IND vs WI 2nd Test: కాంప్‌బెల్, హోప్ అసాధారణ పోరాటం.. ఆసక్తికరంగా ఇండియా, వెస్టిండీస్ రెండో టెస్టు

IND vs WI 2nd Test: కాంప్‌బెల్, హోప్ అసాధారణ పోరాటం.. ఆసక్తికరంగా ఇండియా, వెస్టిండీస్ రెండో టెస్టు

టీమిండియాతో జరుగుతున్న ఢిల్లీ టెస్టులో వెస్టిండీస్ పోరాడుతోంది. రెండో టెస్టులో ఓటమిని తప్పించుకునే ప్రయత్నాలు చేస్తోంది. తొలి ఇన్నింగ్స్ లో తక్కువ స్కోర్ కే ఔటైనా.. కాంప్‌బెల్, హోప్ భారీ భాగస్వామ్యంతో రెండో ఇన్నింగ్స్ లో అద్భుతమైన పట్టుదల చూపిస్తోంది. ఫాలో ఆన్ ఆడుతున్న వెస్టిండీస్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇనింగ్స్ లో 2 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్ లో జాన్ కాంప్‌బెల్ (87) షాయ్ హోప్ (65) ఉన్నారు. ఇంకా విండీస్ 97 పరుగులు వెనకబడి ఉంది. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో వెస్టిండీస్ జట్టు ఏ మాత్రం పోరాడుతుందో చూడాలి. 

తొలి ఇన్నింగ్స్ లో 248 పరుగులకే వెస్టిండీస్ ఆలౌట్ కావడంతో టీమిండియాకు 270 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. దీంతో ఇండియా వెస్టిండీస్ ను ఫాలో ఆన్ ఆడించింది. రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు దిగిన విండీస్ జట్టు ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. టాగెనరైన్ చంద్రపాల్, అలిక్ అథనాజ్ ఔట్ కావడంతో విండీస్ జట్టు 35 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగింది. ఈ దశలో కాంప్‌బెల్ (87), హోప్ (65) జట్టును ఆదుకున్నారు. భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదర్కొంటూ పరుగులు రాబట్టారు. 

టీమిండియా బౌలర్లు ఎంతలా ప్రయత్నించినా ఈ జోడీని విడగొట్టలేకపోయారు. ఈ క్రమంలో వీరిద్దరూ తమ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. మూడో రోజు చివరి సెషన్ లో వీరిద్దరూ వికెట్ ఇవ్వకపోవడంతో విండీస్ జట్టు సంతృప్తికరంగా రోజును ముగించింది. మూడో వికెట్ కు వీరిద్దరూ అజేయంగా 138 పరుగులు జోడించడం విశేషం. భారత బౌలర్లలో సిరాజ్, సుందర్ తలో వికెట్ పడగొట్టారు.  
నాలుగు వికెట్ల నష్టానికి 141 పరుగులతో ఓవర్ నైట్ స్కోర్ తో మూడో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ 248 పరుగులకు ఆలౌటైంది. 

దీంతో తొలి ఇన్నింగ్స్ లో ఇండియాకు 270 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. 41 పరుగులు చేసిన అలిక్ అథనాజ్ విండీస్ ఇన్నింగ్స్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్లతో సత్తా చాటాడు. జడేజా మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, బుమ్రా తలో వికెట్ తీసుకున్నారు.    

ఇండియా భారీ స్కోర్:
 
తొలి రోజు ఓవర్ నైట్ స్కోర్ 318/2తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఇండియా సెకండ్ డే కూడా పూర్తిగా అధిపత్యం చెలాయించింది. రెండో రోజు మరో 200 పరుగులు చేసి రెండో సెషన్‌లో 518/5 స్కోరు వద్ద ఫస్ట్ ఇన్నింగ్స్ డిక్లేర్‌ చేసింది ఇండియా. ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ (175), కెప్టెన్ గిల్ (129 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కగా.. సాయి సుదర్శన్ (87), కేఎల్ రాహుల్ (38), నితీశ్‌కుమార్‌ రెడ్డి (43) రాణించారు. వెస్టిండీస్ బౌలర్లలలో వారికన్‌ 3, రోస్టన్ ఛేజ్ ఒక వికెట్ తీశారు.