శ్రీలంక సంక్షోభానికి అంతర్జాతీయ పరిణామాలూ కారణమే

శ్రీలంక సంక్షోభానికి అంతర్జాతీయ పరిణామాలూ కారణమే

ఒక దేశం ఏ విషయంలోనైనా విజయం సాధించాలంటే నాయకత్వం కీలకం. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం, వాటిని  సరిగా అమలు చేయడం, అమలులో ఎదురయ్యే అడ్డంకులను ఎదుర్కొంటూ  సర్దుబాట్లు చేసుకుంటూ.. ముందుకు సాగటం సరైన నాయకత్వ లక్షణం. అప్పుడే ఏ దేశమైన నిర్దేశిత లక్ష్యాలను చేరుకోగలదు. 2005 నుంచి శ్రీలంకలో జరిగిన పరిణామాలను గమనిస్తే నాయకత్వ నిర్ణయాల ఫలితాలు ఎలా ఉన్నాయి? అవి ఆ దేశాన్ని ఎలా ప్రభావితం చేశాయనేది అర్థం అవుతుంది. 

దేశాధ్యక్ష ఎన్నికల్లో అతివాద పీపుల్ లిబరేషన్ ఫ్రంట్ పార్టీ, నేషనల్ సింహళీస్ హెరిటేజ్ పార్టీల మద్దతుతో బరిలోకి దిగిన శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ అభ్యర్థి మహిందా రాజపక్సేకు మితవాద యునైటెడ్ నేషనల్ పార్టీ అభ్యర్థి రణిల్ విక్రమసింఘేకు పోలైన ఓట్ల మధ్య తేడా 2 శాతం లోపే. ఆ ఎన్నికల్లో మహిందా రాజపక్సే ఎన్నికవడానికి ప్రధాన కారణం జాప్నా ప్రాంతంలోని 13  శాతం తమిళ ఓట్లలో కేవలం ఒక్క శాతమే మాత్రమే పోలవడం. 1983 నుంచి సుమారు 25 ఏండ్లు తీవ్రవాద దాడులతో అతలాకుతలమైన శ్రీలంక 2009లో ఎల్​టీటీఈ అంతం తర్వాత శాంతి నెలకొంటుందని ఆశించింది. ఆ విజయం తర్వాత వచ్చిన జనాదరణ 2010లో మరోసారి మహిందా అధ్యక్షుడిగా అధికారం చేపట్టడానికి కారణమైంది. ఆ తర్వాత దేశాధ్యక్ష పదవికి మరింత అధికారాలను కట్టబెడుతూ మూడోసారి అధికారం చేపట్టడానికి ఉద్దేశించిన17వ రాజ్యాంగ సవరణ ఇటు బుద్ధిస్ట్ పార్టీ అయిన జాతికే హేలా హురుమయ, అటు ముస్లిం శ్రీలంక కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకోవడానికి కారణమైంది. ఈ పార్టీల మద్దతు ఉపసంహరణతో 2015లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మహిందా రాజపక్సే 3 శాతం కన్నా తక్కువ మెజార్టీతో ఓడిపోయాడు. ఆ ఎన్నికల్లో మహిందాకు 47.58 శాతం ఓట్లు వస్తే ప్రత్యర్థి మైత్రిపాల సిరిసేనకు 51.28 శాతం ఓట్లు వచ్చాయి.  

2005 నుంచి 2015 వరకు..

2005 నుంచి 2015 వరకు మహిందా అధికారంలో ఉన్న సమయంలో శ్రీలంక 6.28 వృద్ధి రేటుతో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన నిలిచింది. అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం నెలకొన్న సమయంలో కూడా ఆ  దేశం సాధించిన సగటు వృద్ధి రేటు 5.83 శాతం. ఎల్​టీటీఈ అంతమయ్యాక 2010 నుంచి మహిందా అధికారంలో ఉన్న 2015 వరకు ఆ దేశం సాధించిన సగటు వృద్ధి రేటు 6.48 శాతం. ఈ సమయాల్లో మహిందా స్వయంగా ఆర్థిక శాఖమంత్రి. అయితే 2005 మహిందా రాజపక్సే అధికారంలోకి వచ్చేనాటికి శ్రీలంక విదేశీ అప్పులు11 బిలియన్ డాలర్లుగా ఉంటే, అది గొటబయ అధికారంలోకి వచ్చిన 2019 నాటికి సుమారు56  బిలియన్ డాలర్లకు చేరాయి. 15 ఏండ్లలో సుమారు ఐదు రెట్లు పెరిగాయి. ఈ అప్పులు మహిందా అధికార కాలమైన 2005 నుంచి 2014 వరకు, 11 బిలియన్ డాలర్ల నుంచి 42 బిలియన్ డాలర్లకు, అందునా ఎల్​టీటీఈ అంతమైన 2009 నుంచి 2011 మధ్యలో 19 బిలియన్ డాలర్ల నుంచి 36 బిలియన్ డాలర్లకు చేరడం ప్రభుత్వ అస్తవ్యస్త ఆర్థిక విధానాలకు సూచికగా నిలిచింది. 

మితిమీరిన ఆత్మవిశ్వాసం..

మహిందా రాజపక్స అధ్యక్షుడిగా, ఆర్థిక మంత్రిగా ఉన్న ఈ కాలంలో అప్పులు ఇంతగనం పెరుగుతున్నా ప్రజలు మళ్లీ మళ్లీ మహిందా కుటుంబానికి పట్టంగట్టడానికి కారణం ఉంది. వారి కాలంలో ఉన్న ఆ దేశ ద్రవ్యోల్బణం చూస్తే దానికి సమాధానం దొరుకుతుంది. 2005లో మహిందా అధికారంలోకి వచ్చే నాటికి ఉన్న ద్రవ్యోల్బణం11.64 శాతం అయితే, అది 2015  నాటికి 3.77 శాతానికి తగ్గింది. 2008 లో అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక మాంద్య పరిస్థితుల్లో నమోదైన సుమారు 22 శాతం ద్రవ్యోల్బణాన్ని మరుసటి సంవత్సరం కల్లా 3.45 శాతానికి తగ్గించటం ఆర్థిక మంత్రిగా మహిందా ప్రభుత్వం సాధించిన విజయం. ఇదే కాలంలో నిరుద్యోగితను 7.67 శాతం నుంచి 4.52 శాతానికి తగ్గించారు. 2005 నుంచి 2015 మధ్యకాలం లో ఈ నిల్వలు 2.73. బిలియన్ డాలర్ల నుంచి సుమారు 8.21 బిలియన్ డాలర్ల వరకు పెరిగాయి. ఇలా రాజకీయంగానూ, ఆర్థికం గాను సాధించిన విజయాలే మహిందా కుటుంబం పట్ల శ్రీలంక రాజకీయాల్లో పెరిగిన ఆదరణకు పునాది రాళ్లు అయ్యాయి. 

2019 ఏప్రిల్ ఈస్టర్ బాంబింగ్స్ తో.. 

2019 ఏప్రిల్ లో జరిగిన ఈస్టర్ బాంబింగ్స్ శ్రీలంక రాజకీయాల్లో భయాందోళనలకు కారణమయ్యాయి. ఎల్​టీటీఈ పట్ల కఠిన వైఖరి అవలంబించిన గొటబయ రాజపక్స అయితేనే తమకు మేలని భావించిన ప్రజలు అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో అధికారం కట్టబెట్టారు. ఆ సమయంలో రక్షణ శాఖ కార్యదర్శిగా పనిచేసిన గొటబయ విధానాలు, మహిందా అందించిన రాజకీయ నాయకత్వం విజయాలకు బాటలు వేయగా, ఈ విజయాలే ఆ కుటుంబం ఆ తర్వాత కాలంలో మితి మీరిన ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకునేలా చేసింది. అలా తీసుకున్న నిర్ణయాలు, విధానాలు శ్రీలంకను అధోగతి పాలు చేశాయి. 2019 లో గొటబయ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆయన అవలంబించిన విధానాల ఫలితంగా విదేశీ మారక ద్రవ్యం తగ్గి 2019 చివరి నాటికి 7.65 బిలియన్లకు చేరాయి. మార్చి 2022 నాటికి 1.6 బిలియన్ల కన్నా కింది స్థాయికి పడిపోయాయి. ఇదే సమయంలో 2005లో 1 బిలియన్ డాలర్ల కన్నా తక్కువగా ఉన్న వాణిజ్య లోటు 2021 నాటికి సుమారు 3 బిలియన్ డాలర్లకు పెరిగింది. వాణిజ్య లోటును తగ్గించుకోవడానికి గొటబయ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు తోడు కరోనా, రష్యా ఉక్రెయిన్ యుద్ధం లాంటి అంతర్జాతీయ పరిణామాలు.. శ్రీలంకలో దారుణ పరిస్థితులకు కారణమైనట్లు తెలుస్తోంది. 

స్వదేశీ ఆర్థిక విధానాలు..

ప్రతి దేశం దిగుమతులు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తే అది ఆర్థిక జాతీయవాదానికి దారి తీసి అంతర్జాతీయ వాణిజ్యానికి ఆటంకం ఏర్పడుతుందని, అది దేశాల మధ్య అపనమ్మకాలకు దారితీస్తుందని, ఇలాంటి జాతీయవాదాన్ని నిరుత్సాహపరచడానికి ఉద్దేశించి ఏర్పాటు చేసిన వరల్డ్ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి, అంతర్జాతీయ వాణిజ్య సంస్థ లాంటి ఆర్థిక సంస్థల పాత్ర శ్రీలంక లాంటి దేశాలు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఏమిటి అనేది అతి పెద్ద ప్రశ్న. ఇలాంటి ఆర్థిక పరిస్థితులు ఎదురైన దేశాల్లో ఆర్థిక సరళీకరణ, పన్నుల పెంపుదల, సబ్సిడీల తరుగుదల, లాంటి ప్రభుత్వ ఆదాయం పెంచే మార్గాలను, ఈ ఆర్థిక సంస్థలు ముందుగా ప్రతిపాదిస్తాయి. వాటితో పాటు అప్పుల, వడ్డీల రీషెడ్యూలింగ్, దిగుమతుల కోసం, విదేశీ మారక ద్రవ్యం కోసం ఆర్థిక సాయం లాంటి చర్యలు ప్రతిపాదిస్తాయి. ఆ దేశం దగ్గర మిగతా ఆప్షన్స్ లేకపోవడంతో వీటిని పాటించక తప్పదు.  దేశాలకు ఇలాంటి గడ్డు పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రాంతీయ సహకారం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. 1995 మధ్య కాలంలో సౌత్ ఈస్ట్ ఆసియన్ దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు దిగజారినప్పుడు ఆసియాన్ లాంటి వ్యవస్థలు అనుసరించిన విధానాలు, తీసుకున్న చర్యలు ఎంతో ఉపయోగపడ్డాయి. ముఖ్యంగా ప్రాంతీయ మార్పిడి రేటు వ్యవస్థలు, వస్తు మార్పిడి పద్ధతులు, ప్రాంతీయ వాణిజ్య విధానాలు ఆ ఆర్థిక వ్యవస్థలు మళ్లీ గాడిన పడేందుకు సహకరించాయి.
 దేశాల ఆర్థిక వ్యవస్థలకు స్వయం సమృద్ధి ఎంతటి మేలుచేస్తుందో, గ్రీన్ రెవల్యూషన్, మేక్ ఇన్ ఇండియా లాంటి విధానాలు దేశాలు నిలదొక్కుకోవడానికి ఎలా దోహదం చేస్తాయో, స్వయం చాలక, స్వదేశీ వ్యవస్థిత ఆర్థిక విధానాలు దేశాలకు ఎందుకు ముఖ్యమో శ్రీలంక పరిణామాలు మనకు తెలియజేస్తాయి. 

- గద్దె ఓంప్రసాద్, ఇంటర్నేషనల్ ​ఎఫైర్స్​ ఎక్స్​పర్ట్