), జాయింట్ పోలీస్ కమిషనర్ జయంత్ గవాస్కర్ (వివేక్ ఒబెరాయ్)తో కలిసి అతని పట్టు పోగొట్టడానికి ఒక ప్లాన్​ వేస్తారు. దాంతో రెండు వర్గాల మధ్య చిన్నపాటి వార్​ మొదలవుతుంది. ఆ గొడవలో ఎవరిపై ఎవరు గెలుస్తారనేది తెలుసుకోవాలంటే సిరీస్​ చూడాల్సిందే. సీఎం తన రాజకీయ జీవితం కోసం మొదలుపెట్టిన యుద్ధం.. తలైవన్, జేసీపీ జయంత్ మధ్య ప్రతీకార యుద్ధంగా మారినప్పటి సీన్లు బాగుంటాయి. ఈ రెండు పాత్రల్లో సునీల్ శెట్టి, వివేక్ ఒబెరాయ్ మెప్పించారు. ఎపిసోడ్లు చాలా లెంగ్తీగా ఉండడం వల్ల ఒక్కోసారి కథ చాలా నెమ్మదిగా నడుస్తున్నట్టు అనిపిస్తుంది. అందుకే కొన్ని సీన్లు బోర్​ కొడతాయి. యాక్షన్ సీన్లు చాలా బాగా తీశారు. ఫస్ట్ హాఫ్​లో ఎక్కువగా డ్రామా ఉంది. సెకండ్ హాఫ్​లో మాత్రం హంటింగ్​​లా అనిపిస్తుంది.

ఓ అమ్మాయి కథ!

టైటిల్‌‌: అనల్ మేలే పానీ తూలీ, కాస్ట్‌‌: ఆండ్రియా జెరెమియా, ఆధవ్ కన్నదాసన్
 అళగం పెరుమాళ్, ఇళవరసు 

లాంగ్వేజ్: తమిళం

ఫ్లాట్​ఫాం : సోనీ లివ్​

రన్​ టైం: 135 నిమిషాలు

డైరెక్షన్‌‌: కైజర్ ఆనంద్

​మది (ఆండ్రియా) చెన్నైలోని డెకత్లాన్​ స్టోర్​లో మేనేజర్​గా పనిచేస్తుంటుంది. ఆమెతోపాటు పనిచేస్తున్న మరో అమ్మాయికి పెండ్లి కుదురుతుంది. కొడైకెనాల్​లో జరుగుతున్న ఆ పెండ్లికి వెళ్లిన మదికి చేదు అనుభవం ఎదురవుతుంది. కొడైకెనాల్​లో ఒక సన్​రైజ్​ స్పాట్​ చూసేందుకు​ వెళ్తుంది మది. అక్కడ ఆమె కిడ్నాప్​కు గురవుతుంది. కళ్లు తెరిచేసరికి అడవిలో ఉంటుంది. చుట్టూ చీకటిగా ఉంటుంది. కాస్త తెలివిలోకి వచ్చాక అత్యాచారానికి గురైనట్టు అర్థమవుతుంది ఆమెకు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆమె దగ్గరలోని పోలీస్ స్టేషన్‌‌కు వెళ్లి, కంప్లైంట్​ ఇస్తుంది. పోలీసులు ఇన్వెస్టిగేషన్​ మొదలుపెడతారు. కానీ.. కొద్దిసేపటికి పోలీస్​ స్టేషన్​లో న్యాయం జరగదని అర్థమవుతుంది. దాంతో కోర్టుకు వెళ్లాలి అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. స్క్రీన్​ ప్లే బాగుంది. మహిళ తలుచుకుంటే ఏదైనా సాధించొచ్చు. న్యాయబద్ధంగా పోరాటం చేస్తే న్యాయం కచ్చితంగా దొరుకుతుందనే విషయాలను చెప్పకనే చెప్పాడు డైరెక్టర్​. ఆండ్రియా నటన ఆకట్టుకుంటుంది. కొన్ని సీన్లలో తన కళ్లతో పలికించిన ఎక్స్​ప్రెషన్స్​కు హ్యాట్సాఫ్​ చెప్పాల్సిందే.

కాబోయే అమ్మల కథ​

టైటిల్‌‌: వండర్​ విమెన్​, కాస్ట్‌‌: నదియా, నిత్యా మీనన్, పార్వతి తిరువొతు, పద్మప్రియ, అర్చనా పద్మిని

అమృతా సుభాష్, సయనోరా ఫిలిప్, పద్మ గోమతి  

లాంగ్వేజ్: మలయాళం 

ఫ్లాట్​ఫాం : సోనీ లివ్​,  రన్​ టైం: 80 నిమిషాలు, డైరెక్షన్‌‌: అంజలి మీనన్ 

నందిత (నదియా) ప్రి–నేటల్ ప్రిపరేటరీ సెంటర్‌‌ నడుపుతుంది. అందులో ప్రెగ్నెంట్స్‌‌ కోసం క్లాసులు తీసుకుంటుంది. ఆ క్లాసుల్లో ఎలాంటి ఎక్సర్​సైజ్​ చేయాలో చెప్తుంటుంది. ఆ సెంటర్​కి కొత్త బ్యాచ్‌‌లో నోరా (నిత్యా మీనన్), మినీ (పార్వతి తిరువొతు), వేణి (పద్మప్రియ), సయా (సయనోరా ఫిలిప్), జయ (అమృతా సుభాష్), గ్రేసీ (అర్చనా పద్మిని) జాయిన్​ అవుతారు. వాళ్లలో ఒక్కొక్కరిదీ ఒక్కో కథ. దాంతో వాళ్ల మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి. నోరా ఆర్కిటెక్ట్​​. ప్రెగ్నెన్సీ వల్ల భ‌‌ర్త ప్రేమ‌‌తో పాటు త‌‌న ల‌‌క్ష్యానికి దూర‌‌ం అవుతానేమోనని భయపడుతూ ఉంటుంది. వేణి అత్తింటి క‌‌ట్టుబాట్ల వల్ల ఇబ్బంది పడుతుంటుంది. సారా ఒక సింగ‌‌ర్‌‌. లివింగ్ రిలేష‌‌న్‌‌షిప్‌‌లో ఉంటుంది. మినీ ఒంట‌‌రి మ‌‌హిళ‌‌. భ‌‌ర్త నుంచి విడాకులు తీసుకునేందుకు కోర్టుకు వెళ్తుంది. జ‌‌యకు మూడు సార్లు ప్రెగ్నెన్సీ పోతుంది. నాలుగోసారి బిడ్డను కనేందుకు ఎదురు చూస్తుంటుంది.  వీళ్లకున్న ప్రాబ్లమ్స్​ అన్నీ మామూలుగా అందరికీ ఉండేవే. వాటినే హైలైట్​ చేస్తూ ఈ సినిమా తీసింది డైరెక్టర్​. పిల్లల పెంప‌‌కంలో త‌‌ల్లితో పాటు తండ్రి బాధ్యత కూడా ముఖ్యమైనదే అనే పాయింట్​ని బాగా చెప్పారు. ఆడవాళ్ల మీద ఉన్న వివక్షను బాగా చూపించారు. అందరూ బాగా నటించారు. నిత్యామీనన్​ డైలాగ్స్​ కంటే ఎక్స్​ప్రెషన్స్​ ఈ సినిమాకు హైలైట్​.