ఫస్ట్, సెకండ్​ క్లాసోళ్ల చదువులు ఆగమేనా?

ఫస్ట్, సెకండ్​ క్లాసోళ్ల చదువులు ఆగమేనా?
  • ఆన్​లైన్​ తరగతులకు ఇప్పటికీ ప్లాన్ చేయని విద్యాశాఖ 
  • గతేడాది పుస్తకం పట్టకుండానే పైతరగతికి ప్రమోషన్
  • ఈసారీ అదే పరిస్థితి.. ఆందోళనలో పేరెంట్స్
  • స్టూడెంట్ల భవిష్యత్తుపై ప్రభావం పడే చాన్స్

హైదరాబాద్, వెలుగు: కరోనా ప్రభావం ప్రైమరీ స్కూల్ స్టూడెంట్లపై తీవ్రంగా పడుతోంది. గతేడాది పుస్తకాలు ముట్టకుండానే ఒకటి, రెండో తరగతుల స్టూడెంట్లు పైక్లాసులకు ప్రమోట్ అయ్యారు. కనీసం వారికి ఆన్​లైన్ పాఠాలు కూడా చెప్పలేదు. ఈయేడు కూడా అదే పరిస్థితి  కనిపిస్తోంది. వచ్చే నెలలో ఆన్​లైన్ పాఠాలు స్టార్ట్ చేసేందుకు విద్యాశాఖ ఇంటర్నల్ గా కసరత్తు చేస్తున్నా.. ఫస్ట్, సెకండ్ క్లాసుల స్టూడెంట్లకు సంబంధించి ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం లేదు. దీంతో వారి పేరెంట్స్​లో ఆందోళన మొదలైంది. దీని ప్రభావం విద్యార్థుల భవిష్యత్​పై పడే అవకాశముందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రైవేటులో ఎల్​కేజీ నుంచే..
రాష్ట్రంలో మొత్తం 40,898 స్కూళ్లుండగా, వాటిలో 59.26 లక్షల మంది చదువుతున్నారు. కరోనా తీవ్రత నేపథ్యంలో 2020–21 అకడమిక్ ఇయర్​లో మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు ఆన్​లైన్ క్లాసులు జరిగాయి. కరోనా కేసులు తగ్గడంతో అప్పుడు ఆరో తరగతి నుంచి పదో తరగతి స్టూడెంట్లకు నెల పాటు ఫిజికల్ క్లాసులు నిర్వహించారు. ఆ ఏడాదంతా ఫస్ట్, సెకండ్ క్లాసులకు సంబంధించి ఆన్ లైన్ గానీ, ఆఫ్​ లైన్ లో గానీ బోధన జరగలేదు. కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లలో మాత్రం యూకేజీ, ఎల్​కేజీ వారికీ ఆన్​లైన్ పాఠాలు చెప్పారు. దానికి తగ్గట్టుగానే పేరెంట్స్​నుంచి భారీగానే ఫీజులు వసూలు చేశారు. కానీ సర్కారు స్కూల్ విద్యార్థుల చదువును మాత్రం ప్రభుత్వం పట్టించుకోలేదు. పైగా చిన్న పిల్లలు ఆన్​లైన్, టీవీలు వినరు.. ఒకవేళ క్లాసులు చెబితే వారికి కంటి సమస్యలు వస్తాయని అప్పట్లో సర్కారు పెద్దలు, ఉన్నతాధికారులు చెప్పుకొచ్చారు. అయితే అన్ని క్లాసులతో పాటు ఒకటి, రెండో తరగతిలో జాయిన్​అయిన 12.28 లక్షల మంది స్టూడెంట్లను ప్రభుత్వం ప్రమోట్ చేసింది. ప్రస్తుతం దాదాపు ఏడాదిన్నర పాటు బడులు, పాఠాలకు దూరమైన ఆ స్టూడెంట్లు చదువుపై ఆసక్తి చూపించడం లేదని పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఏ ప్లాన్ ​లేదు..
2020–21 అకడమిక్ ఇయర్​లో సర్కారు బడుల్లో ఫస్ట్​ క్లాసులో 6,05,586 మంది, సెకండ్ క్లాసులో 6,23,571 మంది చేరారు. ప్రస్తుతం వారంతా రెండు, మూడు తరగతికి ప్రమోట్ అయ్యారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వీరందరూ సంఖ్యలు, అంకెలు కూడా గుర్తించలేని స్థితిలో ఉన్నారని పేరెంట్స్, టీచర్లు చెబుతున్నారు. ఒక ఏడాది పూర్తిగా చదువుకు దూరమైన విద్యార్థులను, వచ్చే ఏడాదిలోనైనా చదువుకు దగ్గర చేస్తారని పేరెంట్స్ భావించారు. కానీ వచ్చే నెలలో ప్రారంభం కాబోయే 2021–22 అకడమిక్ ఇయర్ లో ఇప్పటికీ ఫస్ట్, సెకండ్ క్లాసులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కనీసం ఆల్టర్నెట్ ప్లాన్ కూడా విద్యాశాఖ అధికారులు చేయలేదు. గతేడాది కూడా 3, 4, 5 క్లాసులకూ మొత్తం ఆన్​లైన్ పాఠాలు చెప్పలేదు. దీంతో ఈ క్లాసుల స్టూడెంట్లకు భవిష్యత్​లో ఇక్కట్లు తప్పేలా లేవు. ‘పునాది గట్టిగుంటేనే ఇల్లు గట్టిగా ఉంటది’ అనే సామెత విద్యారంగంలోనూ వర్తిస్తది. ఒకటి, రెండో తరగతిలో సరిగా లేకపోతే, దాని ప్రభావం వారి భవిష్యత్​ క్లాసులపైనా పడుతుందని విద్యావేత్తలు చెబుతున్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు ప్రైమరీ ఎడ్యుకేషన్​పై దృష్టి సారించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని పేరెంట్స్, విద్యావేత్తలు కోరుతున్నారు.