
- ధాన్యం కొనుగోళ్లు స్పీడప్ చేయాలి
ఖానాపూర్, వెలుగు: ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందేలా చర్యలు చేపట్టాలని నిర్మలా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై గురువారం ఖానాపూర్ పట్టణంలోని ఎంపీపీ కార్యాలయంలో ఎమ్మె ల్యే వెడ్మ బొజ్జు పటేల్తో కలిసి సంబంధిత శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించారు. మండలాల వారీగా పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ, అమలు పురోగతిపై చర్చించారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను స్పీడప్ చేయాలని, బేస్మెంట్, స్లాబ్ తదితర పనుల పురోగతిపై నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. రైతులకు ఎరువులు, విత్తనాలు సమయానికి అందించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. మారుమూల అటవీ, గిరిజన ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యం, తాగునీరు, విద్యుత్ తదితర అభివృద్ధి పనులకు అటవీ శాఖ అనుమతులు వెంటనే మంజూరు చేయాలని సూచించారు.
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య పనులను నిరంతరం కొనసాగించాలని, రోడ్ల రిపేర్లు వర్షాకాలానికి ముందే పూర్తిచేయాలని ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. కడెం ప్రాజెక్టు నిర్వహణ, భారీ వర్షాలు, వరదల వలన లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేయాలన్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు నష్టపోకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని, కొనుగో ళ్లను స్పీడప్ చేయాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ కిశోర్ కుమార్, జిల్లా అటవీశాఖ అధికారి నాగిని భాను, ఆర్డీవో రత్న కల్యాణి, పీపీవో జీవరత్నం, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.