స్వయం పాలన ఫలితాలెక్కడ?

స్వయం పాలన ఫలితాలెక్కడ?

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక ఏర్పడిన ప్రభుత్వం ఎనిమిదేళ్లలో ఏం సాధించింది? ఎటు నుంచి ఎటు వైపు ప్రయాణించింది? ఉద్యమ లక్ష్యాలను సాధించిందా..?  ఎవరి ప్రయోజనాలు నెరవేరాయి. ఎవరి జీవితాల్లో వెలుగులొచ్చాయి? ఎవరి భవిష్యత్తుకు బంగారు బాటలు  పడ్డాయి?  చెప్పిన మాటలకు, చేస్తున్న పనులకు పొంతన ఉందా? ఇత్యాది  విషయాలపై తప్పకుండా  చర్చ చేయాల్సిన సందర్భం ఇది. మనస్సుకు భారం అన్పించినా, కొన్ని కొన్ని వాస్తవాలు అంగీకరించక తప్పదు. అది వ్యక్తులుగా అయినా, వ్యవస్థగా అయినా సరే.  తెలంగా ణా తనను తాను  తెలుసుకోవడంలో ఎప్పుడూ ముందే ఉంటుంది. తాను జాగృతం అవుతుంది. తన పరిసరాలను ప్రభావితం  చేస్తుంది. ఇది ఈ మట్టికున్న సహజత్వం. ప్రత్యేకత కూడా. 

వందలాది మంది ఆత్మబలిదానాలు, యావత్ తెలంగాణ సమాజం ఏక తాటిపైకొచ్చి కొట్లాడితే  రాష్ట్రం వచ్చింది. ఆంధ్రా  పాలకుల నియంతృత్వ, పక్షపాత, వివక్ష, నిర్లక్ష్య, తిరస్కరణ, ఆత్మగౌరవం దెబ్బ తీసే చర్యలకు వ్యతిరేకంగానే ఉద్యమం ఊపిరి పోసుకున్నది. కానీ నేడు ఇలాంటి అనుభవాలనే స్వయం పాలనలో సైతం తెలంగాణ  అనుభవిస్తున్నది.  తమకు నచ్చినట్లు, తాము మెచ్చినట్లు పాలిస్తాం అనే వాళ్ల వల్ల తన ఆత్మగౌరవాన్ని సాంతం కోల్పోయినట్లుగా ఈ ఎనిమిదేళ్ల పాలన అనుభవపూర్వకంగా తెలంగాణా తెలుసుకున్నది. ఓ పూట అన్నం లేక పోయినా ఫర్వాలేదు. కానీ, ఆత్మగౌరవాన్ని దెబ్బతిననీయదీ నేల. అలాంటిది ఈ నేల నేడు మౌన ముద్రలోకి... సుప్తచేతనావస్థలోకి వెళ్లినట్లుంది. ప్రజల ప్రేమాభిమానాలతో చెలగాటం ఆడుతున్నా స్పందనా రాహిత్యంగా ఉన్నది. తమకు స్కీంలివ్వండి.. మీకు సీట్లిస్తం అనే ధోరణి సమాజంలో ప్రబలుతున్నదా..? అనే వేదన కూడా కలుగుతున్నది.

54శాతం వాళ్లంటే  దొరకు చులకన!

బీసీలంటే దొరగారి మీటింగ్ లకు మందిని తెచ్చేవారు, గొర్లు, బర్లు కాసుకునే వారు, ఆత్మగౌరవ భవనాలకు అమ్ముడుపోయేవారు. అంతే తప్ప.. అధికారంలో పాలుపంచుకునే వారు, చట్టాలు చేసేందుకు అర్హులు కారు. అభివృద్ధికి నోచుకునే వారు కాదు. అందుకే దొర 2017లో మీటింగ్ పెట్టి మూడు రోజులు ముచ్చట చేసిన 210 తీర్మానాలు మూలకు పెట్టిండు. బీసీ సబ్ ప్లాన్ లేదు. ఇండస్ట్రియల్ పాలసీ లేదు. నిధులు లేవు. ఫీజు రియింబర్స్‌‌‌‌మెంట్ లేదు. 210 తీర్మానాలను గంగలో కలిపాడు. దొర మాటిచ్చి 4 ఏళ్లైనా బీసీ పాలసీ అమలు పత్తా లేదు. ఇది దొరగారికి 54 శాతం ఉన్న బీసీలపై ఉన్న ప్రేమ. 

కమిషన్​ ప్రాజెక్టులు తప్ప, పెండింగ్ ప్రాజెక్టులు పట్టవు! 

కృష్ణానది, దాని ఉపనదులపై నిర్మాణదశలో ఉన్న ప్రాజెక్టులకు నిధులెందుకు లేవు? వీటి కోసం  లక్షల కోట్ల బడ్జెట్ లో ఓ నాలుగు వేల కోట్లు ఖర్చు చేయడం లేదు.  ఎందుకు? భీమా, కోయిల్ సాగర్ వంటి ప్రాజెక్టులకు చిన్నమొత్తాలు కేటాయిస్తే సుమారు ఐదు లక్షల ఎకరాలు సాగులోకి వస్తుంది. భారీ ప్రాజెక్టు.. అంతకు మించిన భారీ కమిషన్లు.  పాత పెండింగ్​ ప్రాజెక్టులకు నిధులు ఉండవు. దీని గురించిన చర్చ ఎక్కడా ఉండదు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఒక్కరికీ శుద్ధి చేసిన తాగునీరు ఇవ్వకుండా ఓట్లు అడగబోమని ముఖ్యమంత్రి పదే పదే చెప్పినా, ఇప్పటి వరకు 40% ఇళ్లకు మాత్రమే నీరు చేరింది. అవి కూడా తాగే యోగ్యం లేవు. మళ్లీ మినరల్​ వాటర్​ కొనుక్కునే తాగుతున్నారు.  

విద్యపై నిర్లక్ష్యం.. ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుందనా?

వర్సిటీలు నిర్లక్ష్యపు నీడలో కొట్టుమిట్టాడుతున్నాయి. విశ్వవిద్యాలయాల్లోని ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయడం లేదు. రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం లేదు.  బాగా చదువుకుంటే ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుందని యూనివర్సిటీల్లో ఖాళీలు భర్తీ చేయడం లేదా? ఇప్పుడు యూనివర్సిటీ భూములపై అధికార పార్టీ నాయకుల కన్ను పడింది. 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ముస్లింలకు అన్యాయం చేశారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి జాడే లేదు. బంగారు తెలంగాణ చేస్తామని చెప్పిన పాలకులు బార్​ల తెలంగాణ.. బీర్​ల తెలంగాణగా మార్చారు.

సమయం ఆసన్నమైంది

వందల యేండ్ల తండ్లాట నుంచి తనను తాను విముక్తం చేసుకున్న తెలంగాణ మరింత అప్పుల్లోకి పోతున్నది. తన ఆత్మగౌరవాన్నీ కోల్పోతున్నది. అంతకు మించి భవిష్యత్​నూ కోల్పోతున్నది. తొలి పదేళ్ల పాలనా కాలమే ఆ రాష్ట్ర భవిష్యత్తుకు పునాది. అది ఏక పక్షంగా. స్వీయపక్షంగా  ఉన్నందు వల్లనే ఇట్లా జరుగుతున్నది. దీన్ని నివారించాల్సిన చారిత్రక అవసరం ఇప్పుడు తెలంగాణ సమాజం ముందు ఉన్నది.  ఇవన్నీ తెలంగాణ ప్రజలు, మేధావులు గమనిస్తూనే ఉన్నారు. ఈ ప్రాంత ప్రజలకు మరో విశిష్ట లక్షణం కూడా ఉన్నది. తన ఆత్మగౌరవం దెబ్బతిన్నదని, తనకు భవిష్యత్తు లేదని గుర్తించిన రోజున తన ప్రకోపాన్ని చూపిస్తుంది. తనను తాను ఆవిష్కరించుకుంటుంది. స్వయం పాలనకు అసలు నిర్వచనం వెతుక్కుంటున్నది.  దానికి సమయం ఆసన్నమైంది. 

పేదోనికి ఒక్క బెడ్​ రూమైనా రాలే!
సారుకైతే లెక్కలేనన్ని బెడ్​ రూమ్​లు ( ప్రగతిభవన్)​!

టీఆర్ఎస్.. బీఆర్ఎస్ అయింది.  ఢిల్లీలో బీఆర్ఎస్ భవనం ఏర్పాటు అయింది. భూసేకరణలో పేదోని ఇల్లుపోయింది.  ప్రతీ పౌరునిపై లక్షన్నర కు పైగా అప్పైంది. బీఆర్ఎస్  దేశంలోనే ధనిక  పార్టీగా అవతరించింది. సొంతంగా ఓ విమానం కొనే స్థాయికి చేరుకున్నది. కానీ తెలంగాణ పేద జనం సర్కారు వారిచ్చే పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నది.  కులానికో ‘బంధు, భవన్’ ల  పేరుతో భవిష్యత్తును అంధకార బంధురం చేస్తున్నారు. డబుల్‌‌‌‌ బెడ్‌‌‌‌రూమ్‌‌‌‌ ఇళ్ల కోసం పేదలు గత ఎనిమిది ఏళ్ళుగా నిరీక్షిస్తున్నా.. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లోని కొన్ని గ్రామాల్లో తప్ప రాష్ట్రంలో ఎక్కడా పేదలకు డబుల్‌‌‌‌ బెడ్‌‌‌‌రూమ్‌‌‌‌ ఇళ్లు ఇవ్వలేదు. కేసీఆర్​కు లెక్కలేనన్ని బెడ్​రూమ్ ల ప్రగతి భవన్​ దక్కింది. కానీ పేదోళ్ల కు ఒక్క బెడ్​రూమ్​ ఇల్లైనా దొరకలేదు.  ఇదేనా స్వయం పాలన?

గుప్పెడు మంది కోసం

ముఖ్యమంత్రి జనాన్ని కలువకున్నా ఫర్వాలేదనే తీరు బలపడుతున్నది. ఎనిమిదేళ్ల తెలంగాణ ఆర్థిక నమూనా అంతా  గుప్పెడు మంది ప్రయోజనాల కోసమే అన్నట్లుగా ఉంది. గోదావరిపై వరుసగా  మూడు వంతెనలు కట్టి లక్షన్నర కోట్ల కాశేళ్వరం ప్రాజెక్టు అన్నారు. హైదరాబాద్ లో నాలుగు బ్రిడ్జిలు కట్టి ఇదే విశ్వనగరం అని  నమ్మిస్తున్నారు. తాము కొత్తగా కొన్ని ఫామ్ హౌజ్​లకు, రోడ్లు, తమ బంధుగణాలు,  భూ దందాలకు బినామీలు ధరణి పోర్టల్ ను ఆధారం చేసుకున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పేదల భూములను చెరపడుతున్నారు. దళితుల భూములను ఇష్టారీతిన లాక్కుంటున్నారు. ఎవ్వరెంత మొత్తుకున్నా డోంట్ కేర్ అన్నట్లుందీ పాలన. ఇలాంటి తెలంగాణనా కోరుకున్నది?  నాడు దొరలను చూసేందుకు జనం భయపడే వారు. కానీ ఈ దొర చూద్దామన్నా  దొరకడం లేదు.

 - పొన్నం ప్రభాకర్, లోక్​ సభ మాజీ సభ్యుడు, కరీంనగర్