ఈ ఏడాది పెళ్ళిళ్ళు చేసుకునేవారు తొందర పడాల్సిందే అంటున్నారు పురోహితులు. జూన్ లోపు చేసుకోకపోతే ఇక డిసెంబర్ వరకు ఆగాల్సిందేనని చెబుతున్నారు. ఆగస్టులో తక్కువ ముహూర్తాలు ఉండగా... నవంబర్ దాకా శుక్ర మూఢమి కావడంతో పెళ్ళి ముహుర్తాలు లేవు. పెళ్లిలో ముహూర్తాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. వధూవరుల జాతకాలను బట్టి శుభ ముహుర్తం నిర్ణయిస్తారు పండితులు. అయితే ఈ ఏడాది పెళ్లి ముహూర్తాలు చాలా తక్కువగా ఉన్నాయి. జూన్ 23 వరకే మంచి ముహుర్తాలు ఉన్నాయంటున్నారు పురోహితులు. జూన్ 29 నుంచి జూలై 30 వరకు ఆషాఢమాసం కావడంతో అప్పుడు ముహుర్తాలు లేవు. ఆగస్టులో చాలా తక్కువగా ఉన్నాయి. ఆగస్టు నుంచి నవంబర్ వరకు శుక్ర మూఢం ఉండటంతో పెళ్ళి ముహుర్తాలు లేవంటున్నారు పురోహితులు. ఐదు నెలల పాటు మంచి ముహుర్తాలు ఉండవనీ... మళ్లీ డిసెంబర్ లోనే పెళ్ళి చేసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ ముహుర్తాలన్నీ దాటితే ఇక వచ్చే ఏడాది వరకూ ఎదురు చూడాల్సిందే. అందుకే వధూవరుల తల్లి దండ్రులు ఈ ముహుర్తాలకే పెళ్లిళ్లు చేసేందుకు తొందరపడుతున్నట్టు పురోహితులు చెబుతున్నారు.
రెండేళ్ల నుంచి కరోనా కారణంగా ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండానే పెళ్ళిళ్లు జరుగుతున్నాయి. ఈ ఏడాది కరోనా ఉధృతి తగ్గడం, ముహుర్తాలు కూడా జూన్ 23 తర్వాత లేకపోవడంతో ఉన్నంతలో వైభవంగా చేసేందుకు సిద్ధమవుతున్నారు తల్లిదండ్రులు. జూన్ నెలలో భారీగానే పెళ్లిళ్లు జరగనున్నాయి. రెండేళ్ల తర్వాత వ్యాపారులకు చేతి నిండా పని దొరుకుతోంది. ఇప్పటికే జూన్, ఆగస్టు, డిసెంబర్ వరకు కల్యాణ మండపాలను రిజర్వ్ అయ్యాయి. డెకరేషన్ల దగ్గరి నుంచి బట్టల షాపులు, కూరగాయలు, పూలు, టెంట్లు ఇలా అన్ని రకాల వ్యాపారాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే వెయ్యి కోట్లకు పైగా వ్యాపారం జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు పెళ్లిళ్ళ సీజన్ కావడంతో బంగారం రేటు భారీగా పెరుగుతోంది. 55 నుంచి 60 వేలు పెడితే గానీ తులం బంగారం రావట్లేదు. పెళ్లిళ్లలో గోల్డ్ ఇంపార్టెంట్ కావడంతో ధరలు పెరిగినా కొంటున్నారు తల్లి దండ్రులు. దాంతో షాపింగ్ మాల్స్, బంగారం షాపులు కస్టమర్లతో సందడి కనిపిస్తున్నాయి. ఐదేళ్లలో ఎప్పుడూ జరగనన్ని పెళ్ళిళ్ళు ఇప్పుడు చేస్తున్నారు. గతంలో ముహుర్తాలున్నారెండేళ్ల పాటు కరోనా కారణంగా పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. ఇప్పుడు జూన్ దాటితే మళ్లీ ఐదు నెలల వరకు ముహూర్తాలు లేకపోవడంతో త్వరగా పెళ్లిళ్లు చేసేందుకు సిద్ధపడుతున్నారు తల్లిదండ్రులు.
మరిన్ని వార్తల కోసం...
