బరువు తగ్గనున్న స్కూల్​ బుక్స్..పేపర్ మందం తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం

బరువు తగ్గనున్న స్కూల్​ బుక్స్..పేపర్ మందం తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
  • ప్రతిక్లాస్​కు 800 గ్రాముల నుంచి కేజీ వరకు బరువు తగ్గే అవకాశం 
  • ప్రభుత్వంపైనా తగ్గనున్న రూ.50 కోట్ల ఆర్థికభారం  

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి పాఠ్యపుస్తకాల బరువు తగ్గనున్నది. దీంతో ఇటు స్టూడెంట్లకు  పుస్తకాలు మోసే భారం తగ్గనుండగా.. సర్కారుకు ఆర్థిక భారం కూడా తగ్గనుంది. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తికాగా, త్వరలోనే ప్రింటింగ్ ప్రాసెస్​ షురూ కానుంది. 

2022–23 పద్ధతి అమలు

రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు సుమారు 58 లక్షల మంది చదువుతున్నారు. వీటిలో సర్కారు విద్యాసంస్థల్లో చదివే స్టూడెంట్లందరికీ ఉచితంగానే ప్రభుత్వం పుస్తకాలు అందించనున్నది. ప్రైవేటు స్కూళ్లలోని వారు మాత్రం మార్కెట్​లో కొనుక్కోవాల్సి ఉంటుంది. ఆరో తరగతి నుంచి టెన్త్ వరకు తప్పనిసరిగా ప్రభుత్వం రూపొందించిన సిలబస్​నే చదువాల్సి ఉంది. ఈ క్రమంలో సర్కారు తయారు చేసిన పుస్తకాలనే ఎక్కువ మంది వినియోగిస్తుంటారు. అయితే, ఈ విద్యాసంవత్సరం (2023–24) పుస్తకాల బరువు పెరిగింది.

దీనికి పుస్తకాల్లో పేజీలకు మందం కాగితం వాడటమే కారణం. 2022–23 సంవత్సరంలో పుస్తకాల్లోని లోపలి పేజీలకు 70 జీఎస్​ఎం (గ్రామ్స్​ పర్​ స్క్వేర్​ మీటర్​) కాగితాన్ని, కవర్ పేజీలకు 200 జీఎస్​ఎం కాగితాన్ని వాడేవారు. అయితే.. అప్పటి విద్యాశాఖ పుస్తకాల్లోని కాగితం మందం పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో 2023–24 ఈ విద్యాసంవత్సరం లోపలి పేజీల్లో 90 జీఎస్​ఎం, కవర్ పేజీలకు 220 జీఎస్​ఎం కాగితం వాడారు. ఫలితంగా ఒక్కో క్లాసుకు అదనంగా కేజీ వరకు పుస్తకాల బరువు పెరగడంతోపాటు సర్కారుపైనా సుమారు రూ. 50 కోట్ల వరకు అదనపు భారం పడింది.

మొత్తంగా అప్పుడు రూ. 198 కోట్ల ఖర్చు వచ్చింది. పుస్తకాల బరువు పెరగడంపై టీచర్ల సంఘాలు, స్టూడెంట్ యూనియన్లు ఆందోళనలు వ్యక్తం చేశాయి. అయితే.. రాష్ట్రంలో కాంగ్రెస్  అధికారంలోకి వచ్చాక పిల్లలపై పుస్తకాల భారం పడకుండా, పాత పద్ధతిలోనే (లోపలి పేజీలకు 70 జీఎస్​ఎం కాగితం,  కవర్ పేజీలకు 200 జీఎస్​ఎం కాగితం) పుస్తకాలను ప్రింట్ చేయాలని ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ ఆదేశాలకు తగ్గట్టుగా స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు చర్యలు మొదలుపెట్టారు. 

ఏప్రిల్ నెలాఖరులోగా ప్రింటింగ్ పూర్తి.. 

వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించిన పుస్తకాల ప్రింటింగ్, పేపర్ టెండర్లు పూర్తయ్యాయి. త్వరలోనే ప్రింటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి. 2024–25 విద్యాసంవత్సరానికి సంబంధించి 1.90 కోట్ల పుస్తకాలను ప్రింట్ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అన్ని క్లాసులకు సంబంధించిన పార్ట్1 పుస్తకాలను ఏప్రిల్30 వరకూ జిల్లా కేంద్రాలకు పంపించేలా చర్యలు తీసుకుంటున్నారు.

స్కూళ్లు ప్రారంభం రోజు స్టూడెంట్లకు పుస్తకాలు అందించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, సర్కారు తీసుకున్న నిర్ణయంతో ప్రతి క్లాస్​లో పుస్తకాల బరువు 800 గ్రాముల నుంచి 1కేజీ వరకూ  తగ్గనున్నది. ఉదాహరణకు ప్రస్తుతం టెన్త్ ఇంగ్లిష్ మీడియం పుస్తకాలు 4 కేజీలుండగా, ప్రస్తుతం పేజీల మందం తగ్గించిన తర్వాత ఆ బరువు మూడు కేజీలకు తగ్గనుంది. ప్రభుత్వంపై రూ. 50 కోట్ల ఆర్థిక భారం తగ్గనుంది.