లిఫ్ట్ ఇస్తామని చెప్పి కిడ్నాప్

లిఫ్ట్ ఇస్తామని చెప్పి కిడ్నాప్

అబిడ్స్, వెలుగు: ఓ మైనర్ కి మాయామాటలు చెప్పి కిడ్నాప్ చేసి కత్తితో బెదిరించి 36 గంటల పాటు కారులో తిప్పిన ఇద్దరు యువకులను అబిడ్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై సైదులు కథనం ప్రకారం.. సైదాబాద్ ప్రాంతానికి చెందిన ఓ మైనర్(17) దుబాయ్ లో ఇంటర్ వరకు చదువుకుంది. ఈ ఏడాది ఆగస్టులో దుబాయ్ నుంచి హైదరాబాద్ కి వచ్చి సైదాబాద్ లోని తన పేరెంట్స్ దగ్గరే ఉంటోంది. అబిడ్స్ చాపెల్ రోడ్ లోని సుజాత డిగ్రీ కాలేజీలో బీకామ్ జాయినైంది. ఈ నెల 10న కాలేజీకు వచ్చిన ఆ మైనర్ మధ్యాహ్నం 2 గంటలకు కాలేజీ నుంచి ఇంటికి వెళ్లేందుకు ఆటో కోసం తెలుగు యూనివర్సిటీ ముందు నిలబడింది. నిజామాబాద్ లోని కారును రెంట్ కి తీసుకుని సిటీకి వచ్చిన బహుదూర్ పురా కు చెందిన మహమ్మద్ ఆర్బాజుద్దీన్ (24) ఆ మైనర్ దగ్గరికి వెళ్లి లిఫ్ట్ ఇస్తానని చెప్పి ఎక్కించుకున్నాడు. కారులో కొంతదూరం వెళ్లాక అర్బాజుద్దీన్ తన వెంట తెచ్చుకున్న కత్తితో కారు దిగొద్దని మైనర్ బెదిరించాడు. ఆర్బాజుద్దీన్ రాత్రి వరకు కారును సిటీలోనే తిప్పి నిజామాబాద్ కి తీసుకెళ్లాడు. మరోవైపు ఆ మైనర్ ఇంటికి రాకపోవడంతో అతడి అన్న అబిడ్స్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు.

కారులో నిజామాబాద్ వెళ్లిన ఆర్బాజుద్దీన్ 11వ తేదీ ఉదయం సిటీకి వచ్చి తన ఫ్రెండ్ సయ్యద్ జుబెయిర్ (21)ను మెహిదీపట్నంలో ఎక్కించుకున్నాడు. అదే రోజు రాత్రి మెదక్ సమీపంలో ఉన్న ఓ పెట్రోల్ పంప్ దగ్గర కారు ఆపాడు. ఆర్బాజ్ కి కారు రెంట్ కి ఇచ్చిన ఓనర్  జీపీఎస్ ట్రాక్ ద్వారా గుర్తించి నిజామాబాద్ పోలీసులతో అక్కడికి చేరుకున్నాడు.  కారులో ఆర్బాజుద్దీన్ , జుబెయిర్, మైనర్ ని చూసిన  నిజామాబాద్ పోలీసులు.. అబిడ్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అబిడ్స్ పోలీసులు అక్కడికి చేరుకుని ఆర్బాజ్, సయ్యద్ ను అరెస్ట్ చేశారు. మైనర్ ని కాపాడి ఇంటికి పంపించారు.