నెలసరి సమస్యలెన్నో!

నెలసరి సమస్యలెన్నో!

నెలనెలా రుతుస్రావం సక్రమంగా జరగకపోవడానికి ఎన్నో కారణాలుంటాయి. ముఖ్యంగా మహిళలపై కుటుంబం, వృత్తిపరమైన ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆ ఒత్తిడి ఎక్కువ కాలం కొనసాగితే.. దాని ప్రభావం హార్మోన్లపై పడుతుంది. ఈ కారణంగానే రుతుక్రమంలో రకరకాల సమస్యలు వస్తుంటాయి. వాటిలో అమినోరియా, గర్భం అందకపోవడం, ఎర్లీ మెనోపాజ్‌‌, పీసీఓడీ, ఫైబ్రాయిడ్స్‌‌, మెనుస్ట్రువల్‌‌ డిజార్డర్స్‌‌ వంటి ఎన్నో సమస్యలు ఉంటాయి.

అమినోరియా

నెలసరి సరిగా జరగకపోవడాన్ని ‘అమినోరియా’ అంటారు. ఇందులో ప్రైమరీ అమినోరియా, సెకండరీ అమినోరియా అని రెండు రకాలు ఉంటాయి.

ప్రైమరీ అమినోరియా..

అంటే పదహారు సంవత్సరాల తర్వాత కూడా రుతుచక్రం ప్రారంభం కాకపోవడాన్ని ప్రైమరీ అమినోరియా అంటారు.

కారణాలు

క్రోమోజోమ్‌‌లకు సంబంధించిన లేదా జీన్స్​కి సంబంధించిన సమస్యలే దీనికి కారణం. ముఖ్యంగా టర్నర్స్‌‌ సిండ్రోమ్‌‌, గర్భాశయ నిర్మాణ లోపాలు, గర్భాశయ ఇన్​ఫెక్షన్లు, సిస్టిక్‌‌ ఫైబ్రోసిస్‌‌, కుషింగ్స్‌‌ సిండ్రోమ్‌‌ వంటి సమస్యల వల్ల అమినోరియా రావచ్చు. అలాగే హార్మోన్ల అసమతుల్యతలు…  ముఖ్యంగా ఎడ్రినల్‌‌ గ్రంథి సమస్యలు, క్యాన్సర్‌‌ నివారణ మాత్రలు, యాంటీ డిప్రెసివ్‌‌ మాత్రల వాడడం కూడా దీనికి కారణాలవుతాయి.

సెకండరీ అమినోరియా

మొదట్నించీ రుతుచక్రం సక్రమంగా ఉన్నా.. డెలివరీ తర్వాత మూడు నెలల వరకు పీరియడ్​ రాకపోవడాన్ని సెకండరీ అమినోరియా అంటారు.

కారణాలు

సాధారణంగా పిల్లలకు పాలు ఇచ్చే సమయంలో తల్లికి నెలసరి రాదు. దీని కోసం ఎటువంటి ట్రీట్​మెంట్​ అవసరం లేదు. అయితే పిట్యూటరీ గ్రంథి, థైరాయిడ్‌‌ సమస్యలు ఉన్నవాళ్లకి, గర్భనిరోధక మాత్రలు, కొన్నిరకాల యాంటీ డిప్రెసెంట్​ మందులు వాడేవాళ్లకి, పీసీఓడీ (పాలిసిస్టిక్‌‌ ఒవేరియన్‌‌ డిసీజ్‌‌) ఉన్నవాళ్లకి ఈ సమస్య ఎక్కువగా ఎదురవుతుంది. అలాగే శక్తికి మించి వ్యాయామం చేయడం, గర్భ సంబంధిత ఆపరేషన్లు చేయించుకోవడం కూడా దీనికి కొంతవరకు కారణమవుతాయి.

డిస్మెనోరియా

ఈ సమస్య వల్ల పీరియడ్స్‌‌ సమయంలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. యుక్త వయసులో ఉన్న అమ్మాయిల్లో సాధారణంగా ఈ సమస్య కనిపిస్తుంది. డిస్మెనోరియా మూడు రకాలుగా ఉంటుంది.

కంజెస్టివ్‌‌ డిస్మెనోరియా: కొంతమందిలో నెలసరికి మూడు నుంచి ఐదు రోజుల ముందే పొత్తి కడుపులో, నడుము భాగంలో నొప్పి ప్రారంభమవుతుంది. రుతుస్రావం మొదలైన తర్వాత మందులు వాడకపోయినా దానికదే తగ్గిపోతుంది. దీనికి ఎండోమెట్రియాసిస్‌‌, మయోమస్‌‌, ఎడినోమోసిస్‌‌ వంటివి కారణంగా చెప్పొచ్చు.

స్పాస్మోడిక్‌‌ డిస్మెనోరియా: నెలసరి మొదలైన మొదటిరోజు మాత్రమే ఒకటి, రెండు గంటలు నొప్పిగా ఉండి… రుతుస్రావం సాఫీగా జరగడంతో తగ్గిపోతుంది. ఈ సమయంలో వచ్చే నొప్పి ఎక్కువగా ఉంటుంది. పొట్ట బిగదీసినట్లుగా ఉండటం, విరేచనాలు కావడం వంటి లక్షణాలు ఉంటాయి. నొప్పి మరీ అధికంగా ఉన్నప్పుడు వాంతులు కూడా అవ్వొచ్చు. దీన్నే స్పాస్మోడిక్‌‌ డిస్మనోరియా అంటారు.

మెంబ్రేనస్‌‌ డిస్మెనోరియా: పీరియడ్స్​ సమయంలో నొప్పి విపరీతంగా ఉంటుంది. ఇది ఎక్కువ శాతం ఒత్తిడి, హార్మోన్లు బ్యాలెన్స్​డ్​గా లేకపోవడం వల్ల కలుగుతుంది.

పీసీఓడీ

ఈ మధ్య ఎక్కువ మందిలో కనిపిస్తున్న సమస్య ‘పాలీసిస్టిక్‌‌ ఒవేరియన్‌‌ సిండ్రోమ్‌‌ (పీసీఓడీ)’. ముఖ్యంగా15 నుంచి 25 ఏళ్ల వయసున్న వాళ్లలో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం హార్మోన్ల అసమతుల్యత. స్త్రీలలో పురుష హార్మోన్లు (టెస్టోస్టెరాన్‌‌) పెరగడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. చాలా కాలంగా ఒత్తిడికి లోనవ్వడం వల్ల కూడా పీసీఓడీ సమస్య వస్తుంది.

లక్షణాలు

ఈ సమస్య మొదలైన వెంటనే.. దాని ప్రభావం కనిపిస్తుంది. పీరియడ్స్‌‌ సరిగ్గా రాకపోవడం, వచ్చినా బ్లీడింగ్‌‌ ఎక్కువ కావడం, కడుపునొప్పి, అవాంఛిత రోమాలు, మెడ దగ్గర నల్లబడటం, జుట్టు రాలడం, ముఖంపై మొటిమలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీళ్లలో కనిపించే మరో ముఖ్యమైన లక్షణం అధికంగా బరువు పెరగడం. సంతానలేమి సమస్య కూడా వస్తుంది.

మెనోపాజ్‌‌

మహిళల్లో 45 –55 ఏళ్ల మధ్య మెనోపాజ్‌‌ దశ కనిపిస్తుంది. 50 ఏళ్ల వరకు పీరియడ్స్‌‌ కొనసాగడం వల్ల స్త్రీల ఆరోగ్యం బాగుంటుంది. 40 ఏళ్ల కన్నా ముందే మెనోపాజ్‌‌ వచ్చినట్లయితే ప్రిమెచ్యూర్‌‌ మెనోపాజ్‌‌ లేదా ఎర్లీ మెనోపాజ్‌‌ అంటారు.

లక్షణాలు

మెనోపాజ్‌‌ దశలో మానసికంగా ఆందోళనకు గురవుతారు. నిద్రలేమి ఎక్కువగా ఉంటుంది. ఈస్ట్రోజన్‌‌ హార్మోన్‌‌ లోపం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. ఆస్టియో ఆర్థరైటిస్‌‌, నడుమునొప్పి వంటివి మొదలవుతాయి. మూత్రంలో మంట, చర్మం పొడిబారడం, కొలెస్ట్రాల్‌‌ పెరగడం పెరిగి స్థూలకాయం రావడం వంటివి జరుగుతాయి.

ఆలిగోమెనోరియా

రెండు మూడు నెలలకోసారి నెలసరి రావటం.. అదీ చాలా తక్కువగా బ్లీడింగ్‌‌ కావడాన్ని ఆలిగోమెనోరియా అంటారు. దీనికి ప్రొలాక్టిన్‌‌ హార్మోన్‌‌ ఎక్కువ కావడమే కారణం. వీళ్లలో రొమ్ము నుంచి పాలు వస్తుంటాయి. మానసిక వ్యాధులకు వాడే మందులు, అసిడిటీకి వాడే మందుల వల్ల ప్రొలాక్టిన్‌‌ అధికంగా విడుదలయ్యే అవకాశముంది. దీనివల్ల కూడా ఈ సమస్య వస్తుంది.

ఫైబ్రాయిడ్స్‌‌(కణుతులు)

మహిళల్లో సాధారణంగా కనిపించే సమస్య ఫైబ్రాయిడ్స్‌‌ లేదా గర్భాశయంలో కణుతులు ఏర్పడటం. గర్భాశయం లోపలి కండరం అధికంగా పెరిగి గడ్డలుగా మారడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఈ కణుతులు క్యాన్సర్‌‌కు కారకాలు కావు. అయితే ఈ ఫైబ్రాయిడ్స్‌‌ ఏ వయసులోనైనా రావచ్చు. అంటే రుతుక్రమం మొదలైన దగ్గర నుంచి మెనోపాజ్‌‌ వరకు ఏ దశలోనైనా రావచ్చు. ఫైబ్రాయిడ్స్‌‌ ఏర్పడటానికి ప్రత్యేక కారణమంటూ లేదు. చాలా మందిలో ఫైబ్రాయిడ్స్‌‌ ఉన్నా.. ఎటువంటి లక్షణాలు బయటకు కనిపించవు. సాధారణంగా కణితి పరిమాణం, అది ఉన్న ప్రదేశాన్ని బట్టి లక్షణాలు ఉంటాయి. ఇవి గర్భసంచి బయట ఉంటే వాటిని సబ్‌‌ సెరొసల్‌‌ ఫైబ్రాయిడ్స్‌‌ అంటారు. వీటివల్ల పెద్దగా సమస్య ఉండదు. గర్భసంచి లోపల ఏర్పడే సబ్‌‌మ్యూకోసల్‌‌, ఇంట్రా మ్యూరల్‌‌ ఫైబ్రాయిడ్స్‌‌ వల్ల అనేక సమస్యలు వస్తాయి.

లక్షణాలు

ఫైబ్రాయిడ్‌‌ వల్ల గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువ. పీరియడ్స్‌‌ సరిగ్గా రావు. రక్తస్రావం, కడుపు నొప్పి ఎక్కువగా ఉంటాయి. సంతానలేమి సమస్య ఏర్పడుతుంది.

సమస్యల నిర్ధారణ :

అల్ట్రాసౌండ్‌‌ స్కానింగ్‌‌, హార్మోన్‌‌ పరీక్షలతో రుతుచక్ర సమస్యలను నిర్ధారించొచ్చు. రక్త పరీక్షలు సీబీపీ, ఈఎస్‌‌ఆర్‌‌, హార్మోన్‌‌ పరీక్షలు – ఎఫ్‌‌ఎస్‌‌హెచ్‌‌, ఎల్‌‌హెచ్‌‌, ఎస్‌‌ ప్రొలాక్టిన్‌‌, థైరాయిడ్‌‌ ప్రోఫిక్‌‌, అల్ట్రాసౌండ్‌‌, సిటి స్కాన్‌‌ అబ్డామిన్‌‌ ద్వారా రుతుచక్ర సమస్యలకు గల కారణాలను గుర్తించొచ్చు. అలాగే సమస్యలను బట్టి గైనకాలజిస్ట్‌‌ పర్యవేక్షణలో మందులు వాడితే తక్కువ కాలంలోనే వీటి నుంచి బయటపడొచ్చు.

జీవనశైలి మారాలి

ఒకప్పుడు ఇన్ని ఆరోగ్య సమస్యలు ఎందుకు లేవనే ప్రశ్న చాలామంది అడుగుతుంటారు. దానికి కారణం ఒక్కటే.. ఒకప్పుడు బ్యాలెన్స్​డ్​ తిండి తీసుకునేవాళ్లు. అలాగే ఒళ్లు వంచి పనిచేసేవాళ్లు. కానీ ఇప్పటి పరిస్థితి అలా లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో వేళకు తిండి, నిద్ర ఉండటం లేదు. దాంతో యుక్త వయసు పిల్లల్లో కూడా రుతుక్రమ సమస్యలు, పీసీఓడీ వంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి ఒక్కటే పరిష్కారం.. తీసుకునే వాటిలో ఆకుకూరలు, పప్పు దినుసులు, అన్ని రకాల కూరగాయలు, పండ్లు ఉండాలి. అలాగే రోజూ వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. అందరూ జిమ్​, యోగా సెంటర్లకే వెళ్లాల్సిన పని లేదు. ఉదయం లేవగానే గంట సేపు వాకింగ్​, జాగింగ్​ చేసినా చాలు.

see also: ఇల్లీగల్ ఓల్డేజ్ హోమ్స్