ఇండియా ఇక భారత్!.. రాజ్యాంగంలో ఏముంది? .. సుప్రీంకోర్టు ఏం చెప్పింది?

ఇండియా ఇక భారత్!..  రాజ్యాంగంలో ఏముంది? ..   సుప్రీంకోర్టు ఏం చెప్పింది?

మన దేశాన్ని ఏ పేరుతో పిలవాలన్న అంశాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్ 1లో పేర్కొన్నారు. ఆర్టికల్ 1 డ్రాఫ్ట్ ను కాన్ స్టిట్యూయెంట్ అసెంబ్లీ 1949, సెప్టెంబర్ 18న ఆమోదించింది. దేశం పేరుపై చర్చ సందర్భంగా భారత్, హిందూస్థాన్, హింద్, భారత్ భూమి, భరత్ వర్ష్ వంటి పేర్లతో డ్రాఫ్ట్ కమిటీ సభ్యుల నుంచి అనేక సూచనలు వచ్చాయి. కమిటీలోని కొందరు సభ్యులు భారత్ అనే పేరుకు, ఇతర సభ్యులు ఇండియా అనే పేరు పెట్టేందుకు మొగ్గు చూపారు. దీంతో ఆర్టికల్ 1(1)లో పేర్కొన్న ‘ఇండియా అంటే భారత్, రాష్ట్రాల సమాఖ్యగా ఉంటుంది’ అన్న ప్రకటనకు కాన్​స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. మన దేశాన్ని అధికారికంగా ఏ పేరుతో పిలవాలన్న దానికి సంబంధించి రాజ్యాంగంలో ఉన్న ఏకైక వివరణ ఇదే.   

ఇండియా పేరును భారత్ గా మార్చాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఇదే విషయంపై గతంలో సుప్రీంకోర్టులో రెండు సార్లు పిటిషన్లు సైతం దాఖలయ్యాయి. అయితే, ఆ పిటిషన్లను తోసిపుచ్చుతూ సుప్రీంకోర్టు కీలక కామెంట్లు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 1ని సవరించి, దేశం పేరును భారత్ గా మార్చాలని కోరుతూ ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ఒకరు 2020లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.‘‘ఇండియా అనే పదం గ్రీకు భాషలోని ఇండికా అనే పదం నుంచి పుట్టింది. ఇండియా అనే ఇంగ్లిష్ పేరు దేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించడం లేదు. దేశం పేరును భారత్ అని మార్చడం వల్ల బానిసత్వపు పాలన గుర్తులను పౌరులు చెరిపేసుకునేందుకు వీలవుతుంది” అని పిటిషనర్ పేర్కొన్నారు. 

ఇండియా పేరును భారత్ గా మార్చడం ద్వారా.. మన పూర్వికులు ప్రాణాలొడ్డి సాధించిన స్వాతంత్ర్యానికి  న్యాయం చేసినట్లు అవుతుందన్నారు. అయితే, ఈ పిటిషన్ ను అప్పటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ శరద్ బాబ్డే బెంచ్ కొట్టివేసింది. ‘‘రాజ్యాంగంలో భారత్, ఇండియా అనే రెండు పేర్లూ ఉన్నాయి. రాజ్యాంగంలో ఇండియాను ఆల్రెడీ భారత్ అని పిలుస్తున్నారు కదా” అంటూ తీర్పు సందర్భంగా సీజేఐ శరద్ బాబ్డే కామెంట్ చేశారు. దీనికంటే ముందు 2016లోనూ సుప్రీంకోర్టులో ఇలాంటిదే ఓ పిటిషన్ దాఖలైంది. దానిని అప్పటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ తిరస్కరించారు. ‘‘దేశాన్ని ఇండియా అని పిలవాల్నా? లేదంటే భారత్ అని పిలవాల్నా? అన్నది నిర్ణయించుకునే హక్కు ప్రతి భారతీయుడికీ ఉంది. ఒక పౌరుడు దేశాన్ని ఏ పేరుతో పిలవాలన్నది సుప్రీంకోర్టు నిర్ణయించలేదు” అంటూ సీజేఐ ఠాకూర్ కామెంట్ చేశారు.