జూన్ 10 వ‌ర‌కు స్కూళ్లు, కాలేజీలు మూత‌

జూన్ 10 వ‌ర‌కు స్కూళ్లు, కాలేజీలు మూత‌

ప‌శ్చిమ బెంగాల్ లో అన్ని స్కూళ్లు, కాలేజీల‌ను జూన్ 10 వ‌ర‌కు మూసేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు శ‌నివారం ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌క‌టించారు. రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ కేసులు ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల్లో (హాట్ స్పాట్స్) లాక్ డౌన్ మ‌రి కొన్ని రోజుల పాటు కొన‌సాగిస్తున్న‌ట్లు తెలిపారు. లాక్ డౌన్ కొన‌సాగించిన‌ప్ప‌టికీ కొన్ని ఆంక్ష‌ల‌ను స‌డ‌లించి, బేక‌రీల‌ను ఓపెన్ చేయాల‌ని భావిస్తున్న‌ట్లు చెప్పారు. రాష్ట్రంలో సాధార‌ణంగా ప్ర‌తి ఏటా జూన్ 10 త‌ర్వాత స్కూల్స్ కు స‌మ్మ‌ర్ హాలిడేస్ ఇస్తుంటాయని, అయితే ఎండ‌లు ఎక్కువ‌గా ఉన్న స‌మ‌యాల్లో అంత‌కంటే ముందుగానే సెల‌వులు ఇచ్చిన సంద‌ర్భాలు ఉన్నాయ‌ని చెప్పారు మ‌మ‌తా బెన‌ర్జీ. ప్ర‌స్తుతం క‌రోనా ఎఫెక్ట్ నేప‌థ్యంలో జూన్ 10 వ‌ర‌కు స్కూల్స్ క్లోజ్ చేసి.. ఆ త‌ర్వాత పరిస్థితుల‌ను బ‌ట్టి వేస‌వి సెల‌వుల‌పై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని అన్నారు. అయితే టీచ‌ర్లు ఆన్ లైన్ క్లాసులు కొన‌సాగించాల‌ని సూచించారు. అన్ని కాలేజీలు, యూనివ‌ర్సిటీలు వ‌ర్క్ ఫ్రం హోం కంటిన్యూ చేయాల‌న్నారు.

మ‌ధ్యాహ్న‌భోజ‌నం..

స్కూళ్లు మూసేసి ఉన్న‌ప్ప‌టికీ మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కాన్ని కొన‌సాగించాల‌ని సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ సూచించారు. జూన్ ప‌ది వ‌ర‌కు అన్ని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ విద్యార్థుల‌కు మ‌ధ్యాహ్న భోజ‌నం అందేలా అవ‌స‌ర‌మైన చర్య‌లు తీసుకున్నామ‌ని చెప్పారు. ఏప్రిల్ మొద‌ట్లోనే ఇందుకు అవ‌స‌ర‌మైన కూర‌గాయ‌లు, బియ్యం స‌ర‌ఫ‌రా చేసిన‌ట్లు తెలిపారు. కాగా, దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొన‌సాగించాల‌ని ఈ రోజు ఉద‌యం ప్ర‌ధాని మోడీతో జ‌రిగిన వీడియో కాన్ఫ‌రెన్స్ లో ప‌లు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు కోరారు. క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ఇప్ప‌టికే ఒడిశా, పంజాబ్ రాష్ట్రాలు ఏప్రిల్ 30 వ‌ర‌కు పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకున్నాయి.