మనిషిని, మనిషిగా తెలియజేసేది.. సాటి వారికి సహకరించే ఉపకార గుణమే!

మనిషిని, మనిషిగా తెలియజేసేది..  సాటి వారికి సహకరించే ఉపకార గుణమే!


“నా వల్ల కాదు. ఇలాంటి వాటికి పరుగెత్తి, దేశసేవ చేయడానికి నాకేం పని లేదా?” ఉరిమిచూస్తూ గయ్యిమంది కృష్ణవేణి.
‘‘అత్తయ్యా! ప్లీజ్. ఇంకెప్పుడూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టను కదా!” సున్నితంగా అడిగింది కావ్య.
“సరే! ఇంకెప్పుడూ ఇలాంటివి ఇంటి మీదకు తెచ్చి పెట్టకు.” కాస్త మెత్తబడినట్టుగా అంది వసుధ.
“థ్యాంక్స్ అత్తయ్యా. నాకు ఆడిటింగ్ లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేదాన్ని కాదు.” అంటూ హడావుడిగా ఆఫీసుకు వెళ్ళిపోయింది కావ్య.
కావ్య వెళ్ళిన వైపు విసుగ్గా చూసి చెల్లెలికి ఫోన్ చేసింది. ఎందుకో అటు నుండి రెస్పాన్స్ రాలేదు. ‘‘అందరూ బిజీయే. నేను మాత్రమే ఖాళీగా ఉన్నా అనుకుంటారేమో అంతా” కోడలు మీద చిరాకును మొబైల్ మీద చూపిస్తూ బెడ్ మీద పడేసింది.  
“వదిన గారూ....”  అన్న పిలుపుతో హాల్లోకి వచ్చి, “రండి, రండి” అంటూ గుమ్మంలో నిలబడిన పక్కింటి సునందను ఆహ్వానించింది.
“ కావ్య ఆఫీసుకు వెళ్ళిందా? ఈరోజు ఏకాదశి కదా... సాయంత్రం సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాం. మీరందరూ తప్పకుండా రండి.”
 “అలాగే తప్పకుండా.”
“ఎలా ఉంది మీ కొత్త కోడలు? అంతా అలవాటు పడిందా? మీతో బాగానే ఉంటోంది కదా” ఒకింత ఆరాగా అడిగిందావిడ.
చెప్పుకోవడానికి ఒకరు దొరికారన్న ఆనందంతో కృష్ణవేణి ముఖం విప్పారింది. “ఆ... బాగానే ఉంటుంది కాకపోతే మన రోజులు కావు కదా ఇవి. మంచితనం మనకీ ఉండేది కాస్త పప్పో, ఉప్పో అప్పు ఇవ్వడం వరకు. అంతేకాని అందరి సమస్యలు నెత్తిన పెట్టుకోవడం మన  రోజుల్లో ఆడవాళ్ళం ఎరగం. ఏమన్నా అంటే బొత్తిగా ఉపకార గుణం  లేనిది అనుకుంటారని భయం.”
“అయ్యో ఏమైంది?”
“నిన్న ఆఫీస్​లో ఆడిటింగ్ వలన ఆలస్యం అయ్యి సుమారు ఏడున్నర ప్రాంతంలో ఇంటికి వస్తుంటే ఎవరో అమ్మాయి, హైవే పక్కనున్న అడ్డదారి నుంచి పరుగెత్తుకుంటూ రోడ్డు మీదకు వచ్చిందట.”
“ఆహా !” వింటున్న వసుధ గారి కళ్ళల్లో ఉత్సుకత.
“సిటీకి దూరంగా ఉన్న ఏరియా కదా...  హైవే మీద పెద్దగా రద్దీ లేదు. పరుగెత్తి, పరుగెత్తి అలసిపోయి కావ్య వస్తున్న ఆటోకు అడ్డంగా పడితే, హాస్పిటల్​లో జాయిన్ చేసి తెల్లవార్లూ అక్కడే ఉండి పొద్దున్నే ఇంటికి వచ్చింది.”
“ఊ.....”
“ఆ అమ్మాయి నీరసంతో కళ్ళు తెరవలేదు. అందుకని ఆ అమ్మాయి ఎందుకలా అయిపోయిందో? కనుక్కుని తన వారికి కబురు పెట్టమని ఈ రోజు ఆ పని నాకు అప్పజెప్పింది.”
“అదేదో పోనీ తనే చేయకపోయిందా?”
“తనకు ఆఫీస్ సెలవు పెట్టే అవకాశం లేదట. ఒకసారి నన్ను వెళ్ళి ఉండమని సాయంత్రం వీలుంటే త్వరగా వచ్చేస్తా అని చెప్పింది.’’
“దారిన పోయే తద్దినం నెత్తిన పెట్టుకున్నది చాలక. తిరిగి నాకు అప్పజెప్పడం ఏమిటో?  ఇంట్లో సురేష్ కూడా లేడు, క్యాంపుకి వెళ్ళాడు. అత్తగారు ఒక్కతే ఉంటుందని లేదు కానీ, ఈ దేశసేవకు మాత్రం లోటు లేదు” విసుగ్గా అంటున్న కృష్ణవేణిని చూసి... “సర్లే వదినా. ఉపకారం మంచిదే! కాకపోతే మన వీలు చూసుకోవాలి” అటు కోడలి వైపు కాకుండా తన వైపు కాకుండా ఒక మాట అనేసి, ‘‘వస్తాను. ఇంకా పిలవాల్సిన వారున్నారు’’ అంటూ వెళ్ళిపోయింది.
“ఎవరో ? ఏమిటో? తెలీదు. ఎందుకొచ్చిన గొడవ? కావాలంటే కాస్త తినడానికి పెట్టించి వదిలేయొచ్చు. కానీ..ఈ సేవలు, పరామర్శలూ ఏమిటో? ” అనుకుంటూ  లేచి తలుపు తాళం పెట్టి బయల్దేరింది.
‘‘అయినా పెండ్లై  మూడు నెలలైనా దాటలేదు. అప్పుడే అత్తగారికి ఇలా పనులు చెప్పడం మొదలు పెట్టిందంటే... ముందు ముందు ఎలా ఉంటుందో?”  ఆటోలో గొణుక్కుంటూ కూర్చుంది. 
“ఇలాంటివి ఇంటి మీదకు తేవద్దని గట్టిగా చెప్పాలి” అనుకుంటూ ఆటో దిగి హాస్పిటల్ లోపలకు వెళ్ళింది. వివరాలు కనుక్కుని లోపలకు వెళ్ళేసరికి బెడ్ మీద సెలైన్ పెట్టి ఉన్న యువతిని చూసి హతాశురాలైంది. ఆమెను పరీక్షించడానికి వచ్చిన డాక్టర్ బయటకు వెళ్ళబోతూ ఈమెను ప్రశ్నార్థకంగా  చూసి ఆగాడు.
‘‘ఏమైంది డాక్టర్?” అనడిగింది ఆశ్చర్యంగా.
‘‘మీరెవరు?”  రాత్రి జాయిన్ చేసింది తను కాదు కనుక ముఖం వంక పరిశీలనగా చూస్తూ అడిగాడు డాక్టర్.
“నే....నేను ఆ అమ్మాయి పెద్దమ్మనండీ!”
“ఎవరూ లేకుండా వెళ్ళిపోతే ఎలా?.”
“.....................................”
“మార్నింగ్ మెలకువ వచ్చింది. మరేం ప్రమాదం లేదు. రాత్రి పని మీద బయటకు వచ్చినపుడు ఎవరో దుండగులు వెంటపడితే పారిపోయి అలా హైవే మీదకు వచ్చిందట. ఆటో కింద పడడం వరకూ గుర్తుందని చెప్పింది.”


“అయ్యో!”
“ బాగా భయపడింది. మధ్య, మధ్య ఉలిక్కిపడి లేస్తోంది. అందుకని రెస్ట్ కోసం మళ్ళీ మత్తు ఇంజక్షన్ ఇచ్చాం. రెండు రోజులు బాగా విశ్రాంతి తీసుకోనివ్వండి” నోరెళ్ళ బెట్టి ఆశ్చర్యంగా వింటున్న కృష్ణవేణితో చెప్పి రూమ్ బయటకు వెళ్ళిపోయాడాయన.
“భగవంతుడా... సమయానికి కావ్య అటు వెళ్లకపోతే ఏమయ్యేదో? పరీక్షలు కావడంతో కావ్య, సురేష్​ల పెళ్ళికి భావన రాలేదు. ఇంకా చుట్టాలందరి ఇళ్ళకీ వెళ్ళలేదు కనుక భావన ఎవరో కావ్య కూడా గుర్తు పట్టలేకపోయింది.”
“బహుశా భావన కనపడడం లేదన్న కంగారులోనే సుజాత తన ఫోన్ తీయలేదేమో’’ అనుకుంటూ సుజాత నెంబర్ మళ్ళీ డయల్ చేస్తూ రూమ్ బయటకు వచ్చింది. ఫోన్ తీయగానే భావన క్షేమంగా ఉందని జరిగిన విషయమంతా చెప్పింది.
“ఎవరన్నది తెలియకపోయినా సాయపడాలి అనుకుంది కనుక సరిపోయింది. అదే తన నోటికి జడిసి, భావనను  పట్టించుకోకుండా ఇంటికి వచ్చేసి ఉంటే....”   ఆ..... ఊహకే ఆమెకు భయంతో చెమటలు పట్టేశాయి. 
భావనకే సాయం చేస్తోందని తెలియక నానా మాటలు అనేసింది. ఇప్పుడిదంతా కావ్యకు తెలిస్తే తన మొహం ఎలా చూపించాలి? కోడల్ని తలుచుకుంటే కృష్ణవేణి మనసు పరిపరి విధాలుగా పోతోంది.  సాయంత్రం కోడలు వచ్చాక, తన చెల్లెలు కావ్య చేతులు పట్టుకుని ఆమె  చేసిన సాయం గురించి కృతజ్ఞతలు చెప్తుంటే కృష్ణవేణి మనసు సిగ్గుతో చితికిపోసాగింది. కోడలు కళ్ళలోకి చూసే ధైర్యం లేక, ఏమీ ఎరగనట్టు నెమ్మదిగా కారిడార్​లోకి వెళ్లి కుర్చీలో కూలబడింది. పక్కనే కూర్చున్న ఒక వ్యక్తి మొబైల్​లో ఎవరిదో ప్రవచనం వింటున్నాడు.


కష్టంలో ఉన్నప్పుడు ఎవరినుండైనా  సాయం  పొందితే  ఎంత ఆనందంగా ఉంటుందో, పక్క మనిషి  కష్టంలో ఉన్నప్పుడు సాయం చేస్తే కూడా అంతే ఆనందం పొందాలి. సాయం చేయడానికి మనవారా? కాదా? అని చూడకూడదు. అలా చూస్తే మనిషి అనే పదానికి అర్థం ఉండదు. నిష్కల్మషంగా చేసే సాయం ఏ రూపంలో అయినా మనకు చేరవచ్చు. మనిషిని, మనిషిగా తెలియజేసేది సాటి వారికి సహకరించే ఉపకార గుణమే!
“భగవంతుడా... సమయానికి కావ్య అటు వెళ్లకపోతే ఏమయ్యేదో? పరీక్షలు అవడంతో కావ్య, సురేష్​ల పెళ్ళికి భావన రాలేదు. వీళ్లు చుట్టాలందరి ఇళ్లకీ వెళ్ళలేదు కనుక భావనను కావ్య గుర్తు పట్టలేకపోయింది.”
“భావన కనపడడం లేదన్న కంగారులోనే సుజాత ఫోన్ తీయలేదేమో’’ అనుకుంటూ సుజాత నెంబర్ మళ్ళీ డయల్ చేస్తూ రూమ్ బయటకు వచ్చింది.