రియాలిటీ షో షూటింగ్స్‌కు గ్రీన్ సిగ్న‌ల్

రియాలిటీ షో షూటింగ్స్‌కు గ్రీన్ సిగ్న‌ల్

రియాలిటీ షో షూటింగ్స్ చేసుకునేందుకు ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. క‌రోనా నిబంధ‌న‌ల‌ను పాటిస్తూ షూటింగ్స్ చేసుకోవ‌చ్చ‌ని ఆ రాష్ట్ర‌ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ తెలిపారు. ఆడియ‌న్స్ షోల‌లో నేరుగా పాల్గొన‌కుండా చూసుకోవాల‌న్నారు. మొత్తం 40 మందికి దాట‌కుండా సిబ్బందితో ఈ షూటింగ్స్ నిర్వ‌హించాల‌ని చెప్పారు. అయితే షూటింగ్‌కు హాజ‌ర‌య్యే ప్ర‌తి ఒక్క‌రికీ స్క్రీనింగ్ త‌ప్ప‌నిస‌రి అని, శానిటైజేష‌న్, మాస్కు ధ‌రించ‌డం వంటి జాగ్ర‌త్త‌ల‌ను పాటించాల‌ని స్ప‌ష్టం చేశారు.

ఇప్ప‌టికే సినిమా, టీవీ షూటింగ్స్‌కు అనుమ‌తి

కేంద్ర ప్ర‌భుత్వం క‌రోనా లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌ను స‌డ‌లిస్తూ గ‌తంలో అన్‌లాక్ – 1 ప్ర‌క‌టించిన స‌మ‌యంలోనే ప‌శ్చిమ బెంగాల్ స‌ర్కారు.. టీవీ, సినిమా ప్రొడ‌క్ష‌న్‌కు అనుమ‌తిచ్చింది. మే 30న కేంద్రం విడుద‌ల చేసిన ఆంక్ష‌ల స‌డ‌లింపు జాబితా ఆధారంగా జూన్ 1 నుంచి ఇండోర్‌లో జ‌రిగే టీవీ, సినిమా షూటింగ్‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది మ‌మ‌త ప్ర‌భుత్వం. అయితే ఆ స‌మ‌యంలో రియాలిటీ షోల‌కు ప‌ర్మిష‌న్ ఇవ్వ‌లేదు. తాజాగా ఆ కార్య‌క్ర‌మాల షూటింగ్స్‌కు కూడా అనుమ‌తి ఇచ్చింది ప‌శ్చిమ బెంగాల్ ప్ర‌భుత్వం.